People are here to cry instead of leaders – Crocodile Tears
మీరెందుకు ఏడుస్తారు మాస్టారు?
ఏడవడానికి నూటముప్పైకోట్ల జనం వున్నారు.
బాగా డబ్బుండి ఏడవడానికి నామోషీగా ఫీలయ్యే ఓ పదికోట్ల మందిని తీసేద్దాం
మిగిలిన వాళ్ళందరికీ ఏం పని?
ఏదో ఒకదానికి ఏడుస్తార్లే.
లైన్లో నిలబడి ఓటేసిన పాపం మాది కదా!
ప్రజాస్వామ్యం మాకిచ్చిన హక్కని పొంగిపోయింది మేం కదా!
ఎన్నికల్లో మాటలకి, అధికారంలో చేతలకి అంతరం వుంటుందని
75ఏళ్ళు గడిచినా గ్రహించకపోవడం మా గ్రహపాటే కదా!
ఏ ఎన్నికైనా గెలిచేది మీరు..ఓడిపోయేది మేమే కదా!
ఏ రాయయినా ఊడేవి మా పళ్లే కదా!
అందుకు మేమే ఏడుస్తాం.
మీకెందుకు ఆ కష్టం మాస్టారూ?
ఎన్నుకున్న వాళ్లంతా మా మాటే వినిపిస్తారనుకుంటాం.
మా కష్టాలకి గొంతవుతారని ఆశపడతాం
మా బాధలకి భాషవుతారని ఎదురు చూస్తాం.
ఇవన్నీ మా తప్పులే కదా!
ఇన్నేళ్ళయినా..ఇన్ని ప్రభుత్వాలు మారినా..
మా ఆశలో మార్పు లేకపోవడం మా నేరమేకదా!
అందలమెక్కిన వాళ్ళకి అజెండాలు వేరే వుంటాయని
అర్థం చేసుకోలేకపోవడం మా అజ్ఞానమే కదా!
మీరెందుకు మాస్టారూ కంటతడి పెట్టుకోవడం?
లాక్ డౌన్ అనగానే తిండికి లాటరీ కొట్టడం;
ఉద్యోగం ఉపాధి పోవడం;
రాత్రికి రాత్రి జీవితాలు తలకిందులు కావడం;
చివరికి సొంతగూటికి వెళ్ళుందుకు వేల కిలోమీటర్లు నడవడం;
మాయదారి రోగమొస్తే మందుల్లేకపోవడం;
ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం;
ఆక్సిజన్ లేక ఊపిరాడకపోవడం;
అయినవాళ్ళ కళ్ళముందే కళ్ళుతేలేసి ప్రాణాలు వదిలేయడం…
ఇవన్నీ జనానికుండే పనికిమాలిన సమస్యలు.
గద్దెనెక్కిన పెద్దలు కూడా ఇవే ఆలోచించాలనే అత్యాశ మాది కదా?
అందుకు మేమే ఏడవాలి.
అయినా అప్పుడెప్పుడూ మీ కళ్ళు చెమర్చలేదులే!
నల్లధనం రంగుమారి మా అకౌంట్లలో్కి వస్తుందని ఆశించాం.
రాత్రికి రాత్రి మా జేబులో వున్న డబ్బు చెల్లకుండా పోయింది.
ఒకటే దేశం ఒకటే పన్ను అంటే నిజమని భ్రమించాం.
పన్ను మీద పన్నుతో పెట్రోల్ వంద దాటి వెక్కిరించింది.
కోకాపేటలో కొన్నంత ఈజీగా కాశ్మీర్ లో భూములు కొనేయాలనుకున్నాం.
ఆస్పత్రి బిల్లులు కోసం వున్న ఇల్లు అమ్ముకున్నాం.
అయోధ్యలో రాముడొస్తున్నాడు ఇంకేం కావాలనుకున్నాం.
మా ఇట్లో పెద్దదిక్కు కరోనాతో పోతే, దిక్కులేనివాళ్ళమయిపోయాం.
ఆశలూ మావే
నిరాశలూ మావే.
తప్పులు మావే
శిక్షలూ మావే.
మధ్యలో మీరెందుకు మాస్టారూ ఏడవడం?
ప్రభుత్వం బిజీగా వుంది.
ఏ ఫోనులో ఏ రహస్యముంది?
ఏ కాల్ లో ఏం కుట్ర జరుగుతోంది?
ఏ సందేశంలో ఏ సంకేతముంది?
ఇవే ఇప్పుడు ప్రజాస్వామ్య తక్షణావసరాలు.
ప్రతిపక్షమూ బిజీగానే వుంది.
వారి ఫోన్లూ ..ఫేస్ బుక్కులూ..
ట్విటర్లూ..టాపింగులూ…ఇవి ముందు తేలాలి.
అయినా.. ఈ జనానిదొక ఆరణ్య రోదన.
నిస్సహాయ నివేదన.
నిరంతర వేదన.
వాళ్ళేడుపేదో వాళ్లేడుస్తారు.
మధ్యలో మీరెందుకు మాస్టారూ ఏడవడం..?
-కే.శివప్రసాద్
Also Read: అనంతవాయువుల్లో ప్రాణవాయువు
Also Read:పెగాసస్ సెగ