Saturday, November 23, 2024
HomeTrending Newsకులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు: కేసీఆర్‌

కులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు: కేసీఆర్‌

 Politics Castes : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ నగరంలోని మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘గతంలో ఏం జరిగిందో.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొందరు మతం మీద, కొందరు కులంపేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఆ క్యాన్సర్‌ మనకు పట్టుకుంటే చాలా ప్రమాదమే.. ‘దేశం అన్ని మతాలను, అన్ని కులాలను సమాంతరంగా ఆదరించే గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుకాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్‌ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈ రోజు అనేక విషయాలు ఇవాళ పేపర్లలో చూస్తున్నరు. పలానా వాళ్ల షాపులో పువ్వులు కొనద్దు.. పలానా వారి షాపులో ఇది కొనద్దు.. అది కొనద్దని చెబుతున్నరు దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. మన భారతీయులు 13కోట్ల మంది విదేశాల్లో పని చేస్తున్నరు. ఒక వేళ వారందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లందరికీ ఉద్యోగాలు ఎవరివ్వాలి. ఎవరు సాదాలి? అని ప్రశ్నించారు.

ఫార్మాసిటీని తేబోతున్నాం..
‘హైదరాబాద్‌లో దాదాపు రూ.2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం ఏడేళ్లలో. సుమారు 10, 15 లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికినయ్‌. రేపు హైదరాబాద్‌ సిటీలో 14వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మాసిటీ తేబోతున్నాం. జీనోమ్‌వ్యాలీలో తయారవుతున్న వ్యాక్సిన్లతో ప్రపంచానికే రాజధానిగా ఉన్నాం. ప్రపంచంలోని 33శాతం టీకాలు తయారీ కేంద్రం హైదరాబాద్‌.

దేశ విదేశాలకు చెందిన వారంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు పోతే విమానం దిగినా.. రైలు దిగినా.. బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటది. బాగుంటది.. ఇక్కడ రకరకాల భోజనం దొరుకుతుందని.. అన్ని భాషలు మాట్లాడే వాళ్లుంటరు.. అందరు కలిసిబతుకుతున్నరంటే ఎవరైనా వస్తురు కానీ.. కత్తులు పట్టుకుంటరు.. తుపాకులు పట్టుకుంటరు.. 144 సెక్షన్‌ ఉంటదని, కర్ఫ్యూ ఉంటదని, తన్నుకుంటరంటే ఎవరైనా వస్తారా?’ అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

కొట్లాటలు.. 144 సెక్షన్‌లుంటే పెట్టుబడులు వస్తాయా?
‘సామరస్యం, శాంతి ఉంటే, లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటే, మన పోలీసుశాఖ బాగా పని చేస్తే వెల్లువలా పెట్టుబడులు వస్తయ్‌. పరిశ్రమలు తరలివస్తయ్‌.. జీవనం దొరుకుతది, ఉద్యోగాలు, ఉపాది దొరుకుతయ్‌. పొద్దున లేస్తే కులం పేరుమీదనో, మతం పేరు మీదనో కొట్లాటలు, కొట్లాటలుంటే, ఫైరింగ్‌లుంటే ఎవరూ రారు. అని మన కాళ్లు మనం నరుక్కున్నట్లుంటది. తెలంగాణ బిడ్డగా.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి అటువంటి క్యాన్సర్‌ను మన వద్ద తెచ్చుకోవద్దు. చాలా అప్రమత్తంగా ఉండాలి. తాత్కాలికంగా గమ్మతి అనిపిస్తది, అప్పటికప్పుడు మజా అనిపిస్తది.
కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటయ్‌. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సంకుచిత ధోరణలకు తెలంగాణ ఆస్కారం ఇవ్వొద్దు. మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లు ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా ఉన్నాయ్‌. వాటన్నింటిని అదిగమించి రాష్ట్ర తలసరి ఆదాయంలో దాటిపోయాం. సంపద సృష్టిస్తూ పేదలకు పంచుతున్నాం. ఇవాళ రూ.2016 పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇవ్వరు. ప్రధానమంత్రి గుజరాత్‌ రాష్ట్రంలో రూ.500, రూ.600 ఇస్తున్నరు. దివ్యాంగులకు రూ.3016 ఎక్కడా ఇవ్వడం లేదు. ఆడపిల్లల పెండ్లి జరిగితే రూ.1,00,116 ఇచ్చే సంప్రదాయం తెలంగాణలో తప్పా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు’ అని స్పష్టం చేశారు.

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో రోడ్లపైకి రైతులు..
‘ఏడేళ్ల కిందట ఎటువంటి కరెంటు గోసలుండెనో తెలుసు. ఇవాళ మన వద్ద కరెంటు పోతే వార్త.. ఇండియాలో కరెంటు ఉంటే వార్త.. ఇది వాస్తవం. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఏడేళ్ల కిందట పుట్టిన తెలంగాణలో రాత్రింభవళ్లు కష్టం చేసి తిప్పలు పడితే.. ఈ రోజు బ్రహ్మాండంగా 24 గంటలు కరెంటు అన్నిరంగాలకు ఇచ్చుకుంటున్నాం. ఎండకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల చావుకొచ్చేది. భయంకరమైన పరిస్థితులు. ఏ మూలకు పోయినా బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేవి. ఇవాళ తెలంగాణ బిందెల ప్రదర్శన రద్దయ్యింది. మిషన్‌ భగీరథ పుణ్యమాని బ్రహ్మాండంగా మంచినీళ్ల కొరత తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు పథకాలు చేసుకొని సాగునీరులో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. ధ్యానం పండించడంలో నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదుగుతున్నాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇకపై విద్యా, వైద్యంపై దృష్టి
‘ప్రభుత్వం ఇకపై వైద్యం, విద్యపై దృష్టి సారిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని గురుకుల పాఠశాలలు పెరగాలి. 33 మెడికల్‌ కాలేజీలు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వరంగంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడికక్కడే విద్య, వైద్యసేవలు పేదల ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ చేయగలిగినామంటే, మహా మహా రాష్ట్రాలను దాటి ముందుకు పోగలుగుతున్నమంటే.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి కరెంటు ఇస్తున్నామంటే మీరిస్తున్న మద్దతు. మీరిచ్చే దీవెన, మీరిచ్చే ఆశీస్సులు.. బలమే. మీ దీవెన ఇదే విధంగా కొనసాగాలే. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలే.. ఇంకా ముందుకెళ్లాలే.. దేశానికే తలమానికంగా ఉండేలా రాష్ట్రం తయారు కావాలి. దాని కోసం ఎంత ధైర్యంగానైనా ముందుకుపోతాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఈ దుష్ట శక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Also Read : యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్