Five-Star hotels get more pet friendly

దేశ వ్యాప్తంగా స్టార్ హోటళ్లు పెంపుడు జంతువులను అనుమతించబోతున్నట్లు ఇంగ్లీషు బిజినెస్ దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ లో ఒక వార్త ప్రముఖంగా వచ్చింది.

అనాదిగా కుక్క కాటు ప్రమాణం ఒకటి మీడియాకు ఆదర్శంగా ఉండనే ఉంది. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు- మనిషే కుక్కను కరిస్తే వార్త అని. స్టార్ హోటళ్లలో ఇకపై ఎవరు ఎవరిని కరిస్తే వార్త అవుతుందో? అన్నది మన పిక్కల కండ, కుక్కల పంటి బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఇన్ని శాతబ్దాల తరువాత స్టార్ హోటళ్లు కలవారి కుక్కలకు రెడ్ కార్పెట్ పరచి సాదర స్వాగతం చెప్పడం యావత్ శునక జాతికి గర్వకారణం. అన్ని ప్రధాన నగరాల్లో తాజ్, హయత్, ఐ టీ సి, మారియట్ హోటళ్ల నిర్వాహకులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారట. పెంపుడు జంతువులను వెంట తెచ్చుకునే వెసులుబాటు లేక చాలా విలువయిన బుకింగులను కోల్పోతున్నట్లు హోటళ్లు ఆలస్యంగా గుర్తించాయి. కుక్కలు, పిల్లులు, చిలుకలు, పావురాలు పెంచుకునేవారు వాటిని వదిలి రాలేరు. వీరి బాధను గుర్తించి స్టార్ హోటళ్ల వారు వికలాంగులకు ప్రత్యేక రూములను ఏర్పాటు చేసినట్లు పెంపుడు జంతువులు వెంట ఉంచుకోవడానికి వీలుగా కొన్ని రూములను రీ డిజైన్ చేశారు. హోటళ్లలో కుక్కలు ఉదయం వాకింగ్ చేయడానికి వీలుగా ప్రత్యేకమయిన ట్రాక్ ఏర్పాటు చేశారు. జంతువులకు అవసరమయిన ఫుడ్డును కూడా రూముకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చట.

Pet Friendly Hotels:స్మోకింగ్, నాన్ స్మోకింగ్ రూముల్లా పెట్- నో పెట్ రూములు ప్రత్యేకంగా ఉంటాయట. భవిష్యత్తులో కుక్కలకు ఫస్ట్ ఫ్లోర్ లో డైనింగ్, మనుషులకు సెల్లార్ లో డైనింగ్ సపరేట్ గా ఉండవచ్చు. పెంచుకున్న జంతువులు మాటకు నిర్వచనం స్పష్టం కావాల్సి ఉంది. పెంచుకుంటే కోళ్లు కూడా బుద్ధిగా వెంటవస్తాయి. గొర్రెలు, మేకలు సరే సరి. రాత్రిళ్లు మాత్రమే తిరిగేవారికి గుడ్లగూబలు, గబ్బిలాలు మంచి ఫ్రెండ్స్ కాగలవు. వాటి నైట్ విజన్ అసాధారణం. నీళ్లల్లో లేకపోతే మొసలిని కూడా ఫ్రెండ్లిగా పార్క్ హయత్ కు బ్రేక్ ఫాస్ట్ కు తీసుకువెళ్లవచ్చు. పులులు, సింహాలు కూడా పెంచుకుంటే పెరుగుతాయి. అప్పుడవి పెంపుడు జంతువులే అవుతాయి. సింహంతో సింగిల్ గా తాజ్ వివాంతకు బఫేకు వెళ్లవచ్చు. పులితో ఐ టీ సి గ్రాండ్ కు పులిహోర తినడానికి వెళ్లవచ్చు. పెంపుడు మనుషులను తప్ప; పెంపుడు జంతువులను అనుమతించే నైన్ స్టార్ హోటళ్లు ప్రత్యేకంగా నిర్మాణం కావచ్చు.

అన్నట్టు- కలవారి కుక్కలు, నక్కలు నిజానికి కుక్కలు, నక్కలు కావు. వాటికి హిట్లర్, కింగ్ లాంటి సర్వోత్కృష్టమయిన పేర్లు ఉంటాయి. వాటి జన్మకు అవే అసూయపడాల్సిన వైభోగం వాటిది. అవుటింగుల్లో వాటికి తగిన ఫుడ్డు, గుడ్డు, బెడ్డు ఇవ్వడం స్టార్ హోటళ్ల కనీస ధర్మం. మర్యాద.

హే!
ఐ విల్ క్యాచ్ యూ అప్ అట్ తాజ్ మాన్ సింగ్ పూల్ సైడ్ రూమ్ విత్ మై డార్లింగ్ టామీ.

యా!
షూర్. ఐ విల్ బి దేర్ విత్ మై బేబీ క్యూట్ క్యాట్.

సార్!
వాట్ కెన్ ఐ సర్వ్ యూ?

రూమ్ టెంపరేచర్ మెక్సికన్ సూప్ ఇన్ ఫోర్ బౌల్స్.

హ్యవిట్ సార్.
ఎంజాయ్ ది ఫుడ్.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: నష్టాలకు ప్రేక్షకులే ఇవ్వాలి పరిహారం!

Read More: నెస్లే ఒప్పుకున్న అరవై శాతం అనారోగ్యం!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *