Saturday, November 23, 2024
HomeTrending Newsఅప్పుల ఉబిలో పాక్... గట్టెక్కేందుకు పాట్లు

అప్పుల ఉబిలో పాక్… గట్టెక్కేందుకు పాట్లు

అల్ ఖైదా చీఫ్ అల్ జవహారీని తుద ముట్టించటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయంగా బహుళ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండన ప్రకటనలు తప్పితే షా బాజ్ ప్రభుత్వం మరేమీ మాట్లాడటం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో పాక్ నాయకత్వం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే అక్టోబర్ లో ఫైనాన్సియల్ ఆక్షన్ టాస్క్ ఫోర్సు (FATF) సమావేశం ఉంది. అందులో మరోసారి ఉగ్రవాదానికి ఉతమిస్తున్న దేశంగా పాక్ పేరు చేరితే అంతే సంగతులు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ మాదిరిగా అంతర్జాతీయంగా ఆర్థిక సాయం నిలిచిపోతుంది. ఇప్పటికే FATF గ్రే లిస్టులో ఉండి పాకిస్తాన్ అష్టకష్టాలు పడుతోంది.

ఆర్థిక కష్టాలకు తోడు తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తదితర సంస్థలతో అంతర్గతంగా శాంతిభద్రతలు క్షీణించాయి. దీంతో దేశానికి పెట్టుబడులు రావటం ఎప్పుడో ఆగిపోయింది. ఉన్న కొందరు ఏదో వంకతో దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. వీటన్నింటిని తట్టుకునేందుకే లోపాయికారిగా అమెరికాకు అల్ జవహరి సమాచారం పాకిస్తాన్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహరాల శాఖ మంత్రి, తాలిబాన్ లో ప్రముఖ నాయకుడు సిరాజుద్దీన్ హక్కాని గృహంలో ఉన్న అల్ జవహరిని అంతమొందించటం ఆషామాషీ కాదు. అప్పుల ఉబి నుంచి బయట పడేందుకే పాకిస్తాన్ టాప్ లిస్టు లోని ఉగ్రవాదుల జాడలు అమెరికాకు ఇచ్చిందని సమాచారం.

పాకిస్తాన్ లో దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితులు ఆ దేశ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మతం కోణంలో ఉపఖండంలోని దేశాల్లో ఎక్కడ ఉపద్రవం సంభవించినా దాని మూలాలు పాకిస్తాన్ తో ముడిపడి ఉండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో అంతర్జాతీయంగా సహాయం కొరవడుతోంది. ప్రపంచంలో ఒక్క సౌది అరేబియా తప్పితే ఏ దేశం పాకిస్తాన్ కు సాయం చేయటం లేదు. చైనా వెన్ను దన్నుగా ఉన్నా రూపాయి సహాయం చేసి వెయ్యి రూపాయల ప్రతిఫలం తీసుకుంటోంది. అందులో భాగమే గ్వదార్ ఓడరేవు, సిపెక్ రహదారులు, గనుల ఒప్పందాలు… వీటితో పాకిస్తాన్ కన్నా చైనా దేశానికే ఎక్కువ మేలు జరిగింది. చైనా ప్రాజెక్టులపై ఇప్పటికే పాక్ ప్రజలు నిరసన గలమేత్తారు. బలోచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ, సింద్ రాష్ట్రాల్లో చైనా జాతీయులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి.

దీంతో దేశంలో శాంతిభద్రతలు, ఆర్థికవ్యవస్థ గాడిలో పెట్టడమే లక్ష్యంగా అమెరికాకు ఉగ్రవాదుల ఆనవాళ్ళు అందిస్తోంది. ఈ విషయంలో పాక్ నిబద్దతతో ముందుకు వెళితే ఉపఖండంలో సగం సమస్యలు తీరినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read :

అటు మేమే…ఇటు మేమే

RELATED ARTICLES

Most Popular

న్యూస్