అమెరికాలో పోలియో కేసు కలకలం

అమెరికాలో సుమారు దశాబ్ద కాలం తర్వాత గురువారం తొలిసారిగా పోలియో కేసు రిపోర్ట్ అయింది. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్‌లాండ్ కౌంటీలో ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని తేలిందని న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చివరిసారిగా అమెరికాలో 2013లో పోలియో కేసు కనిపించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన పోలియో వైరస్ కేసు.. ఓరల్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ద్వారా ఈ పౌరుడికి వైరస్ సోకినట్టుగా సంకేతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కానీ, అమెరికాలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2000 సంవత్సరంలోనే బంద్ చేశారు.

అంటే.. అమెరికా పౌరుడికి ఈ వైరస్ దేశం వెలుపల నుంచి సోకి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రాంతంలో మరిన్ని టెస్టులు చేయాలని, అలాగే, ఆ ప్రాంతం ప్రజలు ఒక వేళ టీకా వేసుకుని ఉండకపోవేతే.. వెంటనే వేసుకోవాలని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.

పోలియో రక్కసిని ప్రపంచంలో నుంచి తరిమేయడానికి ప్రపంచ దేశాలు ఏకం అయ్యాయి. 1988లో ఈ కేసులు భారీగా నమోదయ్యాయి. 125 దేశాలు పోలియోతో తల్లడిల్లాయి. కానీ, ప్రపంచ దేశాలు అన్ని సంయుక్తంగా చర్యలు తీసుకోవడం మూలంగా 1988 నుంచి పోలిస్తే.. ఇప్పుడు 99 శాతం కేసులు తగ్గిపోయాయి. అమెరికాలోనైతే 1950ల్లోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. 60లలో దీనికి టీకా తయారు చేశారు. అప్పుడు నాచురల్‌గా సోకిన పోలియో కేసు అమెరికాలో చివరిసారి 1979లో నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *