స్వాతంత్య్రం నా జన్మహక్కు అనే నినాదం మనకు తెలిసిందే. మరి ‘రిపేర్ నా హక్కు’ విన్నారా?
మీరో కొత్త ఫోన్ కొన్నారు. మూడు నెలలకే సమస్య వచ్చింది. షాప్ కి తీసుకెళ్తే స్పేర్ పార్ట్స్ దొరకడం లేదన్నారు. కొత్త వెర్షన్ ఫోన్ వచ్చింది కాబట్టి పాత మోడల్ రిపేర్లు చెయ్యలేమన్నారు. ఏం చేస్తారు? ఫోన్ అవసరం కాబట్టితిట్టుకుంటూ ఇంకో ఫోన్ కొనుక్కుంటారు.
ఆపిల్ కంపెనీ అయితే కొత్త ఫోన్ వచ్చినపుడల్లా ధరలు పెంచేస్తోంది. తాజాగా చార్జర్ ఇవ్వడమూ మానేసింది. ఒకటిన్నర లక్ష పెట్టి ఫోన్ కొంటే, కవర్, చార్జర్, ఇయర్ పోడ్స్ ఇంకో పాతిక వేలు అవుతున్నాయి. స్టోరేజ్ డేటాని బట్టి ఫోన్ రేట్ మారుతుంది. ఇదంతా మనకి తెలిసే కొంటాం. కానీ ఫోన్లలో, ఇతర కంప్యూటర్లు, పరికరాల రిపేర్ల మాటేమిటి?
ఇదివరకు కారయినా, ఫోనయినా కొన్నేళ్లు వాడేవారు. ఇప్పుడు కంపెనీలే వాటిని పక్కన పారేసి కొత్త మోడల్ కొనుక్కోమంటున్నాయి. దాంతో పాత సామాన్లకు, గోడవున్లకు ఈ ఎలక్ట్రానిక్ చెత్త చేరి పేరుకుంటోంది. ఫలితం పర్యావరణ కాలుష్యం. వినియోగదారుల్ని ఆకర్షించడానికి లేదా దోచుకోడానికి కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి. అంతేకానీ కొనుగోలుదారులకు మేలు జరిగేలా ఒక్క పనీ చెయ్యవు. చిన్న పరికరాల రిపేర్ మనమే చేసుకునేలా, స్పేర్ పార్ట్స్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది? మన దగ్గర పట్టించుకోరుగానీ విదేశాల్లో ఈ సమస్య నుంచి ఉద్యమం పుట్టింది. ‘రైట్ టు రిపేర్’ అంటూ అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా దేశాల ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు గళమెత్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు,స్మార్ట్ వాచీలు, ఫోన్లలో తలెత్తే చిన్న సమస్యలకు పరిష్కారం తెలిపే సమాచారం, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచాలని ఈ ఉద్యమం కోరుతోంది. మసాచుసెట్స్ రాష్ట్రంలో ఇప్పటికే రైట్ టు రిపేర్ బిల్లు చట్టంగా రూపొందింది. మరిన్ని రాష్ట్రాలూ ఆ దిశలో పయనిస్తున్నాయి. బ్రిటన్ సైతం టీవీ, వాషింగ్ మెషీన్స్ అమ్మకందారుల రైట్ టు రిపేర్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
సహజం గానే ఆపిల్, టెస్లా వంటి కంపెనీలకు రైట్ టు రిపేర్ నిబంధనలు నచ్చవు. ఇందుకు వారు చెప్పే కారణం తమ టెక్నాలజీ, ప్రత్యేకతలు చోరుల పాలయ్యే ప్రమాదం ఉందని. వారు తలచుకోవాలే గానీ అలా కాకుండా చేయలేరా ఏంటి? ఎంతసేపూ తమ లాభాలే గానీ వినియోగదారుడికి కాస్త ఊరట కలిగిద్దామని ఈ సంస్థలకు లేకపోవడం విచారకరం. ఈ రైట్ టు రిపేర్ ఉద్యమం ప్రపంచమంతా విస్తరించాలని, వినియోగదారుల వెతలు పరిష్కారమవాలని సగటు మధ్యతరగతి ఆకాంక్ష. ఆ బాధలన్నీ మాకెందుకు అంటారా? చేతిలో ఫోన్ పడేసి కొత్త మోడల్ తెచ్చుకోండి.

కె. శోభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *