Friday, November 22, 2024
HomeTrending Newsనీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా - NTA డైరెక్టర్ కు ఉద్వాసన

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా – NTA డైరెక్టర్ కు ఉద్వాసన

ఎన్డియే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గడ్డుకాలం మొదలైంది. పార్లమెంటు కొలువు దీరెందుకు మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. యుజి పేపర్ లీకేజీ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్షను వాయిదా వేసిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను కేంద్రం శనివారం రాత్రి తొలగించింది. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగుతారు.

ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ యూజీ, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట మసకబారింది.  నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి.

నీట్ యుజి, నెట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండేవాడని, లో ప్రొఫైల్ లో కొనసాగేవాడని సమాచారం. ఉత్తరప్రదేశ్ కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్.. ఐఐటీ రూర్కేలాలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గతేడాది జూన్ లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అదనపు సెక్రటరీగా పని చేశారు. ఛత్తీస్ గఢ్ సెక్రటేరియట్ లో 2009-2019 మధ్య పలు హోదాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి.

నీట్ యుజి ప్రవేశ పరీక్ష మీద దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. నీట్ లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం పడింది. ప్రధాని నరేంద్ర మోడీ పారదర్శక పాలన ఇదేనా అని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. పేపర్ లీకేజీ అంశం రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి తలనొప్పిగా మరే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్