రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండా సభ వాయిదాపడుతూ వస్తున్నది. అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
ఇవాళ రెండో విడతలో భాగంగా రెండో రోజు సమావేశాలు ప్రారంభంకాగానే కాంగ్రెస్ సభ్యులు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టుబట్టారు. తమతమ స్థానాల్లో లేచి నిలబడి జేపీసీ డిమాండ్‌తో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు బీజేపీ సభ్యులు లండన్‌లో రాహుల్‌గాంధీ దేశం గురించి తక్కువచేసి మాట్లాడాడని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దాంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ ఓంబిర్లా ఇరువర్గాల సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో సభ ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. ఆ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. కాగా సోమవారం కూడా ఇవే అంశాలపై అధికార, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉభయసభలు వాయిదాపడ్డాయి.
Also Read : అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన