Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశతాధిక గ్రంథకర్త బులుసు వేంకటరమణయ్య

శతాధిక గ్రంథకర్త బులుసు వేంకటరమణయ్య

Bulusu Venkataramanayya :

మా నాన్నగారి వల్ల సాహితీ ప్రపంచంలో ఉద్దండులైన వారిని చూడగలిగాను. వారి గురించి తెలుసుకోగలిగాను. అటువంటి సుప్రసిద్ధులలో బులుసు వేంకట రమణయ్య  (1907-1989) గారొకరు. మా నాన్నగారూ, ఈయనా తెలుగు మేష్టారులే. వీరు పని చేసిన స్కూళ్ళు వేర్వేరైనా ఇద్దరూ సన్నిహిత మిత్రులే. మద్రాసులోని సుంకరామ చెట్టిస్ట్రీటులోని బాలసరస్వతి బుక్ డిపోవారికి ఇద్దరూ ఆస్థాన రచయితలు కావడం విశేషం. ఇద్దరూ గ్రంథ సమీక్షకులే. బులుసువారు రకరకాల పేర్లతో పుస్తకసమీక్షలు చేసారు. మా నాన్నగారి రెండు పుస్తకాలనూ ఆయన సమీక్షించారు. అవి, గంగావతరణము, మహాభాగవతము.

చిన్నయసూరి బాలవ్యాకరణానికి బులుసువారు రాసిన టీకా లక్షకుపైగా కాపీలు అమ్ముడైనట్లు వావిళ్ళవారి ప్రతినిధి అల్లాడి స్వామినాథన్ గారు చెప్పినట్లు ఆయన కుమారులైన ప్రభాకర శర్మగారి వల్ల తెలిసింది. బులుసు వారి కుమారులతో నాకు ఇప్పుడిప్పుడే పరిచయం. వాళ్ళ నాన్నగారి గురించి ఏదైనా రాయాలనిపించింది. అయితే కావలిలో ఉంటున్న కె.విఎస్. ప్రసాద్ గారి వల్ల బులుసు గారి కుమారులైన సీతారామమూర్తి పరిచయమయ్యారు. ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఈయనను కానీ ఆయన సోదరులను కానీ చూడలేదు. ఫోన్లలో మాట్లాడటమే. అలా మాట్లాడుకున్న చనువుతో సీతారామమూర్తిగారిని వాళ్ళ నాన్నగారి గురించి కొన్ని వివరాలడిగితే చెప్పారు.

ద్వానా శాస్త్రిగారి సంపాదకత్వంలో “మా నాన్నగారు” అనే పుస్తకంలో బులుసు వేంకటరమణయ్యగారి గురించి వారి కుమారులు, పాత్రికేయులు ప్రభాకర్ గారు రాసిన వ్యాసం ఉన్నప్పటికీ సీతారామమూర్తిగారు ఇచ్చిన సమాచారంతో కొన్ని విషయాలిక్కడ పంచుకుంటున్నాను.

బి ఓ ఎల్, ఉభయభాషాప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ (కాశీ) వంటివి చదివిన వేంకటరమణయ్యగారు వావిళ్ళ వారికి బాలవ్యాకరణం, – సుబోధినీ వ్యాఖ్య, ప్రబంధాల పరిష్కరించారు. వందకుపైగా పుస్తకాలు రాసిన ఈయనకు రెండుసార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారా లభించాయి. కిన్నెర అనే మాసపత్రికకు గౌరవ సంపాదకులుగా ఉండిన ఆయన నార్ల వెంకటేశ్వరరావుగారి మాట మేరకు కొంతకాలం ఆంధ్రజ్యోతిలో ఉచితంగా గ్రంథసమీక్షలు రాయడం గమనార్హం. ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా రాసిన ఈయన ధర్మపథానికి విశేష ఆదరణ లభించింది.వేంకటరమణయ్యగారు పిల్లలతో బాగా ఉండేవారు. చదివేటప్పుడు తప్పులు చదివితే మందలించేవారే తప్ప కొట్టేవారు కాదు. ఉదయంపూట అనుకున్న సమయానికి ఇంట్లో వంట అవకపోతే సీతారామమూర్తిగారికి అణా ఇచ్చేవారట ఉడుపి హోటల్లో ఇడ్లీ తినడానికి. అది తిని బడికి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనే వారట. సీతారామమూర్తిగారు తొలి రోజుల్లో ఆంగ్లంమీద పట్టు లేకపోవడాన్ని గమనించిన వేంకటరమణయ్యగారే ఇంగ్లీషు చెప్పేవారట. రవలడ్లు, సున్ని ఉండలు, బూరెలు, గారెలు, పెరుగువడలంటే ఇష్టమున్న వేంకటరమణయ్యగారికి డైరీ రాసే అలవాటుండేది. ప్రతి జనవరిలో తప్పనిసరిగా “Hoe & Co” డైరీ కొనేవారు. ఆదాయవ్యయాలు వంటివి రోజూ రాసేవారు. అలాగే తమకు వచ్చిన ఉత్తరాలు, రాసి పోస్టు చేసిన ఉత్తరాల వివరాలు, ముఖ్యమయిన సభలు – సమావేశాలు, ఎవరెవరిని కలిశారో, ఏఏ పత్రికలకు ఏయే కథలు, వ్యాసాలు, సమీక్షలు పంపారో, ఏ పత్రిక నుండి ఏ పుస్తకాలు సమీక్ష కోసం వచ్చాయో డెైరీలో రాసేవారు.

ఆయన శిష్యుడైన బీదబ్బాయి జోశ్యుల ఆంజనేయ శాస్త్రి ప్రతి గురువారం వీరింట భోజనం చేసేవాడు. అతని కుటుంబానికి ఈయన వస్తురూపేణా సాయం చేసేవారుకూడా. అతను తర్వాతి రోజుల్లో ఎస్.బి.హెచ్. బ్రాంచి మేనేజర్ ఆయ్యాడు. ఆయన మరొక శిష్యుడు మద్రాసులో Income Tax Commissioner అయ్యాడు. అతని తమ్ముడు ఓరుగంటి చక్రపాణి కూడా ఆయన శిష్యుడే. అతను Advocate అయిన తర్వాత Australia వెళ్ళిపోయాడు. ఒక రష్యన్ కి, ఒక జర్మన్ కి ఓ నెలరోజులు తెలుగు నేర్పిన వేంకటరమణయ్యగారు తన కుమారుడు సీతారామమూర్తితో కలిసి సెలెక్ట్ టాకీసు (మద్రాసు) లో “వీరపాండియ కట్టబొమ్మన్” సినిమా చూసారు. ఆ తర్వాతే ఆయన “వీరపాండ్య కట్ట బ్రహ్మన” చారిత్రక గాథ రాశారు. ఆయన సినిమాలు తక్కువగానే చూసేవారు. ఆయన ట్యూషన్లు పెద్దగా చెప్పకపోయినా, ఇద్దరికి చెప్పడం గుర్తుందని మూర్తిగారు చెప్పారు. వారిలో ఒకరు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడు (ఫిడేలు విద్వాంసుడు) కుమారుడు శ్రీనివాస రావు. ఇంకొకరు ఓ ధనవంతుడి కొడుకు కృపాకర రావు. వీరిద్దరూ మూర్తిగారికి క్లాసుమేట్సే. విద్యాధికులై జీవిత బీమా సంస్థలో పని చేసి పదవీ విరమణ చేసిన సీతారామ మూర్తిగారు Southern Languages Book Trust వారు నిర్వహించిన “Certificate Course in English to Telugu Translation” లో తన మిత్రుడైన ముద్దా చిట్టిబాబు (Andhra Bank, Madras) సూచన మేరకు చేరి 3 నెలలు Stipend కూడా పొందారు. ఆ సమయంలో ఆయనకు గురువులుగా పాఠాలు చెప్పినవారు మహాకవి శ్రీశ్రీ, విద్వాన్ విశ్వం (ఆంధ్రప్రభ), కొడవటిగంటి కుటుంబరావు (చందమామ), డా. చల్లా రాధాకృష్ణ శర్మ తదితరులు. శ్రీశ్రీగారు చాలా నెమ్మదస్తుడట, నిదానంగా, స్పష్టంగా పాఠం చెప్పేవారని గుర్తు చేసుకున్నారు మూర్తిగారు.

మద్రాసుకి ఎవరైనా బ్రిటీష్, అమెరికన్ కవులు వచ్చి, సభ జరిపితే శ్రీశ్రీ గారు తప్పకుండా హాజరయ్యేవారు. అప్పుడు మూర్తిగారూ ఆ సభలకు వెళ్ళేవారు. తమ తండ్రిగారు M.A చేయకపోవడం వల్ల జీవితంలో పైకి రాలేకపోయారన్న బాధతోనూ, తన భార్య గతించిన బాధను జీర్ణించుకోవడం కోసమూ, అలాగే చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా ఎం.ఎలో చేరిన మూర్తిగారు తన 76వ ఏట ప్రథమ శ్రేణిలో ప్యాసవడం గమనార్హం. రోటరీ క్లబ్ ద్వారా క్రమం తప్పక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదల విద్యార్థులకూ సాయమందించడంలో తండ్రిని మించిన తనయులయ్యారు మూర్తిగారు.

– యామిజాల జగదీశ్

Also Read : పాత్రలకే వన్నెతెచ్చిన గుమ్మడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్