Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనై పూచేగ ఇండియా

నై పూచేగ ఇండియా

Poochhega India Batayegi Urja

హైదరాబాద్- విజయవాడల మధ్య నిరంతరాయంగా తిరుగుతూ ఉండడం నా అవసరం. మొన్న ఒక రోజు దేవతల రాజధానిని తలదన్నే అమరావతి రాజధాని బురద రోడ్లలో మిట్ట మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. దేవతలు అమృతం తాగి ఉంటారు కాబట్టి…అన్నం తినరు. అమరావతి రాజధాని రాచవీధుల్లో కూడా అన్నం మెతుకులు దొరకవు. అతి కష్టం మీద ఒక ప్రభుత్వ క్యాంటీన్ లో రెండు పెరుగన్నం పొట్లాలను మా డ్రైవర్ కొనగలిగాడు. జాతీయ రహదారి పక్కన ఆపి- అధ్వ- దారి; అన్నం- ముద్ద అయిన ఆ అధ్వాన్నాన్ని తిని, కారులో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య కీర్తనలు వింటున్నాను.

డీజిల్ కొట్టించాలి అని డ్రైవర్ ఒక పెట్రోల్ బంకులోకి తిప్పాడు. నిజానికి పెట్రోల్, డీజిల్ పోయించాలి అనాలి. పెట్రోల్, డీజిల్ షాక్ కొడుతూనే ఉంటాయి కాబట్టి…”కొట్టించడం” మాటే సరయినది అని అర్థం తెలిసే ఈ మాటను ట్రూ స్పిరిట్ లోనే లోకం గ్రహించినట్లుంది.

డీజిల్ కొడుతున్నంత సేపు అక్కడ ఆకాశంలో సూర్యుడికంటే వెలుగుతున్న అక్షరాలతో పెద్ద బోర్డు కళ్లు మూసుకున్నా కనిపిస్తోంది. అంతే. నా కళ్లు నావి కాకుండా పోయిన అనుభూతి కలిగింది. ఏది కనిపించినా చదవాలని అనుకునే నా బలహీనత ఎంత బలహీనమయినదో తెలిసిన క్షణమది. కళ్లు, మెదడు, తెలిసిన తెలుగునంతా కూడదీసుకుని కలిపి ఎన్ని సార్లు చదవడానికి ప్రయత్నించినా…అర కొర చదువుకున్న నా అక్షర జ్ఞానం ఎందుకూ కొరగాకుండా పోయిన క్షణమది.

ట్యాంక్ ఫుల్ కొట్టించమన్నాను. నేనిచ్చిన బోడి మూడు వేలకు ట్యాంక్ నిండదు అని వెకిలిగా నవ్వుతూ పెట్రోల్ బంక్ అబ్బాయి జ్ఞానోదయం కలిగించాడు. ఇదివరకు మూడు వేలకు ట్యాంక్ నిండేది కదా? అని మా డ్రైవర్ ను అడిగాను. అది పోయిన సంవత్సరం. ఇప్పుడు ఎన్ని వేలు పోసినా ఇంకా ట్యాంక్ లో శూన్యం మిగిలే ఉంటుందని మా డ్రైవర్ ఆ శూన్య జ్ఞానాన్ని కొనసాగించాడు. ఫుల్ ట్యాంక్ కొట్టించుకోగలిగే ఆర్థిక స్థోమత అందరికీ ఉండదు అని ట్యాంక్ శూన్యాన్ని అర్థం చేసుకుని, హోర్డింగ్ ముందుకు వెళ్లి నా చదవలేని నిస్సహాయత మీకు తెలియజెప్పడానికి ఒక ఫోటో కూడా తీసుకుని బరువెక్కిన గుండెతో భాగ్యనగరం వైపు బయలుదేరా.

“పూచేగ ఇండియా
బతాయేగి ఊర్జ”

అని గుమ్మడికాయంత అక్షరాల్లో ఉంది.
13 భాషల్లో మీకు కావాల్సిన సేవలపై సమాచారం పొందండి అని కింద తాటికాయంత అక్షరాల్లో ఉంది.

మొదట ఇది తెలుగులో భావ కవిత అనుకున్నా.
పూచిన పువ్వు ఇండియా అని ఏదో కవితాత్మక అర్థం అనుకున్నా. పూచెగా…పూచెనుగాఇండియా…అని ఇండియా పూచింది అని రాయబోయి…అక్షర దోషం దొర్లి ఉంటుంది అనుకున్నా. తరువాత కింది లైన్ బతాయేగి చదివే సరికి బాట ప్లస్ ఏగి…అంటే దారిలో పోయేవారికి సేవలందించే సమాచారం కోసం పెట్టిన హోర్డింగ్ అనుకున్నా.

మనసు పరి పరి విధాలా కీడు శంకించింది. ఈలోపు అక్కడే పనిచేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగా. మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? అని చక్కటి, స్పష్టమయిన సమాధానం చెప్పారు. పైగా అది చదివి అర్థం చేసుకోగలిగేంత సీనే ఉంటే ఇలా రోడ్డు మీద పెట్రోల్-డీజిల్ మురికిలో ఎందుకు బతుకుతాం? అని చదువులలోని మర్మమెల్లా విప్పి చెప్పిన అపర ప్రహ్లాదుల్లా తాత్వికంగా నా తల తిరిగేలా సమాధానం చెప్పారు.

ఈమధ్య తెలుగును ఇంగ్లీషు లిపిలో రాయడం ఫ్యాషన్. ట్రెండ్. “మీ చావు మీరే చావండి”
అని తెలుగు భాష చావు ఇంగ్లీషు లిపిలో-
“Mee Chavu mere chavandi”
అని రాస్తేనే మనం ఆధునికులం. కాలానికి అనుగుణంగా ఉన్నట్లు. ఆ కోణంలో హిందీ భాషను అత్యంత అందమైన తెలుగు లిపిలో రాసిన ఈ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పాద ధూళిని మనం నెత్తిన చల్లుకోవాల్సిందే!

ఇరవై ఇంటూ నలభై అడుగుల ఈ పెద్ద హోర్డింగ్ ను చదివి 24 గంటలూ అందుబాటులో ఉండే ఆ ఫోన్ నంబర్ కు కాల్ చేసి పూచితే- అడిగితే…ఊర్జ – శక్తి తనకు తానుగా బతాయేగి- చెప్తుందని దీని అర్థం.

గంట గంటకు పెరిగే పెట్రోల్- డీజిల్ గురించి పూచవచ్చో? పూచకూడదో? తెలియక పూచలేకపోయాను. ఒకవేళ పూచినా బతాతుందో? నై బతాయేగి…పో! అంటుందో అన్న భయంతో పూచలేకపోయాను. పూచడానికి ఉండాల్సిన ఊర్జ లేనివాళ్లం. సతాయించి బతావో! అని అడిగే ఊర్జ లేనివాళ్లం.

ఈ దారిన పోయేవారు ఎవరయినా ఇది చదివి అర్థమై, ఆ నంబర్ ను పూచి, బతాయించుకుని, బతికి, బట్టకట్టుకుని ఉంటే…వారి ఊర్జకు శతకోటి దండాలు.

ఇది ఉద్దేశపూర్వక అర్థం కాని ఊర్జాక్షరాల పెట్రో వ్యూహం అయి ఉంటే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ను బచాయించలేడు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

Also Read:పెట్రోల్ సెంచరీ కొట్టింది

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్