పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చీఫ్ గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా నియమితులైన ఆసిమ్ మునీర్‌కు బజ్వా కమాండ్ బ్యాటన్ అందించారు. కమాండ్ బ్యాటన్‌ను అందుకోవడంతో ఆసిమ్ మునీర్ అధికారికంగా ఆర్మీ చీఫ్ అయ్యారు. అంతకుముందు దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌తో జనరల్ బజ్వా సమావేశమయ్యారు.
కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇద్దరు సీనియర్ జనరల్స్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు జనరల్స్ కూడా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితులు కావడం విశేషం. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ప్రజామోదం మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త ఆర్మీ చీఫ్ వచ్చినా తమ డిమాండ్ లో ఎలాంటి మార్పు లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెగేసి చెప్పారు.
సైన్యంపై ఉన్న అపోహలను తొలగించి దేశ ప్రజలకు సైన్యంపై విశ్వాసం కల్పించాటమే లక్ష్యం అని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అన్నారు. ఆసిమ్ మునీర్ కు తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్(TTP) మిలిటెంట్లు సవాలుగా మారారు. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన Tehreek-e-Taliban Pakistan (TTP)…పాక్ సైన్యంపై దాడులకు దిగాలని తన క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రం, ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో TTP బలంగా ఉంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల అణచివేతలో అమెరికాకు పాకిస్తాన్ సహకరించటం వ్యతిరేకించిన పాకిస్తాన్ తాలిబాన్ లు పాక్ సైన్యం అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతారు. తాలిబాన్ ల లో ఎక్కువగా పష్టున్ తెగవారే ఎక్కువగా ఉంటారు. ఆఫ్ఘన్ లో కూడా పష్టున్ వర్గం ఎక్కువ. అయితే పాక్ ప్రభుత్వంలో పంజాబ్ రాష్ట్ర నాయకులు, అధికారులదే పెత్తనం.. దాంతో మొదటి నుంచి వీరికి పాక్ ప్రభుత్వం అంటే వ్యతిరేకతే.