Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅప్పుడు అనావృష్టి - ఇప్పుడు అతి వృష్టి

అప్పుడు అనావృష్టి – ఇప్పుడు అతి వృష్టి

Nadu-Nedu: నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు అనంతపురం జిల్లా.  ఇరవై ఏళ్ళ వయసులో తొలిసారి పెన్నేటి పాట ప్రారంభంలో ఉన్న రెండు మూడు పద్యాలు విన్నప్పుడు రాసిందెవరో, ఎందుకు రాశారో తెలియదు. అదేదో రాయలసీమ సిగ్నేచర్ ట్యూన్ అనుకుని తెగ ఉత్సాహంగా పాడుకునేవాడిని. దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లు…
“ఇదే పెన్న…
ఇదే పెన్న…
నిదానించు నడు…
విదారించునెదన్
ఒట్టి ఎడారి తమ్ముడూ!”
అన్న పెన్నేటి పాట రాయలసీమ జనగీతం అనుకుని అర్థం తెలియకపోయినా…పదే పదే అదే పాడుకునేవాడిని. అదొక విషాద కావ్యమని తరువాత ఎప్పుడో నాకు తెలుగు, సంస్కృతం వ్యాకరణం పాఠాలు చెప్పిన కర్రా వెంకట సుబ్రహ్మణ్యం సార్ చెప్పేవరకు తెలియలేదు. విద్వాన్ విశ్వం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యుల సాహితీ విశ్వరూపాన్ని నాకు చూపించిన కర్రా సార్ దగ్గర సంప్రదాయ విధానంలో పద్యం, ప్రతిపదార్థం, ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణం, పద అన్వయం, విశేషార్థం తెలుసుకున్న మొదటి కావ్యం ‘పెన్నేటి పాట’; రెండోది ‘శివతాండవం’.

ఆ క్షణం నుండి విషాదాన్నే ఒక సిగ్నేచర్ ట్యూన్ గా ఆరాధిస్తున్న లక్షల మంది రాయలసీమ వాసుల్లో నేనూ ఒకడిని అయ్యాను. అర్థం తెలిశాక ఎవరయినా విద్వాన్ విశ్వంను ఆరాధించకుండా ఉండలేరు. గుండెలు మెలిపెట్టే ఒక మహా విషాదానికి, నైరాశ్యానికి, నిర్వేదానికి, నీరింకిన కళ్లకు, ఆశలు ఉడిగిన మనసులకు, బాసలు మిగిలిన మనుషులకు పెన్నేటి పాట ఒక ప్రతిబింబం. కరువుతీరా ఏడవడానికి కూడా వీల్లేని ఎడారి బతుకుల కరువు మాటున నలిగే జీవితాలకు ప్రతిరూపం పెన్నేటి పాట. అత్యంత సంపన్నులను కూడా అడుక్కుతినేలా చేసి…ఆత్మాభిమానాన్ని బజారుపాలు చేసే కరువు కాఠిన్యానికి అక్షర రూపం పెన్నేటి పాట. రాయలసీమ కోటిగొంతుల విషాద జీర పెన్నేటి పాట.

ఇప్పుడు నా వయసు 53. పెన్నలో ఆడుకున్నాము. పాడుకున్నాము. నీటి చుక్క లేని పెన్న కాలువ ఇసుక మీదే కూర్చుని పెన్నేటి పాట పద్యాలు గొంతు తడారిపోయే వరకు చెప్పుకున్నాము. నీరు మరిచిన పెన్న మీద వందల ఊళ్లు పుట్టుకొచ్చాయి. లేదా నీళ్లు రానేరావనుకుని ఊళ్లు పెన్న ఒడిలోకి చేరాయి. నాకు ఊహ తెలిసినప్పటినుండి పెన్నలో ఒక్కసారి నీళ్లు పారితే హిందూపురం పక్కన సేవామందిరం దగ్గర అయిదారు రోజులు నీళ్లల్లోనే ఉన్నాము. మోకాటి లోతు వరకు పెన్న కాలువలోకి దిగి అదేదో ప్రపంచ వింతల్లో ఒక వింతను చూస్తున్నట్లు ఒళ్లు మరిచి గంతులేశాము.

Penna

ఈమధ్య రెండు మూడేళ్లుగా పెన్న వరద, పెన్న పొంగు వార్తలతో పెన్నా తీరం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తన దశాబ్దాల తత్వానికి భిన్నంగా పెన్న ఊళ్లను ముంచెత్తుతోంది. పంటలను మింగేస్తోంది. డ్యామ్ గేట్లను పగులగొట్టి కడలి తీరానికి పరుగులు పెడుతోంది.

రాదనుకున్న పెన్న వస్తోంది. వచ్చిన పెన్న వెళ్లడానికి కాలువల దారుల్లేక ఊళ్లల్లోనే ఉండిపోతోంది. నా ఏట్లో మీరెందుకు ఇళ్లు కట్టుకున్నారు? అని పెన్న అడుగుతోంది. నువ్ రాక బతుకు ఏటిపాలు అయినప్పుడు ఏట్లో ఉండక ఇంకెక్కడ ఉంటాం? అని అక్కడున్నవారు పెన్నను నిలదీస్తున్నారు. వారిని వెళ్లిపోండి అని పెన్న కన్నెర్ర చేసి గట్టిగా అనలేదు. ఇక ప్రతి ఏటా ఖచ్చితంగా ఇలాగే వస్తావా? అని పెన్న మెడ పట్టుకుని వీరు గట్టిగా అడగనూ లేరు. ఇదొక అతివృష్టి- అనావృష్టి సమస్య.

నిజంగా ఏటేటా క్రమం తప్పకుండా పెన్న ఇలాగే వస్తే…
“కండలేక ఎండిపోయి బెండువారినా…
తిండి లేక, తుండు లేక బండవారినా…”
అని కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ రాయలసీమ పెన్నేటి విషాద గీతాలను పాడాల్సిన పని ఉండదు.

ఒకప్పుడు యాభై ఏళ్లకు పైగా పెన్న పారక నెర్రెలు చీలిన పెన్న ఇరుగట్లను చూసి ఆ ప్రాంతవాసి విద్వాన్ విశ్వం పెన్నేటి పాట రాసి, పాడారు అని కాలం చరిత్రగా చెప్పుకుంటుంది. అలాంటి కాలం రావాలని కోరుకుంటూ…వచ్చేసిందేమో అని అనుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

కరోనాలో కరువు మాసం

Also Read : 

పెన్నావతరణం

Also Read : 

సీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!

RELATED ARTICLES

Most Popular

న్యూస్