Pure Traditional: ఉక్కళం రామ్మోహన్ వృత్తి రీత్యా పోలీసు ఉన్నతాధికారి. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యమున్న ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులకు దూరపు బంధువు. సంగీత-సాహిత్యాభిలాషి. తెలుగు భాషాభిమాని అయిన పోలీసు ఉన్నతాధికారి మస్తిపురం రమేష్ ద్వారా రామ్మోహన్ నాకు పరిచయమయ్యారు. కొన్ని అభిరుచులు కలవడంతో కొన్నేళ్లుగా మా స్నేహం తీగ సాగుతూనే ఉంది.
లోకంలో ఎందరో భాషాభిమానులు ఉంటారు. ఎవరికి తోచినట్లు వారు మాతృ భాష పరిరక్షణకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కూతురి పెళ్లిలో బమ్మెర పోతన తెలుగు పద్యాలను వినిపించిన సాహితీ మిత్రుడు ఉక్కళం రామ్మోహన్ గురించి నాలుగు మాటలు రాయకపోతే బాగోదు.
ఆదివారం పొద్దున్నే మిత్రుడు మస్తిపురం రమేష్- నేను శంషాబాద్ పెళ్లి మంటపానికి వెళ్ళాము. ఆదివారమంతా పెళ్లి- పేరంటాల్లో అటెండెన్స్ వేయించుకోవాలి కాబట్టి…రామ్మోహన్ గారి అమ్మాయి పెళ్లిలో ఓ పది నిముషాలు ఉండి…జారుకుందామనుకున్నాం.
వైష్ణవ సంప్రదాయ వివాహం ఎప్పుడూ చూడలేదంటూ రమేష్ ఉత్సాహంగా వేదిక మీద కొంతసేపు సెటిలైపోయారు. బెంగళూరు నుండి వంటవాళ్ళను ప్రత్యేకంగా పిలిపించాను. భోంచేసి వెళ్ళాలి అంటూ రామ్మోహన్ గారు రిటైరైన ఒక హిందూపురం పోలీసు అధికారిని మాకు కాపలాగా పెట్టారు. ఇక చేసేదేముంది? అని కూర్చున్నాం.
ఈలోపు- మైకులో అనౌన్స్ మెంట్. చెప్పులు, బూట్లతో ఎవరూ వేదిక మీదికి రావద్దు. మాంగల్య ధారణ తరువాత ఒక హోమం పూర్తి చేసి…నవ దంపతులు మీ దగ్గరికే వస్తారు. ఆశీర్వదించండి. బఫె లేదు. అందరూ హాయిగా కూర్చుని భోంచేసి వెళ్ళండి- అని. ఒక్కరూ వేదిక మీదికి వెళ్లలేదు.
పెళ్లి మంటపంలో ఒక పక్కన డోలు- సన్నాయి. వారి పక్కన సంగీత కచేరి. పురోహితులు చెప్పినప్పుడే మేళతాళాలు. మిగతా సమయమంతా అన్నమయ్య, రామదాసు కీర్తనలు పాడుతున్నారు. తాళి కట్టగానే తెలుగువారికి పిడికిట తలంబ్రాలు పోయడానికి, పాడడానికి అన్నమయ్య పదాల కంటే గొప్పవి ఉండవు కదా! ఆ పదాల తలంబ్రాలనే వీనుల విందుగా పోశారు.
వెంటనే పోతన భాగవతం తెలుగు పద్యాలను రాగయుక్తంగా పాడడం మొదలు పెట్టారు. గజేంద్ర మోక్షణం పద్యాలు పెళ్లి మంటపంలో పాడడం నేనింతవరకు ఎక్కడా చూడలేదు. అరిటాకుల్లో తీయని, కమ్మని పదార్థాలు. నోరూరిస్తుంటే…వీనుల విందయిన పోతన పద్యాలు వింటూ జనం మైమరచి భోజనం చేయడం నాకు కనువిందు అయ్యింది.
పెళ్లికొచ్చిన పెద్దలు భోంచేసి వెళ్లేప్పుడు రామ్మోహన్ గారు ఒక్కొక్కరికి భుజాన శాలువా కప్పి, చేతిలో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ పెట్టి, నమస్కారం పెట్టి కృతఙ్ఞతలు చెప్పారు. అంత బిజీలో పెళ్లి మంటపం మీద తన కూతుళ్లను నాకు పరిచయం చేస్తూ…తెలుగు- సంస్కృతంలో నాకు ఏ డౌట్ వచ్చినా మధూను అడుగుతూ ఉంటాను అంటూ భాషా చర్చలోకి దిగారు.
“కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల కప్పిగొనగ…” అని యుద్ధ భూమిలో తన మీదికి దూసుకొస్తున్న కృష్ణుడిని పొగిడిన భీష్ముడి(పోతన) పద్యం పాడించిన పందిట్లోకి కృష్ణుడిని పోతనే పోత పోసి తీసుకు వచ్చి ఉంటాడు. ఆ పోతన భాగవత కృప నవ దంపతులకు హృద్యమయిన తెలుగు పద్యం యతి మైత్రిగా, కుదిరిన ప్రాసగా, ఛందస్సు తూగుగా, పదంలో పదంగా, వాగర్థాలుగా అక్షతలు చల్లి ఆశీర్వదించి ఉంటుంది.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]