ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పార్లమెంట్ వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పునర్విభజన తీరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ ఈ విధంగా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేసే సమయంలో తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ పార్టీ నుంచి ఎంపికైన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయీ హయంలోనూ 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ మూడు రాష్ట్రాలు ఏర్పాటు పార్లమెంట్ లో అందరూ కలిసి కూర్చొని, చర్చించి.. ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఆమోదించారని మోదీ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేసే క్రమంలో అలాంటి చర్చకు తావు లేకుండా ఒంటెద్దు పోకడలా విభజన బిల్లు ఆమోదించడం జరింగదన్నారు.
ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో మైకులు ఆపేసిందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కొందరు పెప్పర్ స్ప్రే కొట్టారని.. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారని మోదీ స్పష్టం చేశారు. ఏపీ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఇప్పటికీ అనేక నష్టాలను ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు.