పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం SC రిజర్వుడ్ స్థానాల్లో ప్రముఖమైనది. కేంద్ర మాజీ మంత్రి గుడిసెల వెంకటస్వామి ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచారు. ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి 2009లో ఒకసారి గెలిచి 2014లో బాల్క సుమన్ మీద ఓటమి పాలయ్యారు. 2019లో బీఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేతకాని ఎంపిగా గెలిచారు. 2024 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బిజెపి నుంచి గోమాసు శ్రీనివాస్ ప్రధానంగా తలపడుతున్నారు.
దీని పరిధిలో పెద్దపల్లి, ధర్మపురి,రామగుండం, మంథని, చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వారికి సుపరిచితులైనా కాళేశ్వరం ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ పార్టీకి గుదిబండగా మారాయి. ఓట్లు పడినా వ్యక్తిగతంగా ఈశ్వర్ ను చూసి వేయాల్సిందే కాని పార్టీ పేరు చెపితే ఓట్లు పడే రోజులు పోయాయి.
అలవి కాని హామీలు ఇచ్చి సింగరేణి కార్ముకులను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందనే అపవాదు ఉంది. దీంతో కార్మిక వర్గాలు కారును ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేయకపోవటం…. మరింత దిగజారేలా చేసింది. ధర్మపురి మినహా అన్ని నియోజకవర్గాల్లో సింగరేణి ఓటర్లు గణనీయంగా ఉంటారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్వతహాగా కార్మికుల ప్రయోజనాలు ఫలిస్తాయని అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కార్మిక వర్గం నుంచి వచ్చిన కొప్పులకు వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వాలని TBGKS సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
2018 శాసనసభ ఎన్నికల్లో ఈశ్వర్ అక్రమాలకూ పాల్పడ్డారని పుకార్ తారాస్థాయికి వెళ్ళింది. పర్యవసానంగా మొన్నటి ఎన్నికల్లో అందరి కన్నా ముందు కొప్పుల ఈశ్వర్ ఓటమి ఖాయం అయింది. దాని ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండనుందో చూడాలి. గని కార్మికుడైన కొప్పుల పట్ల కార్మిక వర్గంలో కొంత సానుకూలత పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎక్కడా రెండో స్థానం కూడా దక్కని పరిస్థితి ఉండగా ఒక పెద్దపల్లిలో మాత్రం గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ పోటీతో కాక(వెంకటస్వామి) కుటుంబంలో మూడో తరం రాజకీయాల్లోకి దిగినట్టయింది. కొంత విరామం తర్వాత గుడిసెల వెంకట స్వామి కుటుంబీకులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి పరిధిలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అభిప్రాయ సేకరణ సమయంలో వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. వివేక్ వ్యవహారశైలి ఇందుకు కారణమని హస్తం ముఖ్య నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
అయితే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారానికి సిద్దం అయ్యాయి. గుడిసెల కుటుంబం పోటీ చేస్తే ఖర్చుకు అంతు పొంతూ ఉండదు. దానికితోడు ప్రజల్లో కూడా గుడిసెల కుటుంబంపై కొంత నమ్మకం ఉంది. ఈ కుటుంబం ప్రాతినిధ్యం వహించినపుడు అంతోఇంతో అభివ్రుది జరిగిందని… సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. బాల్క సుమన్, వెంకటేష్ నేత ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపణలు ఉన్నాయి.
పార్టీ పరంగా బిజెపికి మోడి చరిష్మ కలిసి వస్తుందని ప్రచారం ఉపందుకుంది. బిజెపి అభ్యర్థి గోమాసు శ్రీనివాస్ మహారాష్ట్ర లో కాంట్రాక్టరు కాగా ఎన్నికల సమయంలో వాలుతారని పేరుంది. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వివేక్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్నారు. NSUI విద్యార్థి నాయకుడిగా క్రియాశీలకంగా పనిచేసిన శ్రీనివాస్… జాతీయ స్థాయిలో దళిత, బహుజన ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిశబ్ద వోటింగ్ తమకు కలిసి వస్తుందని కమలం నేతలు ధీమాతో ఉన్నారు.
కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపి వెంకటేష్ నేతకానికి బిజెపి బీ ఫాం ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో వారం రోజుల పాటు బిజెపి అభ్యర్థి ఎవరో తెలియని అయోమయం కమలం శ్రేణుల్లో నెలకొంది. దాంతో పార్టీ ప్రచారం కూడా నెమ్మదించింది.
నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల వరకు ఓటర్లు ఉండగా నేతకాని ఓట్లు రెండు లక్షల పై చిలుకు ఉన్నాయి. వీరి ఓట్లు కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఎంపి వెంకటేష్ నేతను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బిజెపి ఏకంగా ఆ వర్గం నేత గోమాసు శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు మాల సామాజిక వర్గం వారే. ఇది కొంత బిజెపికి మేలు చేయనుందని స్థానికంగా టాక్ మొదలైంది.
మంత్రి శ్రీధర్ బాబు, వివేక్, వినోద్,ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మణ్ కుమార్, రాజ్ టాకూర్, విజయరమణ రావు తదితర ఎమ్మెల్యేలు ఉద్దండులు ఉండటం కాంగ్రెస్ కు కొంత మేలు చేకుర్చేది. వివేక్ చొరవ తీసుకొని అందరు నేతలను కలుపుకు పోతే… పార్టీ పరంగా.. అభ్యర్థి పరంగా కాంగ్రెస్ కు విజయవకాశాలు అధికంగా ఉన్నాయి.
తాజా పరిణామాలు చూస్తుంటే మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిపై పార్టీలో వ్యతిరేకత, బిజెపి అభ్యర్థి ప్రజలకు పరిచయం లేదు. బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తి ఆ పార్టీ అభ్యర్థికి మైనస్. ఇలా ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనేది చెప్పలేని స్థితి నెలకొంది.
-దేశవేని భాస్కర్