నైరోబీలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన ఆటగాళ్లకు అయన అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో మన ఆటగాళ్ళు చూపిన ప్రతిభ రాబోయే కాలంలో మనం సాధించబోయే విజయాలకు గొప్ప ముందడుగు గా అయన అభివర్ణించారు. కొంత కాలంగా అథ్లెట్లు, క్రీడాకారులపై ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుతుగున్నాయని అయన కితాబిచ్చారు. కఠోర శ్రమతో మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న అథ్లెట్లకు అయన శుభాకాంక్షలు అందించారు.
నిన్న జరిగిన పోటీల్లో భారత క్రీడాకారిణి శైలి సింగ్ లాంగ్ జంప్ లో రజత పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. త్రుటిలో ఆమె స్వర్ణాన్ని కోల్పోయారు. ఈ పోటీల్లో మన క్రీడాకారులు మొత్తం మూడు పతకాలు సాధించారు. అమిత్ ఖాత్రి 10 వేల మీటర్ల రేస్ వాకింగ్ విభాగంలో రజ పతకం, 400X4 రిలే పరుగు పందెంలో కాంస్య పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ పోటీల్లో తొలిసారి ఒకటి కంటే ఎక్కువ పతకాలు తెచ్చుకొన్న రికార్డు కూడా సొంతం చేసుకుంది, గతంలో జరిగిన పోటీల్లో ఒకే పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మన దేశానికి చెందిన సీమా- డిస్కస్ త్రో- కాంస్యం (2002); నవదీప్ కుమార్ – డిస్కస్ త్రో- కాంస్యం (2014); నీరజ్ చోప్రా – జావెలిన్ త్రో- స్వర్ణం (2016); హిమా దాస్ – 400 మీటర్ల పరుగు పందెం – స్వర్ణం (2018)లు పతకాలు సాధించారు. ఈ ఏడాది మాత్రం మూడు పతకాలు సాధించారు.