Jagan Anugraha Sabha: విజయవాడలో నేడు బిజెపి నిర్వహిస్తున్నది ప్రజా ఆగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జగన్ పార్టీగా వ్యవహరిస్తోందని. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలకు జగన్ తన పేరు పెట్టుకున్నా బిజెపి నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అయన ప్రశ్నించారు. దేశంలో 5జి నెట్ వర్క్ నడుస్తున్నా రాష్ట్రంలో మాత్రం ‘జే’ నెట్ వర్క్ నడుస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చి చెబితే కానీ అమరావతి రాజధాని, అక్కడి రైతుల పోరాటం గురించి రాష్ట్ర బిజెపి నేతలకు తెలియలేదని కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా చలనం రావడం లేదని కేశవ్ మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంటే బిజెపి ఏం చేస్తోందని నిలదీశారు. ప్రతిపక్ష నేత ఇంటిపై, టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగినా పట్టించుకోలేదని… కానీ పశ్చిమ బెంగాల్లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంశాఖ అధికారులు అక్కడకు వెళ్లి విచారణ చేస్తారని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లను సైతం అక్కడకు పంపి ఘటనలపై ఆరా తీయిస్తారని…. కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని బిజెపిపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఇక్కడి పరిణామాలను కేంద్ర టెలిస్కోప్ ద్వారా పరిశీలిస్తోందని ఒక ఎంపీ చెప్పారని, అయితే ఇక్కడ సినిమా స్కోప్ లో దారుణాలు కన్పిస్తుంటే ఇంక టెలిస్కోప్ ఎందుకని అడిగారు. రాష్ట్ర బిజెపిలో ట్రాన్స్మిషన్, ట్రాన్స్ లేషన్ లాసెస్ ఎక్కువ ఉన్నాయని దుయ్యబట్టారు.
Also Read : అది జగన్ అనుగ్రహ సభ: కేశవ్ ఎద్దేవా