పినరయి విజయన్ వరుసగా రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే గత మంత్రివర్గంలో పనిచేసిన ఎవరికీ ఈ దఫా చోటు దక్కలేదు. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు రేపు పదవీ ప్రమాణం చేస్తారు. గత మంత్రివర్గంలో ఆరోగ్య శాఖా మంత్రిగా కోవిడ్ సమయంలో తన పనితీరుతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన కేకే శైలజ కు కూడా బెర్త్ దొరకలేదు. అయితే తన అల్లుడు పిఏ మహ్మద్ ను మంత్రివర్గంలోకి విజయన్ తీసుకున్నారు.
గత మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు ఉండగా ఇప్పుడు ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కే. విజయ రాఘవన్ సతీమణి డా. బిందు ఉన్నారు.
20 మంది మంత్రులలో 12మంది సిపిఎంకు, నలుగురు సిపిఐ కి చెందినవారు మిగిలిన నాలుగు పదవులు మిత్రపక్షాలకు కేటాయించారు. ఎంబి రాజేష్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. డిప్యూటి స్పీకర్ గా చిట్టాయం గోపకుమార్ పేరు ఖరారైంది. మంత్రివర్గంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మంచి పనితీరు కనబరిచిన వారిని కూడా పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.