పద్యం:-
“ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!”
అర్థం:- ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న కుదుపుకు పండిన తాటికాయ సరిగ్గా అతడి నెత్తిన పడి…తల టప్ మన్న శబ్దంతో రెండుగా చీలిపోయింది. దైవం చిన్న చూపు చూసిన వారి వెంట ఆపదలు వేటకుక్కలా వెంటపడి వేధిస్తాయి.
ఇదివరకు హై స్కూలు తెలుగు పాఠాల నీతి పద్యాల్లో తప్పనిసరిగా ఉండే పద్యమిది. ఇప్పుడు స్కూలు పిల్లలకే ఆ బట్ట తలలు వచ్చి…చిన్నవయసుకే తలలు పండి ముగ్గు బుట్టలవుతున్నాయి కాబట్టి…ఈ దైవోపహతమయిన బట్టతల పద్యం చదవదగ్గ పాఠంగా ఉందో? లేదో? తెలియదు.
ఆకారం- వికారం అన్నవి రూఢిని బట్టి స్థిరపడతాయి. అందరికీ నెత్తిన జుట్టు ఉండడం సహజం. అలా నెత్తిన జుట్టు ఉన్నవారి ఆకారం బాగున్నట్లు…జుట్టు లేనివారు వికారంగా ఉన్నట్లు…ఒక అలిఖిత ప్రమాణం స్థిరపడిపోయింది. దాంతో జుట్టులేనివారిని, బట్టతలవారిని సమాజం అనాదిగా చిన్నచూపు చూస్తోంది. ఎగతాళి చేస్తోంది. అదోలా చూస్తోంది.
ఈ అవమానాలను భరించలేక కొన్ని బట్టతలలు తమ నున్నని రన్ వే మీద కొత్తగా వెంట్రుకలను పొడిపించుకుంటున్నాయి. కొన్ని బట్టతలలు తమ సువిశాల క్రికెట్ గ్రవుండ్ మీద హెయిర్ గ్రాఫ్టింగ్ చేయించుకుంటున్నాయి. పుడమి పొలంలో దుక్కి దున్ని…ఎరువులు చల్లి…నారుపోసి…నీరుపోసి…పైరు పెట్టడంలా… నిగనిగలాడే ఎడారి తలను దున్ని…చిల్లులు పెట్టి…నూనెలు చల్లి…ఒక్కో వెంట్రుక నారు నాటి…నీరు పోసి…పెంచి పెద్ద చేసి…నాటిన వెంట్రుక ఊడిపోకుండా నిలబెట్టడం రాకెట్ సైన్స్ కంటే సంక్లిష్టమయినది.
అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి…బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి.
బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు.
“ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడి గుండంత సుఖం లేదు” అన్న సామెతను కొందరు ట్రూ స్పిరిట్లో తీసుకుని…బట్టతల సమస్యకు శాశ్వత గుండుతో పరిష్కారం కనుక్కున్నారు. వీరిది శాశ్వత నిజ వైరాగ్య ఆమోదయోగ్య ప్రాక్టికల్ సిద్ధాంతం.
వెంట్రుకతో సమానమయిన వెంట్రుకల మీద వ్యామోహం ఉండకూడదనే పుణ్యక్షేత్రాల్లో తల నీలాలు భక్తి భావనతో సమర్పణ చేస్తూ ఉంటాం. అహంకారానికి తల, తలలోని ఆలోచనలు కారణం. అలాంటి తల నరికి దేవుడి కాళ్లమీద పెట్టాలి. తల నరుక్కుంటే బతికి ఉండము కాబట్టి…తలమీద వెంట్రుకలను నరకడం ప్రతీకాత్మకం. ఇంతకంటే ఇంకా లోతయిన తాత్వికత కూడా గుండు కొట్టించుకోవడంలో ఉంది కానీ…ఆ విషయాలు ఇక్కడ అనవసరం. గుండును గుండు అంటే బాధ. ఎగతాళి. అవమానించడం. ఆట పట్టించడం.
తెలుగు సాహిత్యంతో కూడా బాగా పరిచయమున్న హాస్య నటుడి ఇంటిపేరు మారి “గుండు” సుదర్శన్ అయినా…ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకుని వెళ్లిన చోటల్లా హ్యాట్స్ ఆఫ్ అని ఆయనకు ఆయనే టోపీ తీసి తన శాశ్వత గుండు పుట్టు పూర్వోత్తరాలను హాస్యరసభరితంగా వివరిస్తూ ఉంటారు.
గుండె జారినా పరవాలేదు కానీ…వెంట్రుకలు రాలుతుంటే…గుండె జారినంతపనవుతుంది. మనసు మనసులో ఉండదు. మెదడు చల్లబడి…కొయ్యబారినా పరవాలేదు కానీ…జుట్టు తెల్లబడకూడదు. వయసు ఎనభై దాటి ఏ అవయవమూ స్పందించకపోయినా పరవాలేదు కానీ…నెత్తిన జుట్టు రంగు నలుపు తగ్గకూడదు.
ఇందులో న్యాయం, ధర్మం, అందం- వికారాల స్పృహ, మోసం, ఆత్మన్యూనత లాంటి విషయాల చర్చలో ఎవరి వాదన వారిది.
నెత్తిన ఒత్తయిన జుట్టున్న కరకు మనసు హంతకుడినయినా భరిస్తుంది కానీ… మెత్తటి మనసున్న నెత్తిన జుట్టులేని మంచి మనిషిని మాత్రం భరించనే భరించదు పాడు లోకం!
తిరుమల వైకుంఠద్వార దర్శనానికి వెళ్ళబోతే…తిరుపతి టోకెన్ల కౌంటర్లలో నేరుగా వైకుంఠానికి వెళ్ళిన వార్తలు, ఫార్ములా వన్ రేస్ అవినీతి కేసులో ఏ సి బి విడతలవారి వార్తల ప్రాధాన్యాల మధ్య ఒక బట్టతల వార్త అప్రధానమై…ఎవరూ పట్టించుకోనిది అయ్యింది. నిజానికిది సమాజాన్ని పట్టి పీడిస్తున్న చాలా పెద్ద సమస్య. పెద్ద వార్త.
మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. నీటి కాలుష్యం వల్ల ఊరందరికీ ఒక్కసారిగా జుట్టు రాలిపోతోంది. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధవ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు సరఫరా అయ్యే మంచినీటిలో పురుగులమందులేవో కలిసినట్లు నిపుణుల బృందం ప్రాథమిక పరిశీలన. రేప్పొద్దున ఆ నీటిని శుభ్రం చేసి…మళ్ళీ రసాయనాల్లేని మంచినీటిని ఈ మూడూళ్ళకు ఇవ్వచ్చు. కానీ రాలిన జుట్టును తిరిగీ అతికించలేరు కదా! మళ్ళీ జుట్టును మొలిపించలేరు కదా!
పాపం.
కొన్ని వందల తలలు బోడులైతేగానీ…బట్టతలలకు నీటి కాలుష్యం కూడా ఒక ప్రధానమైన కారణమని తెలియలేదు.
అక్కడ నీతి పద్యంలో బట్టతల ఉన్నవాడి నెత్తిన ఖర్మకొద్దీ తాటిపండు దెబ్బ పడి ఏదో అవుతుంది.
ఇక్కడ మహారాష్ట్రలో నీటికాలుష్యం దెబ్బ పడి నెత్తిన బట్టతల లేనివారికి వచ్చి ఏదేదో అవుతోంది.
మీరు తాగే, స్నానం చేసే నీళ్ళల్లో ఏయే విషరసాయనాలున్నాయో ఒకసారి పరీక్ష చేయించుకోండి. సగం రోగాలకు ఆ నీళ్ళే కారణం అని తేలకపోతే…మహారాష్ట్ర బుల్దానా వెళ్ళి తాజా ఊరుమ్మడి బట్టతలలను అడగండి!
“ఒత్తుగ హొయలుపోయిన క్రాపులెక్కడ?
నిగనిగలాడిన ఉంగరాల జుట్టెక్కడ?
పాయలు తీసి అల్లిన జడల జాడలెక్కడ?
ఏవి తల్లీ! నిరుడు మొలిచిన కేశసమూహములు?”
అని బుల్దానా పల్లెలు కేశవిషాదయోగ కవిత్వంతో వివరంగా సమాధానం చెప్తాయి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు