Saturday, January 18, 2025
HomeTrending Newsఇదేనా మీ అనుభవం? బాబుపై పేర్ని ఫైర్

ఇదేనా మీ అనుభవం? బాబుపై పేర్ని ఫైర్

Babu for politics: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక సినిమా టికెట్ల కోసం ట్వీట్ చేయడం చూస్తే అయన అనుభవం ఏపాటిదో అర్ధమవుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని  వ్యాఖ్యానించారు.  సినిమాలను కూడా రాజకీయానికి వాడుకుంటున్నారని, ఈ సినిమాను కావాలని తొక్కుతున్నారంటూ బాబు, లోకేష్ మాట్లాడడం దారుణమన్నారు. రాజకీయాలకు వాడుకోవడానికి తమకు పనికిరాని వస్తువేదీ లేదని మరోసారి నిరూపించారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ఇచ్చిన  జీవోలో పేర్కొన్న దానికంటే ఎక్కువ రేట్ కు టిక్కెట్లు అమ్ముకోవాలంటే కోర్టు తీర్పు ప్రకారం థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.  అయితే ఆ తీర్పు పాటించకుండా ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించిందని చెప్పడం సరికాదన్నారు. చట్టం తమకు వర్తించదనే పద్ధతుల్లో వారి వ్యవహారం ఉందన్నారు.

ఈరోజు విడుదలైన పవన్ సినిమాకోసం తండ్రీ కొడుకులు బాబు, లోకేష్ లు ట్వీట్ చేశారని, సినిమా విడుదల కాక ముందే హిట్ అంటూ చెప్పారని, ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉందంటూ  ఉత్సాహం చూపారని….. వీరు ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు, వారి పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ బావమరిది మహేష్ బాబు సినిమాలపై ఇలాంటి ట్వీట్ చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు.

జీవో ఇవ్వకుండా జాప్యం చేశారని కొందరు చేసిన విమర్శలపై కూడా పేర్ని స్పందించారు. తమ కేబినెట్ సహచరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారని, తామంతా ఇప్పటికీ తాము ఈ విషాదం నుంచి కోలుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో జీవో ఇవ్వాలని అడగడం ఏమేరకు సబబు అని నిలదీశారు. గౌతమ్  రెడ్డి మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసుకున్నానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, జీవో వచ్చేంత వరకూ విడుదల ఎందుకు వాయిదా వేసుకోలేకపోయారని పేర్ని అడిగారు. సినిమా ఫ్రీగా చూపిస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మించాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు.

గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి,  వినయం ప్రదర్శించిన చంద్రబాబు ఆ మర్నాడే తన వందిమాగాధుడు, ఓ మాజీ మంత్రితో  ఆ మరణంపై  దారుణంగా అవాకులు, చెవాకులు మాట్లాడించారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మనుషుల విలువ తెలియదని, ఒక మరణంపై ఇలా మాట్లాడేవారు మనుషులేనా అన్నారు. ఇలాంటి వారిని సంస్కార హీనులని పివలావా, ఇంకా ఏమని పిలవాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంతకన్నా దిగాజారడానికి ఏమీ నేడని అనుకున్న ప్రతిసారీ ఇంకా పాతాళానికి దిగుతున్నారని నాని మండిపడ్డారు.

తాను సిఎం జగన్ ను కలవబోనని హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారంటూ వస్తున్న వార్తలపై కూడా పేర్ని స్పందించారు. అఖండ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా నిర్మాతలు తనను కలిశారని, బాలకృష్ణ కూడా తనతో మాట్లాడారని నాని వెల్లడించారు. ఆ సమయంలో సిఎం ను తాను కలుస్తానని బాలయ్య చెప్పారని, ఇదే విషయాన్ని తాను సిఎం జగన్ తో చెబితే ఆయన పెద్దరికంగా వ్యవహరించి వద్దులే అని చెప్పారని నాని వివరించారు. ఇది తప్పయితే బాలకృష్ణ నే అడగాలని నాని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్