ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో అగ్రవర్ణాల దాష్టికాలను ఎదిరించిన ధీర మహిళ పూలన్ దేవి. బందిపోటు ముఠా నాయకురాలిగా మానవతా దృక్పథం చాటిన పూలన్ దేవిని చంబల్ లోయలో దుర్గ దేవిగా భావించేవారు. నిమ్న జాతులను దోచుకునే ఠాకూర్ల పని పట్టేందుకు దశాబ్దాల క్రితమే “సర్జికల్ స్ట్రైక్” చేసి.. ఫిమేల్ రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్నారు.
ఫిబ్రవరి 14, 1981.. అది ఉత్తర్ ప్రదేశ్, కాన్పూర్ దేహాత్ జిల్లాలోని “బెహ్మాయి” గ్రామం.. ఆ గ్రామం చూట్టూ ఉన్న వేల ఎకరాల భూములు మొత్తం క్షత్రియు కులస్తులైన “ఠాకూర్ల” సొంతం.
మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఒక 19 ఏళ్ళ యువతి నాయకత్వంలో మరి కొంతమంది పోలీసు యూనిఫారంలలో, తుపాకులతో ఆ గ్రామంలోకి ప్రవేశించి శ్రీరామ్, లల్లా రామ్ ల ఆచూకీ అడగడం ప్రారంభించారు. మొత్తం ఠాకూర్ల ఇళ్ళు అన్నీ గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. వాళ్ళ ఆచూకీ దొరకక ఆ వచ్చిన బృందం వెనక్కి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు.
అప్పుడు ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆ యువతి “శ్రీరామ్, లల్లారామ్ మాత్రమే మన శత్రువులు కాదు. కుల మదంతో కొట్టుకుంటూ రోజూ దళితుల మీద దాడులు అరాచకాలకు తెగబడుతున్న ఈ క్షత్రియ రాజ్ పుత్ జాతి మొత్తం మనకు శత్రువులే.., కాబట్టి ఈ జాతి మొత్తానికి బుద్ధి చెప్పాలని అంటూ, ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఠాకూర్ కులానికి చెందిన పురుషులను వరసగా నిలబెట్టించింది. తన బృందంతో వాళ్ళ మీద గుళ్ళ వర్షం కురిపించింది.. ఆ ఊచకోతలో 22 మంది ఠాకూర్లు చనిపోతే 80 మంది దాకా చావును దగ్గరగా చూసి బతికిపోయారు.
ఆ సంఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అదే ఠాకూర్ కులానికి చెందిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తన పదవికి రాజీనామా చేసాడు. దేశ వ్యాప్త మీడియా మొత్తం ఆ 19 ఏళ్ళ “బందిపోటు రాణి” “Bandit Queen” గురించి వార్తలే ప్రధానంగా ప్రచురించాయి. ఉత్తరప్రదేశ్ దళిత కులస్తులంతా ఆ 19 ఏళ్ళ యువతిని “దళిత దుర్గా దేవి”గా కొలవసాగారు. పూలన్ దేవి ముఖంతో దుర్గాదేవి ఫోటోలు మార్కెట్లను ముంచెత్తాయి. రోజూ దళితుల మీద దాడి చేస్తూ ఉండే ఠాకూర్ కులాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయం భయంగా గడపసాగాయి.
రాముని వంశస్తులం, రాణా ప్రతాప్ వారసులం, వీరత్వానికి ప్రతీకలం అని విర్రవీగుతున్న అగ్రకుల క్షత్రియులకు వెన్నులో వణుకు పుట్టించిన ఆ యువతి పేరు “ఫూలన్ దేవి”.
ఫూలన్ – తిరుగుబాటుకు మారుపేరు
దేవీదిన్ (తండ్రి), మూల (తల్లి)ల నాల్గవ సంతానం ఫూలన్,, గంగా-యమున ప్రాంతాలలో పడవలు నడుపుకుంటూ జీవనం సాగించే “మల్ల” కులస్తులు (మన రాష్ట్రంలో “బెస్త” కులం) వీరు.. అంటరానివారిగా పరిగణించబడే మల్ల కులం వారికి సహజంగానే తిరుగుబాటు ధోరణి అధికం. బ్రిటిష్ పాలన సమయంలో, మల్ల కులస్తులు పింజరీ కులస్తులతో పాటు కలిసి అధికంగా దారి దోపిడీలలో పాల్గొనే వారు. దానితో వీళ్ళను Criminal Tribesలో చేర్చింది బ్రిటీష్ ప్రభుత్వం.. ప్రతీ దోపిడీ తర్వాత దర్గాదేవిని పూజించడం పింజరీల కుల ఆనవాయితీ, వీరికి కూడా అలవాటు అయ్యింది.
పూలన్ చిన్నప్పటి నుండి తిరుగుబాటు ధోరణి కలిగి ఉండేది. తన తండ్రికి ఉన్న 4 సెంట్లను తన పెదనాన్న కొడుకు ఆక్రమిస్తే 11 సంవత్సరాల పూలన్, అతని మీద దాడి చేసింది. తన పెదనాన్న ఒత్తిడితో తన తండ్రి బలవంతంగా వయసులో తనకంటే చాలా పెద్దవాడైన పుట్టి లాల్ తో పెళ్ళి చేస్తే, అతని లైంగిక హింసకు తట్టుకోలేక పారిపోయి ఇంటికి వచ్చింది. తనకు 16 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ భర్త దగ్గరకు పంపారు ఆమె తల్లిదండ్రులు.. అప్పటికీ తన భర్త ప్రవర్తన మారకపోవడంతో శాశ్వతంగా ఇంటికి వచ్చేసింది ఫూలన్.
ఫూలన్ తిరుగుబాటు ధోరణికి ఆకర్షితుడైన విక్రమ్ మల్ల అనే బంధిపోటు ముఠా సభ్యుడు ఫూలన్ కు దగ్గర అయ్యాడు. విక్రమ్ సహచర్యం వలన బందిపోటు ముఠా కార్యకలాపాలలో ఫూలన్ కూడా పాలు పంచుకోసాగింది. అంతలో ఆ ముఠా నాయకుడు, గుజ్జర్ కులస్తుడైన బాబూ గుజ్జర్ ఫూలన్ దేవిని తన లైంగిక వాంఛ తీర్చమని బలవంతం పెట్టాడు. ఒకరోజు ఫూలన్ పై అత్యాచార యత్నం చేయబోతే, విక్రమ్ మల్ల బాబూ గుజ్జర్ ను చంపి ఫూలన్ ను కాపాడి ఆ మూఠాకు నాయకుడిగా ప్రకటించుకున్నాడు. ఇక ఫూలన్ దేవి కూడా గన్ను పేల్చడం, గుర్రం నడపడం వంటివి నేర్చుకుని పూర్తి స్థాయి ముఠా సభ్యురాలిగా మారిపోయింది. మల్లలు అధికంగా ఉన్న ముఠా కావడంతో, వాళ్ళు ఎక్కువగా అగ్రకులాలకు చెందిన వాళ్ళు నివసించే గ్రామాలను దోచుకుంటూ, ఆ సంపదను దళితులకు పంచడం మొదలుపెట్టారు. కులవివక్ష దాడులు జరిగే ప్రాంతాల మీద దాడులు చేయడం మొదలెట్టారు.
ఫూలన్ దేవి రెండు సంవత్సరాలలో దళ కమాండరు స్థాయికి ఎదిగింది. ఒకరోజు తన మాజీభర్త గ్రామానికి వెళ్ళి, అతన్ని బయటకు లాక్కొచ్చి, ఊరి మధ్యలో నిలబెట్టి అతన్ని కత్తితో కసితీరా పొడిచి… ఇక ఎవడైనా “బాల్య వివాహాలు చేసుకుంటే ఇలాంటి శిక్షలే విధిస్తాను” అంటూ ఊరిలో గోడల మీద రాయించింది.
ఫూలన్ మీద ఠాకూర్ కులస్తుల దాష్టికం
పాత నేరాలలో జైలుకు వెళ్ళి తిరిగివచ్చిన బాబూ గుజ్జర్ ముఠా సభ్యులైన శ్రీరామ్, లల్లా రామ్ విషయం తెలుసుకుని రగిలిపోయారు. తమకంటే తక్కువ కులం అయిన మల్లల నాయకత్వంలోకి ముఠా వెల్లడాన్ని గుజ్జర్లు జీర్ణించుకోలేకపోయారు. ఒక పథకం ప్రకారం శ్రీరామ్, లల్లా రామ్ ఎక్కువ మంది ఠాకూర్లను ముఠాలో చేర్చుకోవడం మొదలెట్టారు. సంపద కలిగిన అగ్రకులాల మీద కాకుండా మల్లలు అధికంగా ఉన్న గ్రామాల మీద దాడులు చేస్తూ, మల్లల స్త్రీలపై అత్యాచారాలు మొదలుపెట్టారు. దాంతో చాలామంది మల్ల కులస్తులు ముఠాను వదిలి వెళ్ళడం ప్రారంభించారు.
క్రమంగా ముఠా మొత్తం క్షత్రియుల చేతుల్లోకి వెళ్ళి, దళిత కులాల మీద ఆకృత్యాలు పెరగడంతో విక్రం మల్ల, ఫూలన్ ఈ ముఠా మీద తిరుగుబాటు ప్రకటించారు. దాంతో విక్రం, ఫూలన్ లను చంపేందుకు నిర్ణయించుని హత్యా ప్రయత్నం చేసారు. అక్కడి నుంచి తప్పించుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత దొరికిపోయారు ఫూలన్ – విక్రం..
1979 అక్టోబరు నెలలో పూలన్ – విక్రం లను బెహ్మాయ్ గ్రామానికి తీసుకువెళ్ళి, విక్రంను కాల్చి చంపారు. పూలన్ ను బట్టలు విప్పి కొట్టుకుంటూ ఉరంతా తిప్పారు. 3వారాల పాటు బంధించి ఆ ఊరి మగవాళ్ళంతా మార్చి మార్చి ఒకరి తర్వాత ఒకరు ఘోరంగా అత్యాచారం చేసారు. పూలన్ కు జరుగుతున్న ఘోరమైన అత్యాచారాన్ని మల్లల ప్రాభల్యం ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రచారం చేస్తూ, తమకు ఎదురు తిరిగితే ఈ గతే పడుతుందని హెచ్చరికలు చేసారు.
చివరకు 3 వారాల తర్వాత, ఇద్దరు మల్ల, గ్రామానికి చెందిన ఒక దోభీ కులస్తుని సహకారంతో బెహ్మాయ్ నుండి తప్పించుకోగలిగింది ఫూలన్ దేవి.
పూలన్ – The Female Robinhood
అక్కడి నుండి బయట పడ్డ పూలన్ మరింత శక్తివంతంగా మారారు. తనను అన్నగా ఆదరించి పరిరక్షించిన మాన్ సింగ్ మల్లతో కలిసి సరికొత్త దళాన్ని తయారు చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చంబల్ లోయలో అగ్రకులాలకు సింహ స్వప్నంగా మారారు. దోపిడీ దారుల నుంచి దోచుకొని దళితులకు సహాయం చేసేవారు.
తను బెహ్మాయ్ నుండి పారిపోయి వచ్చిన 17 నెలలకు ఫిబ్రవరి 14,1981న బెహ్మాయ్ గ్రామానికి వెళ్ళి పూలన్ దళితుల సత్తా చాటి, అగ్రకులాల కంటి మీద కునుకు లేకుండా చేసారు.
తదుపరి పరిణామాలు – పూలన్ దేవి హత్య
పూలన్ దేవి కోసం ఎంత గాలించినా ఆవిడ దొరకలేదు, రెండు సంవత్సరాల తర్వాత చివరికి ఇందిరా గాంధీ హయాంలో కొన్ని హామీలు ఇవ్వడంతో తనకు తానుగా లొంగిపోయారు. లొంగిపోయేటప్పుడు ముఠాలోని ఏ సభ్యునికీ కూడా 8 సంవత్సరాలు మించి శిక్ష వేయము అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. చివరకు 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపాక 1994లో ములాయం సింగ్ సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం పూలన్ దేవి మీద ఉన్న కేసులు అన్నీ వెనక్కు తీసుకుని, పేరోల్ మీద పూలన్ ను విడుదల చేసింది. ములాయం సింగ్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం లేపింది.
రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్య పరుస్తూ ములాయం 1996 పార్లమెంటరీ ఎన్నికలలో పూలన్ కు మీర్జాపూర్ నియోజకవర్గం నుండి టికెట్టు ఇచ్చారు.. అప్పటికే దళిత కులాల దేవతగా ఉన్న పూలన్ దేవి తిరుగులేని ఆధిక్యంతో గెలిచి తన 33వ ఏట పార్లమెంటులో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిలో ఒకరిగా పేరుపొందారు. అదే ఊపులో మళ్ళీ 1999 పార్లమెంటు ఎన్నికలలో గెలిచి రెండోసారి MPగా ఎన్నిక అయ్యారు..
జులై 25, 2001 తన ఇంటి నుండి బయటకు వస్తుండగా ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు పూలన్ దేవి మీద బుల్లెట్ల వర్షం కురిపించారు, అతి దగ్గర నుండి తలలో మూడు బుల్లెట్లు, శరీరంలో రెండు బుల్లెట్లు కాల్చడంతో పూలన్ దేవి అక్కడికక్కడే మరణించారు.. మరణించే సమయానికి ఆమె వయసు 37 సంవత్సరాలు.
తర్వాత రోజు, శేర్ సింగ్ రాణా అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.. ఫిబ్రవరి 14, 1981 న పూలన్ దేవి బహ్మాయ్ లో ఠాకూర్లను ఊచకోత కోయడానికి ప్రతీకారంగా పూలన్ దేవిని చంపినట్లు ప్రకటించాడు. పూలన్ మరణ వార్తను ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ఠాకూర్ల గ్రామాలలో చాటింపు వేయించుకుని రంగులలో హోళీ పండుగ చేసుకున్నారు. శేర్ సింగ్ రాణాను రాముని అవతారంగా కీర్తించసాగారు. అతన్ని శిక్ష నుండి తప్పించడానికి వందల కోట్లు చందాలు వేసుకుని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చారు. పోలీసు వ్యవస్థను కొని సాక్ష్యాలు మాయం చేయించారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి 2014 దాకా 13 సంవత్సరాలు కేసు సాగింది. 2014లో అతనికి 14 సంవత్సరాల కారాగారవాసం విధించి, అందులో 13 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి మరో సంవత్సరం పాటు శిక్ష కొనసాగేలా తీర్పు ఇచ్చింది కోర్టు.. అప్పటికి మళ్ళీ సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణలు మారడంతో, క్షత్రియుల ఓట్లు దూరం చేసుకోకూడదు, అనే ఉద్దేశంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెల్లలేదు.
“దీదీ” పూలన్ – బడుగు బలహీన వర్గాల ఉద్యమ చరిత్రలో ధృవ తార, మహిళా ఉద్యమాలకు వేగు చుక్క, శౌర్య ప్రతాపాలకు మచ్చుతునక అని బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఇప్పటికి ప్రస్తుతిస్తారు.
-దేశవేని భాస్కర్