Sunday, November 24, 2024

మహా వట చరిత్ర

Badaa Banyan:
ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె
నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే
కాగ్రచిత్తంబున నతిశయిల్లు
నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు
నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ
పములతో లంఘించెఁ బక్షివిభుఁడు

నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు”

-అనంతామాత్యుడి భోజరాజీయం.

అనంతామాత్యుడు 15శతాబ్దపు కవి. భోజరాజీయంలో ఒకచోట ఆయన వర్ణించిన మర్రి చెట్టు ఇది. ఆ మర్రి ఆకు శేషశాయికి పరుపులా అమరిందట. ఆ మర్రి మొదలులో శివుడు ఏకాగ్రంగా తపస్సు చేసుకుంటున్నాడట. ఆ మర్రి నీడలో ఉంటే చంద్రుడి చలువ వెన్నెల్లో ఉన్నట్లు హాయిగా ఉంటుందట. ఆ చెట్టు మీదినుండే గరుత్మంతుడు ఏనుగు, తాబేలును తన్నుకుని వెళ్ళాడట. అలాంటి కనుచూపు మేర విస్తరించిన పెద్ద ఊడల మర్రి ఉన్న ఈ ద్వీపాన్ని వట ద్వీపం అనే కదా పిలవాలి?

మహబూబ్ నగర్ వెళ్లిన ప్రతిసారీ ఈ పద్యం గుర్తొస్తూ ఉంటుంది నాకు. పిల్లలమర్రి పేరు వినని వారుండరు. హైదరాబాద్ నుండి వెళ్లేప్పుడు మహబూబ్ నగర్ ఊరి ముందు కుడివైపు మూడు కిలోమీటర్లు లోపలికి వెళ్లగానే కనిపిస్తుంది ఎనిమిది వందల ఏళ్లుగా ఊడలు దిగి శాఖోప శాఖలుగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన పిల్లలమర్రి. ఈ పెద్ద మర్రి ఊడలతో లెక్కకు మిక్కిలి పిల్లలను కన్నది కాబట్టి పిల్లలమర్రి అయ్యింది.

Pillalamarri Banyan Tree

ఎన్నోసార్లు మహబూబ్ నగర్ వెళ్లినా ఎందుకోగానీ పిల్లలమర్రి చూడలేదు. మొన్న ఒకరోజు మహబూబ్ నగర్ మీదుగా వెళుతున్నప్పుడు నా శ్రీమతి పట్టుబట్టి కారును పిల్లలమర్రికి తిప్పింది. నిస్సత్తువతో మంచాన పడ్డవారికి సెలైన్ ఎక్కిస్తారు. అలా కూలిపోతున్న పిల్లలమర్రి ఊడలకు పైపులు ఆధారం పెట్టి, ఎండిపోతున్న కాండాలకు సెలైన్ లాంటి ద్రవరూప పోషకాలను ఎక్కిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు. అక్కడే ఒక మ్యూజియం, శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం కూడా ఉన్నాయి.

అనంతామాత్యుడు వర్ణించిన ఆ మహా మర్రి గయ క్షేత్రంలోనిది. ఏదో సంస్కృతకావ్యంలో ఆ వర్ణన ఉన్నట్లుంది. పిల్లలమర్రి పినవీరభద్రుడు కూడా ఈ భావాన్నే తీసుకుని ఒకచోట వర్ణించాడు. అనుకరణ అనడానికి వీల్లేదు. ఎవరి శైలి వారిది.

అనంతామాత్యుడు పుట్టడానికంటే మూడొందల ఏళ్లు ముందే పుట్టిన ఈ మర్రిని చూసి ఏమయినా అలా రాశాడో! ఏమో!

ప్రస్తుతం పిల్లలమర్రికి కృత్రిమ పోషకాలు ఎక్కించడం, ఊడలు ఒరిగిపోకుండా సపోర్టింగ్ స్తంభాలు ఏర్పాటు చేయడం, కాండానికి చెద పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం…ఇలా తెలంగాణ ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. ఎండిన ఊడలు మళ్లీ చిగురించాయి. కూలిన చెట్టు మళ్లీ నిలబడుతోంది.

Pillalamarri Banyan Tree

ఎన్నాళ్ళుగా కొమ్మల చేతులు చాచి పిలుస్తోంది పిల్లలమర్రి?
ఎనిమిది వందల ఏళ్లుగా.
మరి అలసట రాదా?
వార్ధక్యంలో అంతటి పిల్లమర్రి ఊడలకు ఊత కర్ర సాయం అవసరం లేదా?
కొంచెం చూపు మందగించి, నడుము వంగింది కానీ…మన పిల్లలమర్రికి కళ్ళజోడు పెట్టి, ఊడలకు చేతి కర్ర ఇస్తే…దాని ముందు ఎంతటి చెట్టయినా గడ్డిపోచే. అది ఆకాశమంత ఎదిగిన పిల్లలమర్రి. భూమి అంతా ఊడలతో విస్తరించిన పిల్లలమర్రి. మహబూబ్ నగర్ ఊరు పుట్టకముందు…ఇంకా ముందు…ఎప్పుడో పుట్టిన పిల్లలమర్రి. తరాలు దొర్లుతున్నా…తరగని వన్నెల పిల్లలమర్రి.

అనంతామాత్యుడు అన్నట్లు…
దీని మీద ఏ గరుత్మంతుడు వాలాడో?
ఏ బాలకృష్ణుడు ఈ మర్రాకు మీద తేలుతూ వటపత్రశాయికి ఉయ్యాల పాట విన్నాడో?
ఏ శివుడు దక్షిణామూర్తిగా మర్రి మూలంలో మౌనముద్రలో తపస్సు చేసుకుంటున్నాడో?
ఏ బ్రహ్మ ఈ మర్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడో?
ఎవరికెరుక!

Pillalamarri Banyan Tree

అన్నట్లు-
తెలుగులో శృంగార శాకుంతలం, జైమినీ భారతం కావ్యాలు రాసిన పిల్లలమర్రి పినవీరభద్రుడి ఇంటిపేరుకు ఈ పిల్లలమర్రి కారణం అయి ఉంటుందా? ఆయనేమో నల్గొండ జిల్లా పిల్లలమర్రిలో పుట్టాడని అంటారు. ఆ చర్చ ఇక్కడెందుకులెండి. “వాణి నా రాణి” అన్నవాడు పినవీరభద్రుడు. ఆ పినవీరభద్రుడు ఈ పిల్లలమర్రిని చూసి ఉంటే ఈ పిల్లలమర్రి మీదే మహాకావ్యం ఒకటి రాసి ఊడల చేతుల్లో పెట్టి ఉండేవాడేమో!

దాదాపు వెయ్యేళ్లుగా ఊడలు దిగి తనకు తానే ఒక చరిత్ర అయిన ఈ పిల్లలమర్రి ప్రస్తావన ప్రాచీన కావ్యాల్లో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఉండదు. అంతే.

నాలుగెకరాల్లో నిలుచున్న ఒకానొక చెట్టును చూడ్డానికి అంత దూరం వెళ్లాలా అని నిట్టూర్చేవారికి…చెట్టులేకుంటే గట్టిగా నిట్టూర్చడానికి కూడా మన ఊపిరితిత్తుల్లో గాలి మిగిలి ఉండదు అన్నదొక్కటే పిల్లలమర్రి ఇచ్చే పెద్ద సందేశం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

చెట్టుకింద చదువులే మేలు

Also Read :

వినగ వినగ వేప

RELATED ARTICLES

Most Popular

న్యూస్