గంగమ్మకు ఏమయ్యిందో కానీ…పది రోజులనుండి కళ్లు తిరుగుతున్నాయి. విపరీతమయిన తల నొప్పి. చెవి పోటు. సాయంత్రం పొయ్యి మీద జొన్న సంకటి గిన్నె కిందికి దించబోతూ…కళ్లు తిరిగినట్లయి…తూలి మంటలో పడబోయింది. ఈలోపు పక్కన ఎవరో ఉండి పట్టుకోబట్టి బతికిపోయింది.
ఇదివరకు కూడా ఒకసారి ఇలాగే పొలంలో మోపు నెత్తిన పెట్టుకుని తెస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. అప్పుడు నిమ్మకాయ బొప్పి, నెమలీక, జీలకర్ర, తేనె రంగరించి గంగమ్మకు ఇస్తే…కొంచెం గుణం కనిపించింది. ఇప్పుడు చుక్క తేనె కూడా ఊరికే ఇచ్చేవారు లేరు. పైగా ఈమధ్య కడుపులో నొప్పి అని ఏమీ తినలేకపోతోంది.
లోపల ఏదో రోగం పట్టి పీడిస్తోందని గంగమ్మకు తెలుసు. ఆరోగ్యం బాగాలేదని రంగన్నకు చెప్పలేదు. రెండ్రోజులు ఒంట్లో బాగోలేక పడుకుని ఉంటుంది. నాలుగు రోజులు లేచి తిరుగుతూ ఉంటుంది.
ఈ పూరిపాకలో ఇంకా ఎన్నాళ్లు? పైసా పైసా కూడబెట్టి చిన్న మట్టి మిద్దె కట్టుకుందాం. అప్పుడు నీకిన్ని కష్టాలు ఉండవు అని రంగన్న అన్న మాటలు అమృతంలా గంగమ్మ చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి.
ఒకరోజు అందరితో పనికి వెళుతూ గంగమ్మ తూలి పడింది. కళ్లు తేలవేసింది. మాట రావడం లేదు. మూర్ఛ వచ్చిందని ఒకరున్నారు. దయ్యం పట్టిందని ఒకరున్నారు. వాతం అని ఒకరున్నారు.
మొహం మీద నీళ్లు చిలకరించారు. కాళ్లు చేతులు చల్లబడ్డాయని గ్రహించి…కాళ్లకు చేతులకు పసుపు, రాగిపిండి రుద్దారు. కొంచెం వేడి గంజి తాగించారు. విసనకర్రలతో విసురుతున్నారు. కొంచెం కళ్లు తెరవగానే అటు ఇటు ఇద్దరు పట్టుకుని గుడిసెకు తీసుకొచ్చి…చాపమీద పడుకోబెట్టారు.
చిమ్మ చీకటి. ఒకరు ప్రమిదలోకి ఆముదం తెచ్చారు. మరొకరు అగ్గిపుల్ల తెచ్చారు. ఇంతకంటే పొరుగువారు ఆ క్షణాన చేయగలిగిన సాయం లేదు. వారి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈత చాపమీద గంగమ్మ గింగిర్లు తిరుగుతోంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈలోపు పనులన్నీ ముగించుకుని రంగన్న వచ్చాడు. భార్యను ఈ స్థితిలో చూసి అతడికి నోట మాట రాలేదు. గంగమ్మ తలను ఒళ్లో పెట్టుకుని…ఆమె చెక్కిళ్లు నిమురుతూ…నిర్వికారంగా అలా కూర్చున్నాడు.
రంగన్న చేతి స్పర్శతో గంగమ్మకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. ఏవేవో చెప్పాలని ఉంది గంగమ్మకు. ఏమీ చెప్పలేకపోతోంది. రంగన్న సమాధి స్థితిలో ఉన్న యోగిలా ఉన్నాడు.
“మామా!” అని గంగమ్మ రంగన్నను గట్టిగా కౌగిలించుకుంది. నీరు నిండిన కళ్ళల్లో రంగన్న “పిల్లా!” అన్నాడు. ఆ రాత్రి అలా గడిచింది. ఈలోపు తొలికోడి కూసింది.
రంగన్న- గంగమ్మ జీవితంలో ఒక నిద్రలేని కన్నీటి రాత్రి గడచిపోయింది. నిన్నటి కన్నీటి పాటే నేడు. నేటి కన్నీటి పాటే రేపు కూడా.
గుండెలు కోసి ఇవ్వగల ప్రేమ, కొండంత భారాలను నెత్తిన మోయగల శక్తి, మండుటెండల్లో ఎన్ని గంటలైనా పని చేసి బండలను పగలగొట్టగల బలం ఉన్న రంగన్నలను, గంగమ్మలను ఇలా రాచి రంపాన పెట్టడం విధికి న్యాయమా? ధర్మమా?
దేవుడా! ఉన్నావా నీవు?
సంఘమా! చూస్తున్నావా నీవు?
హృదయమా! మనిషి నిన్ను బహిష్కరించాడా?
దిక్కులు పిక్కటిల్లేలా…
కొండలు ఊగిపోయేలా…
ఆకాశం బద్దలయ్యేలా…
ఈలోకంలో ఆత్మసాక్షి చచ్చిపోయిందని గుండెలు బాదుకోనివ్వండి నన్ను.
“ఇదే పెన్న!
ఇదే పెన్న!
విదారించు నెదన్
వట్టి ఎడారి తమ్ముడు!”
(విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట” కావ్యం ఆధారంగా రాస్తున్న ధారావాహిక దీనితో సమాప్తం)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018