Sunday, September 8, 2024

వేదాంత పాఠం

Panchayat Office In Smashana Vatika:

“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”

ఇది అందరికీ తెలిసిన మహా మృత్యుంజయ మంత్రం. “మృత్యుంజయ” అని పేరు ఉండడంతో మృత్యువును జయించే మంత్రం అనుకుని లోకం భయ భక్తులతో తెగ జపం చేస్తూ ఉంటుంది. నిజానికి ఇది చావు భయాన్ని జయించే మంత్రం.

పండిన దోసకాయ తొడిమనుండి టక్కుమని విడివడినట్లు…మేము కూడా సమయం ఆసన్నమయినప్పుడు టక్కుమని దేహయాత్ర నుండి విడివడి అనంతయాత్రకు సిద్ధంగా ఉంటామని, ఉండాలని, ఉండక తప్పదని…మృత్యువు మాకు అమృతంతో సమానం అని ఎరుక కలిగించడమే ఈ మంత్రం పరమోద్దేశం. చావును జయించే మంత్రం వేదాల్లో లేనే లేదు. ఈ మంత్రం చావును జయించేది అని అనుకోవడం వల్ల పదేళ్లు ఎక్కువ బతికితే సంతోషమే. భయమే చావు; ధైర్యమే బతుకు.

ఎవరు ధర్మం తప్పినా తప్పవచ్చుగాక. చివరకు ధర్మానికి రాజు అని పేరు పెట్టుకున్న ధర్మ రాజే ధర్మం తప్పవచ్చుగాక. యముడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధర్మం తప్పడు. తప్పడానికి వీల్లేదు. అందుకే యమధర్మరాజు అయ్యాడు. సూర్యుడి కొడుకు యముడు, యముడి చెల్లెలు యమున. ఈమె తరువాత నదిగా మారింది.

యముడు అష్ట దిక్పాలకుల్లో ఒకడు. దక్షిణ దిక్కుకు అధిపతి. అందుకే వాస్తును నమ్మేవారందరూ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఓకే అంటారు కానీ- సౌత్ దక్షిణాభిముఖం జోలికి పోరు. సౌత్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటే ఆ గుమ్మం యముడిని చూస్తుందని వాస్తు విజ్ఞుల భయం. అక్కడికేదో ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నవారందరూ యుగయుగాలుగా యముడినే చూడనట్లు. యముడి పాశానికి పాపమే కొలమానం తప్ప…దిక్కులు కావు.

దున్నపోతుమీద నల్ల వస్త్రాలతో యముడు చేత పాశం పట్టి బయలుదేరితే, దున్నపోతు మెడలో గంట గణగణకే ప్రాణాలు ఆవిరైపోతాయి. అలాంటిది ఏ దిక్కున ఉన్నా యముడిని ఆపగలిగిన మొనగాడు ఒక్క మార్కండేయుడు తప్ప సకల పురాణాల్లో ఇప్పటిదాకా ఇంకొకడు లేడు. ఉండడు. మార్కండేయుడు కూడా శివుడి ఒడిలో ఉండబట్టి యముడి పప్పులు ఉడకలేదు. మనకు శివుడి ఒడిలో కూర్చునేంత సీన్ లేదు. కాబట్టి బుద్ధిగా యముడి ఒడిలో కూర్చోవడమే ఉత్తమం.

ఊరికి ఉత్తరంలో శ్మశానం ఉండాలి. ఊళ్లు పెరిగి పెరిగి శ్మశానాల చుట్టూ ఊళ్లు మొలిచాయి. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో పేరు మోసిన హోటల్ శ్మశానం ఎదురుగా ఉంటుంది. రోడ్డుకు అటు అంతిమ యాత్రలు, కట్టెలు, దింపుడు కళ్లేలు, శవ దహనాలు. శ్మశానానికి ఎదురుగా రోడ్డుకు ఇటు అరటి ఆకుల్లో పిండ ప్రదానాలు. ఇదొక ఆహార ఆరోగ్య వైరాగ్య సన్నివేశం. వేదాంత సంకేత సంబంధం.

అదే బంజారా హిల్స్ లో ఇంకో చోట కింద శ్మశానంలో పుర్రెలు కాలుతుంటాయి. పక్కనే అపార్ట్ మెంట్ బాల్కనీలో పేపర్ చదువుతున్న పెద్దాయన చేతిలో కాఫీ కప్పు పొగలు గక్కుతూ ఉంటుంది. ఇంకో చోట మహా ప్రస్థానంలో ఆధునిక విద్యుత్ యంత్రంలో దేహం చిటికెలో బూడిద అవుతూ ఉంటుంది. పక్కనే పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్లో పెళ్లి బఫేలో ఐటమ్స్ వేడి వేడిగా ఆవిర్లు కక్కుతూ ఉంటాయి. ఇదొక తాత్విక వాస్తవ శుభాశుభాల అభేదం.

“దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు”
అని అన్నమయ్య అందుకే అన్నాడు. దీపించు- బాగా జ్ఞానంతో వెలిగే వైరాగ్య సుఖం నువ్వే ఇవ్వాలి స్వామీ! అని వేదాలు, వేదాల అంతాల్లో ఉండే ఉపనిషత్తులు బోధించిన సారమిదే అని వేదాంత పరిభాషలో తేల్చి పారేశాడు. నిగమ, నిగమాంత వర్ణిత మనోహర రూపుడయిన వెంకన్నతోనే ఈ వైరాగ్య అవసరం గురించి మాట్లాడాడు.

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో పంచాయతీ భవనం లేక శ్మశానంలో గదిని ఊరి పాలనకు అనువైన చోటుగా సర్పంచ్ ఎంచుకున్నట్లు ఒక వార్త. ఇందులో ఎన్నెన్నో జీవిత రహస్యాలు, వేదాంత పాఠాలు దాగి ఉన్నాయి.

పల్లెలో బషీరాబాద్ శ్మశాన పాలన కదిలించే వార్త అయినప్పుడు – మహా నగరంలో రోడ్డుకు ఎడమన చితి మంటల చిటపటలు వినపడుతుంటే- ఎదురుగా కుడి వైపున గ్యాస్ మంటల్లో కార్న్ చిల్లీ చిటపటలు వినపడ్డం కూడా నిలువెల్లా కంపించే వార్తే కావాలి. ఒకే పని నాగరికులు చేస్తే ఒప్పు – పల్లీయులు చేస్తే తప్పు ఎలా అవుతుందో?

ఏయ్!
ఎవర్రా అక్కడ?
శ్మశానం దగ్గర యూ టర్న్ తీసుకుని శ్మశానానికి ఎదురుగా హోటల్లో పిండానికి రమ్మని చెప్పి ఎంతసేపయ్యింది? ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాం. నోట్లో తులసి తీర్థం పోసేవారు కూడా లేక వెయిటింగ్ లో ఉన్నాం.

బషీరాబాద్ గ్రామ సర్పంచ్, కార్యదర్శిని అభినందించాలి. చివరకు వల్లకాట్లో అయినా కూర్చుని ఊరి పని చేస్తున్నారంటే ప్రభుత్వాలు సిగ్గు పడాలి. సమాజంగా మనం తలదించుకోవాలి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: స్వయంభువును నేను

Also Read: మాయమైపోతాడమ్మా మనిషన్నవాడు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్