Tuesday, December 3, 2024
HomeTrending Newsఐఏఎస్ పూజ ఖేడ్కర్ కు బిగుస్తున్న ఉచ్చు

ఐఏఎస్ పూజ ఖేడ్కర్ కు బిగుస్తున్న ఉచ్చు

మహారాష్ట్రలోని పూణేలో శిక్షణా సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న IAS అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, విఐపి నంబరు, ప్రభుత్వ స్టిక్కర్ వేసుకోవటం వివాదానికి దారితీసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఆమె బాగోతం ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి.

2023 బ్యాచ్‌కు చెందిన పూజ సివిల్స్ పరీక్షలో 841 ర్యాంక్‌ సాధించారు. ఆమె ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌ కోటాలో ఐఏఎస్ కు ఎంపికైనట్టు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలు పేర్కొన్నట్టు… శిక్షణకు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి అకాడమీలో చేరాక సమర్పించిన ఆస్తుల ధ్రువీకరణ పత్రంలో 22 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారని సమాచారం.

ఓబీసీ సర్టిఫికెట్‌, ఆస్తుల ధ్రువీకరణలో పూజ పేర్కొన్న వివరాల్లో పొంతన లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అహ్మద్ నగర్ నుంచి పోటీ చేసిన పూజ తండ్రి దిలీప్‌ కొండిబా ఖేడ్కర్ అఫిడవిట్‌లో 53 కోట్ల విలువైన ఆస్తులు చూపించారు.

అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటా ఆమె దుర్వినియోగం చేశారని RTI కార్యకర్త విజయ్ కుమార్ ఫిర్యాదుతో మరిన్ని వెలుగు చూస్తున్నాయి. నేత్ర సంబంధిత సమస్యలు ఉన్నట్టు చెప్పినా.. ఢిల్లీ ఏయిమ్స్ లో పరీక్షలకు హాజరు కాకుండా కుంటి సాకులు చెప్పారని, చివరకు తూతూ మంత్రంగా ముగించారని ఆరోపణలున్నాయి.

దీంతో కేంద్రం విచారణకు కమిటీని నియమించగా.. రెండు వారాల్లో నివేదిక రానుంది. పూజ తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్ కు ఎంపికైనట్టు రుజువైతే… సర్వీసు నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

పూజా త‌ల్లి మ‌నోరమ‌ ఖేడ్కర్ పై పుణె పోలీసులు కేసు న‌మోదు చేశారు. రైతుల‌ను పిస్తోల్‌తో బెదిరించిన ఘ‌ట‌న‌లో మ‌నోర‌మ‌పై కేసు బుక్కైంది. మ‌నోర‌మతో పాటు ఆమె భ‌ర్త దిలీప్ ఖేడ్కర్, మ‌రో ఐదుగురిపై శుక్ర‌వారం రాత్రి పౌడ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.

కొంత మంది రైతుల్ని గ‌న్‌తో బెద‌రిస్తున్న‌ట్లు మ‌నోర‌మ ఖేడ్కర్ కు చెందిన వీడియో వైర‌ల్ అయింది. ఆ వీడియో ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేద్క‌ర్ ప్ర‌భుత్వ ఆఫీస‌ర్‌గా చేశారు. పుణె త‌హిసిల్‌లోని ధాడ్‌వాలీ గ్రామంలో భూమిని కొనుగోలు చేశారు. ప‌క్క‌న భూమిని కూడా ఆ కుటుంబం క‌బ్జా చేసింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు.

పూజా త‌న స్వంత ఆడీ కారుకు బీక‌న్ పెట్టుకుని తిరుగుతోంది. అనేక సార్లు ఆమె సిగ్న‌ల్ జంప్ చేసింది. పుణె ట్రాఫిక్ పోలీసులు ఆమెకు 27 వేల జ‌రిమానా వేశారు.

ఆమెకు వచ్చిన ర్యాంక్ పై కూడా విమర్శలొస్తున్నాయి. ఇటీవల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లాకు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ రావటంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూజ వ్యవహారంతో UPSC పరీక్షల తీరుతెన్నులపై అనుమానాలు వ్యక్తం ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్