Monday, February 24, 2025
HomeTrending NewsPakistan : ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం...పాక్ లో రాజకీయ ఉద్రిక్తత

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం…పాక్ లో రాజకీయ ఉద్రిక్తత

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధ్యక్షులు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు ఆదివారం తృటిలో తప్పింది. ఈ నెల ఏడు లోపు కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌ హజరవుతారని అతని న్యాయబృందం ఇచ్చిన హామీతో ఇస్లామాబాద్‌ పోలీసులు వెనక్కి వెళ్లారు. దీంతో ఆదివారం లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కొన్ని గంటలపాటు కొనసాగిన ఉద్రిక్తతలు పరిస్థితులు చల్లారాయి.

పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేయడానికి ఆదివారం లాహోర్‌లోని జమన్‌ పార్క్‌లో ఉన్న ఆయన నివాసానికి పెద్దఎత్తున పోలీసులు తరలివచ్చారు. పోలీసులను పీటీఐ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో మోహరించి అడ్డుకున్నాయి. దీంతో లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను ప్రధానిగా ఉన్న సమయంలో భారీగా వచ్చిన బహుమతులను తోషాఖానాలో జమ చేయకుండా అమ్ముకున్నాడని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరోపణలున్నాయి.

దీనికి సంబంధించి జరుగుతున్న కేసు విచారణకు ఇమ్రాన్‌ఖాన్‌ మూడుసార్లు ఇస్లామాబాద్‌ సెషన్‌ కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆయనను అరెస్ట్‌ చేయాలంటూ న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు ‘డాన్‌’ పత్రిక పేర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని ఫవాద్‌ చౌదరి హెచ్చరికలతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తమ నేతపై 74 కేసులు ఉన్నాయని, ఒక వ్యక్తి ఇన్ని కేసుల్లో కోర్టులకు హాజరు కావడం అసాధ్యమని ఫవాద్‌ అన్నారు. త్వరలో పంజాబ్‌లో జరగబోయే సాధారణ ఎన్నికలను వాయిదా వేయించడానికే పాలకులు ఇమ్రాన్‌ అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్