Sunday, January 19, 2025
Homeసినిమా'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' విజయం సాధించేనా..?

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ విజయం సాధించేనా..?

నాగ శౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి.

మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్  హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అడివి శేష్, నిర్మాతలు అశ్వినీదత్, సునీల్ నారంగ్, రవి శంకర్, దామోదర ప్రసాద్, కోన వెంకట్, దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందం, అతిరథమహారధుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. నాయకానాయికల స్వచ్ఛమైన, సహజమైన ప్రేమ ప్రయాణంతో రూపొందిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. “రికార్డు అవుతుందా?.. యాక్షనా?..”, “యాక్షన్” అంటూ నాయకానాయికల వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. కాలేజ్ సమయంలో బస్ లో వెళ్తూ అనుపమగా కథానాయిక, సంజయ్ గా కథానాయకుడు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం చూడొచ్చు. ఆ పరిచయం నుంచి వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ముఖ్యంగా కొన్నేళ్ళ తర్వాత “హాయ్.. నువ్వేంటి ఇక్కడ” అంటూ పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకోవడం చూస్తుంటే.. అసలు వారి మధ్య ఏం జరిగిందనే ఉత్కంఠ కలుగుతోంది. ట్రైలర్ లోని సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా.. ఇది మన మధ్య జరుగుతున్న కథ అనే భావన కలిగించేలా ఉన్నాయి. ఇక నాయకానాయికల మధ్యలోకి శ్రీనివాస్ అవసరాల పాత్ర రావడం, ఆయన రాకతో కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించారు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే… ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ త్రయం ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్