సంఖ్యా బలం ఉండి కూడా కాపు, తెలగ, బలిజ కులాలు రాజకీయ అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాయో, ఇంకా ఎందుకు దేహీ అనే పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సూచించారు. సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హాజరైన కాపు ప్రతినిధులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఇతర కులాలను విమర్శించడం కంటే కూడా మన ఇంట్లో సమస్యలేంటో కాపులు అలోచించాలని కోరారు.
కాపులు పార్టీ నడపలేరని ఎవరైనా అంటే చెప్పు తెగేలా సమాధానం చెప్పాలని పవన్ వ్యాఖ్యానించారు. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలు ఉండవని, అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కాపుల అజెండా మారకూడదన్నారు. గత ప్రభుత్వ హయంలో రిజర్వేషన్స్ డిమాండ్ చేశారని, వైసీపీ లోకి రాగానే దానిపై తాము మాట్లాడం అనడం సబబు కాదన్నారు. రాయలసీమలో బలిజలు గొంతెత్తి మాట్లాడలేరని, అంతమాత్రాన వారికి భయం ఉన్నట్లు కాదని, ఐక్యత లేకపోవడమేనని అన్నారు.
ఇప్పుడు రంగా పేరు జిల్లాకు పెట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నారని, బతికి ఉన్నప్పుడు ఆయన వెంట గట్టిగా నిలబడితే బాగుండేదని… ఊరికి వందమంది కాపులు వచ్చి ఆయన దీక్షా శిభిరం దగ్గర పడుకొని ఉంటే రంగాను చంపే సాహసం చేసి ఉండేవారా అని పవన్ ప్రశ్నించారు.
ఒక్క కులంతోనే అధికారం రాదనీ, కాపులు కూడా మిగిలిన కులాలతో సామరస్య ధోరణితో వెళ్ళకపోతే అధికారం ఎప్పటికీ రాదనీ పవన్ కళ్యాన్ తేల్చి చెప్పారు. దీన్ని గ్రహించి ముందుకువెళ్తే దక్షిణ భారత దేశంలోనే మిమ్మల్ని దాటి… మీరు లేకుండా రాజకీయం ఉండదు అని స్పష్టం చేశారు.