Sunday, January 19, 2025
HomeTrending Newsవెలిగొండ పూర్తి చేయండి: ఎమ్మెల్యేల లేఖ

వెలిగొండ పూర్తి చేయండి: ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించడానికి రేపు గురువారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో జిల్లాకు చెందిన సమస్యలు ప్రస్తావిస్తూ అద్దంకి,  కొండపి, పర్చూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు.

కేంద్రం ప్రకటించిన గెజిట్‌లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా వెలిగొండను చేర్చకపోవడం వలన పశ్చిమ ప్రాంత రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకొని అనుమతి పొందిన ప్రాజెక్టుగా పొందుపరిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

2021 నాటికి వెలిగొండ నుంచి నీళ్లు ఇస్తామన్న గతంలో మీరు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని సిఎంకు వారు గుర్తు చేశారు. నిర్లక్ష్యం వీడి వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నాగార్జున సాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా, వృథాగా సముద్రంలోకి పోతున్నా, నీటి సరఫరా షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని వారు విమర్శించారు.  పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల కల అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన రూ. 274 కోట్ల పథకాన్ని రద్దు చేయటం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, పూర్తిచేయాలని, రాళ్లపాడు ప్రాజెక్టును ఆధునీకరించి ఆయకట్టు పెంచాలని వారి లేఖలో ముఖ్యమత్రిని కోరారు.

లక్షలాది ఎకరాల్లో సాగుచేస్తున్న సుబాబుల్, జామాయిల్ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డారని, మీ పాదయాత్ర సమయంలో టన్నుకు రూ. 5,000/- ఇస్తామనన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో కూడా మీ ప్రభుత్వ వైఖరిలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సాగు భారమైందని లేఖలో పేర్కొన్నారు.  వరి, మొక్కజొన్న, కంది, శనగ పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక,  ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక రైతులు కనీరు పెతుడున్నారని, కనీసం బకాయిలు కూడా వెంటనే చెల్లించకపోవడం బాధాకరమని వారు సిఎంకు వివరించారు.

ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, అంబేద్కర్ విదేశీ విద్య పథకం రద్దు, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, నీటి మోటార్లకు మీటర్లు, విద్యుత్ చార్జీల మోత, ఇసుక కొరత, టిడ్కో ఇళ్ళు,  గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందులు, పెన్షన్, అభివృద్ధి పై నిర్లక్ష్యం లాంటి సమస్యలను వారు లేఖలో ప్రస్తావించారు.  వీటితోపాటు జిల్లా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ పర్యటనలో సిఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్