రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని కోలుకోలేని దెబ్బతీసిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతోందని తెలుగుదేశం ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్నిఈ స్థితికి దిగజార్చింది మీ అసమర్ధత కాదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఏపీ సిఎం జగన్ రాసిన లేఖను కేశవ్ తప్పుబట్టారు. అనంతపురంలోని టిడిపి కార్యాలయంలో అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో తమ తెలుగుదేశం పార్టీ హయాంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల(పిపియే)లో ఏవో ఘోరాలు జరిగాయని సిఎం జగన్ ను తప్పుదోవ పట్టించిన యంత్రాంగం ఇప్పుడు ప్రధానికి రాసిన లేఖలో కూడా అసత్యాలు, అర్ధ సత్యాలు పలికించారని ఆరోపించారు.
సింగరేణికి బకాయిలు చెల్లించకుండా మా దగ్గర బొగ్గు లేదని ప్రధానికి లేఖ రాయడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.మీకు ముందుచూపు లేకుండా కాపాడాలంటూ ప్రధానికి లేఖ రాయడంలో అర్ధంలేదన్నారు. ప్రధానికి లేఖ రాసి బాధ్యతల నుంచి తాము తప్పించుకోవాలని చూడడం సరికాదన్నారు. వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణలో మిగులు విద్యుత్ ఉందని, కనీసం 9 గంటలపాటు కూడా ఇవ్వలేని ఏపీలో అప్పుడే లోడ్ రిలీఫ్ పేరుతో పవర్ కట్లు మొదలయ్యయని కేశవ్ మండిపడ్డారు. డిస్కంలకు నష్టాలు రావడానికి ప్రభుత్వం తీరే కారణమని విమర్శించారు.
బొగ్గు ఆధారిత విజయవాడ, రాయలసీమ థర్మల్ పవల్ ప్లాంట్లను మూసివేసే పరిస్థితి కల్పించి ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్నది మీ ఉద్దేశం కాదా అంటూ కేశవ్ నిలదీశారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న హిందూజా, కృష్ణపట్నం గ్యాస్ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండా, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి అవి మూతపడేలా చేస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే విద్యుత్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని దుయ్యబట్టారు. విద్యుత్ సంక్షోభం పేరుతో అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు ద్వారా ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు.