Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో?

ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో?

డబ్బు, అధికారం, హోదా ఉంటే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేసి…చేయలేదని నిరూపించుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లెక్కలేనన్ని మార్గాలు. ఇంకొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే నేరారోపణ చేసినవారే నేరం చేసినట్లు ఉల్టా ఇరికించడానికి బోలెడన్ని అవకాశాలు. నేరం చేసినవారు కలవారై బాధితులు లేనివారైతే…ఆ కలవారిని కోర్టుదాకా లాక్కురావడానికి లేనివారి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి.

సిద్ధాంతమెప్పుడైనా ఉదాహరణలతో చెబితేనే సులభంగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఈమధ్య జరిగిన ఎన్నో హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో రెండిటిని మచ్చుకు పట్టుకుంటే…మన పేరుగొప్ప సమసమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అన్న మాటలు ఎలా దేవతావస్త్రాలయ్యాయో అర్థమవుతుంది.

అధికారంలో ఉన్న పార్టీలు, చట్టాలు ఎంతగా కలవారి చుట్టాలైనా…ఈరోజుల్లో అదృష్టం కొద్దీ వీధుల్లో ఉంటున్న సీ సీ టీ వీ వీడియో దృశ్యాలు బయటికి వచ్చి…మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ రెండు కేసుల మీద ఇంత చర్చ జరుగుతోంది. నేరం చేసినవారిని కోర్టు బోనుదాకా లాక్కురాగలిగారు.

మొదటి విషాదం:-
పూనాలో ఒక బలిసిన ఆసామి కొడుకయిన మైనారిటీ తీరని ముక్కు పచ్చలారని బాలాకుమారుడు పదో తరగతి పరీక్షలు రాసిన ఆనందంలో రాత్రంతా రెండు మూడు పబ్బుల్లో మార్చి మార్చి మందు తాగి…అర్ధరాత్రి దాటాక దయ్యాలు కూడా అలసి నిద్రపోయేవేళ ఎక్కిన కిక్కుతో అతి విలాసవంతమైన పోర్షే కారెక్కి అత్యంత వేగంగా నడుపుతూ…రోడ్డుమీద ఇద్దరిని చంపాడు.

సినిమాల్లో జరిగినట్లు వెంటనే ఒక అద్దె డ్రయివర్ రంగప్రవేశం చేశాడు. ఆ బాబు మందే తాగలేదని; అసలక్కడ లేనే లేడని; ఆ అర్ధరాత్రి వేళ పండరీపురం చలువ పందిళ్లలో పాడురంగ భజన చేస్తున్నాడని, సరిగ్గా ఆసమయానికి పెద్ద లోటాలో బెల్లం పానకం తాగుతున్నాడని, బెల్లంలో మొలాసిస్ మోతాదు ఎక్కువై మత్తేమైనా వచ్చి ఉంటుందేమోనన్నట్లు ఏవో ఆధారాలు సృష్టించబోయారు. తండ్రికి ఉన్న పెద్ద పెద్ద పరిచయాలతో మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ తెల్లవారేదాకా పిల్లాడిని ఎలా కాపాడాలి అనే మహా కవరప్ యజ్ఞంలో నిమగ్నమయ్యారు.

కలవారి పోర్షే ఇద్దరిని చంపినా…పోర్షే కల వారింట్లో ఎప్పటిలానే సూర్యుడు ఉదయించాడు. పోర్షే చంపిన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండిళ్లల్లో శాశ్వతంగా సూర్యుడు అస్తమించాడు.

దేశవ్యాప్తంగా ఈ పిల్లాడిని రక్షించడం మీద దుమారం రేగడంతో విధిలేక మహారాష్ట్ర ప్రభుత్వం అన్యమనస్కంగా ఆ పిల్లాడిని, సాక్ష్యాలను తారుమారు చేయబోయిన ఆ పిల్లాడి తండ్రిని అరెస్టు చేసి…విచారిస్తోంది. మన పేరుగొప్ప వ్యవస్థల కళ్లగంతల సాక్షిగా ఈపాటికి బెయిల్ వచ్చి ఉండాలి! రాకపోతే త్వరలోనే వస్తుంది!

రెండు ప్రాణాలను నడిరోడ్డుమీద గాల్లో కలిపిన ఆ సుపుత్రుడిని రక్షించడానికి రాత్రికి రాత్రి ఆ బలిసిన తండ్రి మెరుపువేగంతో చేసిన పనులు ఎందరికో ఇప్పుడు ఆదర్శం! న్యాయదేవతకు చెవులుంటాయి కానీ…కళ్ళుండవని కలవారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.

పోలీసులను మేనేజ్ చేశాడు.
ప్రభుత్వ వైద్యుడిని మేనేజ్ చేశాడు.
చెబితే అసహ్యంగా ఉంటుంది కానీ…చనిపోయిన కుటుంబాలవారి నోరు కూడా డబ్బుతో మూయించబోయాడు. వారి కోపం కట్టలు తెంచుకుని మీడియా ముందుకు రావడంతో కనీసం బోనులో నిలబడ్డాడు.

రెండో విషాదం:-
అదే మహారాష్ట్ర బాంబేలో మరో హిట్ అండ్ రన్ కేసు. ఈసారి సుపుత్రుడు అధికార షిండే శివసేన వర్గం నాయకుడి కొడుకు. చనిపోయింది దిగువ మధ్యతరగతి మహిళ. మిగతా కథంతా మక్కికి మక్కి పూనా కథే. అబ్బాయిని ఈ కేసునుండి తప్పించడానికి యావత్ మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులూ మానేసి...భూమి ఆకాశం ఒకటి చేసింది.

ప్రతిపక్షాలు, మీడియా, సోషల్ మీడియా అబ్బాయిగారి విధ్వంసక డ్రయివింగ్ లీలా విన్యాసాలను, మహిళను కారుకింద ఈడ్చుకెళ్లిన సీ సీ టీ వీ ఫుటేజ్ ను బయటపెట్టడంతో మళ్లీ అన్యమనస్కంగా బరువెక్కిన గుండెతో ఇష్టం లేకపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాల్సి వచ్చింది.

అంతులేని విషాదం:-
ఇవి లోకానికి ఈమధ్య తెలిసిన రెండు విషాదాలు. లోకం దృష్టికి రాకుండా సూర్యుడు ఉదయించే లోపు చీకట్లలోనే కలిసిపోయే విషాదాలెన్నో? సాక్ష్యం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ దయనీయ విషాదాలెన్నో? నడిరోడ్డుమీద తాగి నడిపిన కలవారి కార్లకు బలి అయిన పవిత్రులెందరో?

“కలవారిని గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో?”

“కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో?
భూస్వాముల  దౌర్జన్యాలకు,
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో?”
-దాశరథి

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్