Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Unique Names For New Born – What’s in a name

నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు.
“మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు.”

“ఏమిటో నీ కష్టం?”

“పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీదగ్గరకొచ్చాను.”

“ఎలాంటి పేరు కావాలి?”

“ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు.”

“సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరూ పెట్టుకోరు.”

“కానీ, పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ ‘పండు వెన్నెల’, ‘నిండు పున్నమి’ అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విరగబడుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి.”

“మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా రాసుకో. పట్టపగలు, చిమ్మచీకటి, మిట్ట మధ్యాహ్నం.”

“మా పిల్ల పేరు ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్‌ చేయొద్దు సార్‌, ప్లీజ్‌!”

“సర్లే, ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్‌ అంత టెన్షన్‌?”

పిల్లకు పేరుపెట్టే ఉద్దేశమేమైనా ఉందా… అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? – అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్‌!”

“నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి. ‘ఉద్దేశ’, ‘ప్రయత్న’ ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?”

“వేస్టుగాడివంది.”

“వేస్టు అంటే వ్యర్థం. ‘వ్యర్థ’- సూపర్‌ పేరు!”

“ఇప్పుడు చాలామంది శాన్వి అనీ శ్రాగ్వి అనీ పెడుతున్నారు కదా… వాటికి అర్థం ఏవిటండీ?”

“మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే వేస్టుగాడివోయ్‌. పేరుకు అర్థమేంటీ… పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పటి ట్రెండ్‌. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు ‘శ్మశాన’, చిన్నదాని పేరు ‘వాటిక’. ఎలా ఉన్నాయి?”

“బ్రహ్మాండంగా ఉన్నాయి సార్‌. కాదేదీ పేరు కనర్హం అన్నమాట!”

“మరే… ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి… బ్రహ్మాండ, అనర్హ.”

“మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్‌!”

“శూన్య – ఇదేదో బాగుందయ్యా! బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి ‘అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది’ అన్నాడు. అంతే, పిల్ల పేరు ‘విషమ’, పిల్లాడి పేరు ‘సమస్య్‌’. ఎలా ఉన్నాయి?”

“బాగున్నాయి సార్‌. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటోంది.”

“అలా రొటీన్‌ పేరు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.”

“కోప్పడకండి సార్‌!”

“రొటీన్‌కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా… ‘శవకుమారి’ అని పెట్టు. లేకపోతే ‘కళేబరి’ “

గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?”

“ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు ‘సామూహిక’, అబ్బాయి పేరు ‘అత్యాచార్‌’ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తే పేపర్‌ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ… అరె, ఇదేదో బాగుందే, ‘ఖర్మ’ ఎలా ఉంది?”

“చాలా బాగుంది గురువుగారూ. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. ‘నాగఖర్మ’ అని పెట్టుకోమంటారా?”

“మళ్ళీ ఇదొకటా?”

“అవును సార్‌. మా కజిన్ల పేర్లు ‘నాగ బీభత్స్‌’, ‘నాగ డింభక్‌’, ‘నాగ హిడింబ్‌’. మా అన్నయ్య తన పిల్లలకు ‘సర్ప జగదేక్‌’, ‘నాగ అతిలోక్‌’ అని పెట్టాడు. వాడు చిరంజీవి ఫ్యాన్‌లెండి.”

“మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం… దరిద్ర… నాగ దరిద్ర అని పెట్టు.”

“కానీ మా ఆవిడ మూడక్షరాల పేరే పెడదామంటోంది.”

“‘కుబుస’ అని పెట్టు, సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించినదే. అక్షరాలూ మూడే.”

“అద్భుతం సార్‌. ఇదే ఫైనల్‌. ‘కుబుస’ అని పెట్టేస్తా.”

చూశారా? పిల్లల పేర్ల ఉత్పత్తి ప్రకరణం!

(వాట్సాప్ యూనివర్సిటీలో పుట్టి, వైరల్ గా తిరుగుతున్న అజ్ఞాత రచయిత పోస్టు ఇది. చక్కగా రాశారు. ఎవరికీ లేని వెరైటీ పేరు పెట్టుకోవాలన్న ఆరాటం కాస్తా ప్రకోపించి, ఉన్మత్త దశ దాటి అర్థరహితమయిన పేర్ల వెంట పరుగులు తీస్తోంది. అనయ, అసహాయ, విషయ, కేతాన్, విహా, సహా, సఫా, కైవల్య్, కపాల్…ఇలా అర్థం తెలిస్తే గుండె ఆగిపోయే పేర్లకే ఇప్పుడు యమ డిమాండు.

కొన్ని పేర్లకు అర్థం తెలియకపోవడమే మంచిది. కొందరికి పేర్లే అవసరం లేదు. నిజానికి మన పిచ్చిగానీ- అడవిలో జంతువులకు పేర్లున్నాయా? వీధిలో కుక్కలకు పేర్లున్నాయా? మనిషిని మనిషిగా గుర్తించే మహోన్నత వేదాంత పారిభాషిక భాషలో పేర్లన్నీ లయించి…అతడు/ఆమె/అది మాత్రమే మిగులుతాయి. జ్ఞానం పండితే ఈ సర్వనామాలు కూడా నామరూపాల్లేకుండా పోయి- జీవ బ్రహ్మైక్య సిద్ధి లభిస్తుంది. ఈ సాధనలో తొలిమెట్టు- అర్థం లేని పేరు పెట్టుకోవడం. పేరును అర్థం లేనిదిగా చేసుకోవడం!)

Also Read : సర్వమత సమానత్వం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com