Friday, September 20, 2024

పెన్నేటి పాట-7

వర్షాలు ఉండవు. పంటలు పండవు. పనులు ఉండవు. దాంతో కొండకు వెళ్లి కట్టెలు కొట్టి ఊళ్లో అమ్ముకునేవారు కొందరు. గడ్డిమోపులు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. కలివి పండ్లు, రేగి పండ్లు, బలసకాయలు, సీతాఫలాలు, సీమచింత, బిక్కి పండ్లు, బీర పండ్లు, ఈత పండ్లు గంపల్లో తెచ్చి అమ్ముకునేవారు కొందరు. తేనె తుట్టెలు తెచ్చి తేనె అమ్ముకునేవారు కొందరు. ఇంటి దూలాలకు, కిటికీలకు, బండ్లకు టేకు చక్కలు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. ఇంత శ్రమపడి కొండ దిగి వచ్చేలోపు అటవీశాఖ నిఘా వారి కళ్లల్లో పడితే…వారికి తృణమో పణమో ఇచ్చుకుని బయటపడాలి. దోషిగా పంచాయతీ పెడితే ఆ అవమానాలను భరించాలి. పొలం పనులు లేనప్పుడు మరి రోజు గడవడానికి ఏదో ఒకటి చేయాలి కదా? ఏడాదిలో మూడు నెలలకు మించి పొలం పనులు ఉండవు.

కరువుకాలాల్లో ఈ కొండే ఊరికి అన్నం పెట్టే అన్నపూర్ణ.

బొగ్గులకోసం కొండకు అగ్గి పెట్టడంతో సగం కొండ మాడి మసైపోయింది.

రంగడు అందరితో పాటు కొండమీదికి వెళ్లి గడ్డి మోపుతో దిగివచ్చాడు. ఎర్రటెండ పొద్దు. ఏడు మూరల గడ్డిమోపు భుజాన మోయడంతో ఎర్రగా కందిపోయి…వాతలు తేలాయి. కళ్లు గుంతల్లో ఉన్నాయి. పొట్ట వెన్నుముకను తాకింది. వాడిన తీగలా వణుకుతూ ఉన్న రంగడిని ఆ క్షణాన చూసినవారికెవరికయినా గుండె తరుక్కుపోతుంది. లోకానికి ఇదేమి శాపమని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. గుమ్మం వాకిట్లో నిలుచుని రంగన్నను చూసిన గంగమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎక్కడ రంగన్న చూస్తాడో అని పక్కకు తిరిగి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది.

రంగన్న కొండ మీదికి వెళ్లిన మరు క్షణమే గంగమ్మ కూడా పనికి వెళ్లి…రంగన్న రావడానికంటే ముందే వచ్చేస్తుంది. భర్త అంత కష్టపడుతుంటే తను ఇంట్లో కూర్చుని తినడం ఇష్టం లేని గంగమ్మ చేయని పని లేదు. ఒకరింట్లో వడ్లు దంచుతుంది. ఒకరింట్లో అటుకులు దంచుతుంది. ఒకరింట్లో బావిలో నీళ్లు చేది తొట్టెల్లో పోస్తుంది.

రంగన్న ఒంటిమీద నీళ్లు పోసుకుంటుంటే వీపు రుద్దుతోంది. ఆమె కరస్పర్శ వేయి సంజీవనులతో సమానమై రంగన్న ఒంటిమీద గాయాలు మాయమైపోతాయి.

ఇన్ని కష్టాలు నీకోసమే భరిస్తున్నానని రంగన్న అనడు. నిన్ను చూసుకుంటూ బతుకుతున్నానని గంగమ్మ అనదు. మనసులో ప్రేమలు పొంగుతూ ఉంటే…మాటలతో పనేముంది?

రంగన్న అడుగుల చప్పుడే గంగమ్మ కళ్లల్లో కాంతికి కారణం. గంగమ్మ కళ్ల వెలుగే రంగన్నకు దారి దీపం. చూపులతోనే మాట్లాడుకునే వారి భాష వారికి తప్ప ఇతరులకు అర్థం కాదు. అదొక మాటల్లో చెప్పలేని హృదయభాష.

రేపు- పెన్నేటి పాట-8
“కరువులో కలవారి వైభోగం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్