Friday, March 29, 2024
HomeTrending Newsఝూటా మాటల కెసిఆర్ - బిజెపి ధ్వజం

ఝూటా మాటల కెసిఆర్ – బిజెపి ధ్వజం

‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి… ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు, వయసు దాటిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల బాధలు…వెట్టి చాకిరి చేస్తున్నా జీతాలు రావడం లేదని కార్మికుల కష్టాలు’’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో 5వ రోజు దర్శనమిచ్చిన ద్రుశ్యాలివే…
చేవెళ్ల నియోజకవర్గంలోని కనకమామిడి సర్కిల్ నుంచి ప్రారంభమైన 5వ రోజు పాదయాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాపూర్ చేరుకుంది. దారిపొడవునా పూర్తిగా ప్రజలను కలిసేందుకే మొగ్గు చూపిన బండి సంజయ్ రైతులు, కూలీలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు…ఇలా అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను ఓపిగ్గా విన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. టీఆర్ఎస్ హయాంలో తమకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని దారిపొడవునా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత కనకమామిడి చౌరస్తా నుండి మొదలైన పాదయాత్ర అప్పిరెడ్డి గూడ, తోల్కట్ట, ముడిమ్యాల, పల్గుట్ట, కందాడ స్టేజ్ మీదుగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు మల్కాపూర్ చేరుకుంది.

కేసీఆర్ వన్నీ ఝూటా మాటలే
కనకమామిడి శివారులో ఫార్మ్ హౌస్ లో పని చేస్తున్న కూలి దంపతులను కలిసిన సంజయ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని వారు మొరపెట్టుకున్నారు. అదే సమయంలో రోడ్ పై ఆగిన లారీ డ్రైవర్లతో సంజయ్ మాట్లాడారు. దారిలో తోల్కట్ట సమీపంలోని గులాబీ పూల తోటలోకి వెళ్లిన బండి సంజయ్ రైతులతో కలిసి కలుపు మొక్కలు తీశారు. ఈ సందర్బంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘ మేం కూరగాయలు, పూలు పండిస్తున్నం. కానీ ఏం లాభం. గిట్టుబాటు ధర రావట్లేదు. సంచి వంకాయలను రూ.70, బాక్స్ టమాటాలను రూ.100 అమ్ముకోవాల్సి వస్తోంది’’వాపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కెసిఆర్ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిండు. ముఖ్యంగా రైతు పండించే పంట రైతు ఇంటి వద్దనే అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని హామీలు ఇచ్చిండు. ఇప్పుడు అవన్నీ గాలికొదిలేసిండు. వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడీ లు కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ వన్నీ ఝూటా మాటలే. చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు’’అని అన్నారు. రైతులపక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు.


వెట్టిచాకిరి చేస్తున్నా 3 నెలల నుండి జీతాల్లేవ్
అప్పిరెడ్డిగూడలో బండి సంజయ్ ను నరసింహతోపాటు పలువురు పారిశుధ్య కార్మికులు కలిసి గ్రామ పంచాయితీలో చెత్తను తీస్తూ రాత్రింబవళ్లు వెట్టిచాకిరి చేస్తున్నా 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. రెక్కాడితే డొక్కాడని తాము 3 నెలలుగా జీతాల్లేకుంటే బతికేదెలా? అని వాపోయారు. కేసీఆర్ కు ఓటేసిన పాపానికి తమ బతుకులు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవేందర్ అనే ప్రైవేటు టీచర్ బండి సంజయ్ ను కలిసి తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలూ అందలేదని, డబుల్ బెడ్రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదని వాపోయారు. బోధన్ నుంచి రేషన్ డీలర్ల సంఘం నాయకులు వచ్చి బండి సంజయ్ ని కలిసి రేషన్ డీలర్లు పరిష్కరానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. వారికి అండగా ఉంటానని భరోసానిచ్చిన సంజయ్ అక్కడి నుండిగ తోల్కట్ట గ్రామంలోకి ప్రవేశించారు.
పూలవర్షంతో అభిమానం చాటుకున్న ముడిమ్యాల గ్రామస్తులు
తోల్కట్ట గ్రామానికి చెందిన వందలాది యువకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం చేవెళ్ల మండలం లోకి ప్రవేశించిన బండి సంజయ్ మడిమ్యాల గ్రామం వద్దకు చేరుకోగానే గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల వర్షంతో స్వాగతం పలికారు. కార్యకర్తలు కొత్తగా నిర్మించిన గద్దెపై బండి సంజయ్ బీజేపీ జెండా ఎగరేశారు. అనంతరం మడిమ్యాల గ్రామానికి చెందిన 150 మంది యువకులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

నిరుద్యోగులకు అండగా ఉంటా….సర్కార్ మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయిస్తా
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ని పలువురు నిరుద్యోగులు కలిసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని మొరపెట్టుకున్నారు. ‘‘అధికారంలోకి వచ్చే ముందు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన నిరుద్యోగులు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల కోసం బలిదానాలు చేయాల్సిందేనా? మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి. బీజేపీకి అండగా మేముంటాం’’అని నిరుద్యోగులు కోరారు. వారికి భరోసా ఇచ్చిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచైనా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడేలా పోరాడతామని పేర్కొన్నారు.

బైక్ ఓవర్ స్పీడ్…అదుపు తప్పిన బస్సు
బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ముడిమ్యాల గ్రామ సమీపంలో ఓ వాహనదారుడు బైక్ పై ఓవర్ స్పీడ్ తో రావడంతో బస్సును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. సంఘటన స్థలానికి బండి సంజయ్ కుమార్ బస్ డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడారు. బస్సు లోని ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించిన పోలీసులు బీజేపీ కార్యకర్తల సాయంతో బస్సును తిరిగి రోడ్డు పైకీ తీసుకొచ్చారు. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, వాహనదారులు ఓవర్ స్పీడ్ తో వెళ్ళి ప్రమాదాలకు కారకులు కావొద్దని కోరారు.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు…
బండి సంజయ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, ఎస్సీ, కిసాన్, యువ, మహిళా మోర్చా అధ్యక్షులు కొప్పు బాషా, శ్రీధర్ రెడ్డి, భాను ప్రకాశ్, గీతామూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, జిల్లా నేతలు కంజర్ల ప్రకాశ్, అంజన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్