Friday, March 29, 2024
HomeTrending Newsదేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు

దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు

రాష్ట్ర ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖపట్నంలో ఈనెల 15న నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర గర్జన నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ గర్జనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని తెలియజెప్పాలని పట్టుదలగా ఉన్నారు.  ఈ గర్జనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

‘దేనికి గర్జనలు’ అనే శీర్షికతో పవన్ ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు?

  • విశాఖపట్నంలో రుషికొండ అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?
  • ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?
  • మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?
  • రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?
  • అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా? గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా?
  • ఫీజు రీ ఎంబర్స్మెంట్ చేయనందుకా? విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా
  • ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నందుకా? విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో మరుగు దొడ్ల ఫోటోలు తీయిస్తున్నందుకా? మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసినందుకా?
  • విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసినందుకా? ప్రజలు కోరిన మీదటే ఛార్జీలు పెంచామని చెప్పుకొన్నందుకా?
  • కాలుష్యకారక పరిశ్రమలు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ముద్దులుపెట్టి… ఇప్పుడు ఆ పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేస్తున్నందుకా?
  • శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నందుకా? మడ అడవులు ధ్వంసం చేసేస్తున్నందుకా?
  • గ్రామ పంచాయతీల నిధులు మళ్లించేసినందుకా? మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని అడిగిన సర్పంచులను అరెస్టులు చేస్తున్నందుకా?
  • వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకా?
  • భర్తీ చేస్తామన్న 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? పోలీసు రిక్రూట్మెంట్ చేయనందుకా? డిఎస్సీ ఊసు వదిలేసినందుకా?
  • స్కూల్స్, ప్రభుత్వ భవనాల నుంచి ఆలయ విద్యుత్ అలంకరణ వరకూ పార్టీ రంగులు వేసుకొంటున్నందుకా? హైకోర్టుతో చీవాట్లు తిన్నందుకా?
  • ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేసినందుకా? పాలన వైఫల్యాలు దాచుకొనేందుకు కులాల మధ్య చిచ్చు రేపినందుకా?
  • కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా?
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?
  • కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?
  • ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా?
  • 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?
  • ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?

అంటూ వరుస ట్వీట్ లు చేశారు.

Aslo Read ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్