Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅల్లిపూల వెన్నెల

అల్లిపూల వెన్నెల

Allipoola Vennela – Bathukamma song

అనాదిగా ఎందరికో ఆమోదయోగ్యమైన వాటినే మనం సంస్కృతీ, సంప్రదాయాలుగా… మన మానవ నాగరికతా వికాసంలో ఉపయోగంలోకి తెచ్చుకుంటున్నాం. అందులో భాగమే మనం జరుపుకునే పండుగలు, వేడుకలూను! అలాంటి పండుగే తెలంగాణా సాంస్కృతిక వికాసానికి అద్దంపట్టే బతుకమ్మ.

ఒక్కసారి తెలంగాణా పల్లెల్లోని కొన్ని పాన్ డబ్బాల్లోనో..లేక పేరొందిన బుక్ స్టాల్స్ లోనో వెతికితే… బతుకమ్మ పాటల జానపద పుస్తకాలు విరివిగా దొరుకుతాయి. అందులో బతుకమ్మ చారిత్రక కథలు.. వివిధ రకాల పాటలు మనల్ని ఆ సంస్కృతితో ముడివేస్తూ కట్టిపడేస్తాయి. అందుకే తెలంగాణా అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణా అనేలాగా ఆ సాంస్కృతిక వేడుక ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రానికి.. ఓ సంప్రదాయ పండుగైంది.

మరలాంటి బతుకమ్మ పాటలంటే ఎలా ఉండాలి…?

ఇప్పుడీ చర్చెందుకంటే… స్వయానా ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత సారథ్యంలోని తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ‘అల్లీపూల వెన్నెల’ పాట.. అసలు బతుకమ్మ మూలాలకు భిన్నంగా ఉండటమే! పైగా ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్ స్వరకల్పన… మళయాళ మూలాల తమిళ వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ ఆ పాటకు దర్శకత్వం.. మిట్టపల్లి సురేందర్ పాట రచయిత… జాతీయ అవార్డ్ గ్రహీత బృందా కొరియోగ్రఫీ.. అంటే పాట ఏ స్థాయిలో ఉంటుందోనన్న అంచనాలు సహజం.

Bathukamma song released by MLC Kavithaపైగా వారం రోజులుగా ఈ పాటకు సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. అయితే ఏ. ఆర్. రెహమాన్ అనగానే ఎంత పెద్ద సంగీత దర్శకుడైనా… ఆస్కార్ విజేతైనా… నాటి ముదినేపల్లి మడిచేలో వంటి జానపదాలను దాటి ఈమధ్య పూర్తిగా వెస్ట్రనైజైపోయిన ఆ సంగీతఝరిలో బతుకమ్మ పాట కొట్టుకుపోదుకదానని.. ఆది నుంచే చాలామందిలో ఏదో సందేహం…? కానీ, చేయించుకుంటున్నది.. బతుకమ్మను భుజానికెత్తుకుని విశ్వవ్యాప్తం చేసేందుకు నడుంబిగించిన కవిత కదా… బానే చేయించుకునే యత్నమైతే జరుగుతుందన్న ఒకింత ఆశా ఉండేది. కానీ నిన్నటి మంగళవారం సాయంత్రం అది కాస్తా బద్దలైపోయింది. తెలంగాణా అస్తిత్వానికి ప్రతీకగా పాడుకునే పాటలో… జనపదమైన అసలు ఆ జానపదమే లోపించింది. ఆ పాట నిర్మాణంలో మొత్తంగా వారి చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేసింది.

దేవతలందరినీ పూలతో పూజిస్తే… ఆ పూలనే ఆరాధించే పండుగ బతుకమ్మ! కానీ, ఆ పూల ప్రస్తావనేది…? టైటిల్ లో అల్లీపూల వెన్నెల అని పెట్టేస్తే పాటమొత్తానికీ సరిపోయ్యేదేనా…? బతుకమ్మకే ప్రత్యేకమైన గునుగుపూలేవి..? బతుకమ్మ పండుగ కోసం మాత్రమే పుట్టామన్నట్టుగా పరిమళించే ఆ తంగెళ్లేవి…? ఆ పచ్చని బంతీ, చామంతుల ముచ్చట్లేవి…? రామరామరామ ఉయ్యాలో అంటూ ఆ జోలపాటేది…? చిత్తూచిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ పొగిడే ఆ అందాల ఆటెక్కడ కనిపిస్తోంది…? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆ మూలాలేవి…?

మొత్తంగా తెలంగాణా అంటేనే జానపదమనే మూలాన్ని మర్చి… అందుకు భిన్నమైన శాస్త్రీయ, లలిత సంగీత ధోరణుల్లో పల్లవించి నిరాశపర్చిన పాట ‘అల్లీపూల వెన్నెల’. తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాల్ని ఏ మాత్రం ఒడిసిపట్టుకోలేకపోయిందన్న చర్చకు తావిచ్చిన తెలంగాణా జాగృతి ఏరి కోరి రెహమాన్ తో చేయించుకున్న పాట ‘అల్లీపూల వెన్నెల’. తమిళ, మళయాళ బ్రాహ్మణ పద్ధతుల్లోని వాసనలద్ది… తెలంగాణా జానపదంపై జరిగిన ఓ సాంస్కృతిక దాడిగా కూడా ఇప్పుడు చర్చకు తెరలేపిన పాట ‘అల్లీపూల వెన్నెల’

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వమంటే పిక్చరైజేషన్ కూడా అదిరిపోతుందేమో అనుకున్నారంతా! కానీ ఇవాళ పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ప్రతీ యేటా బతుకమ్మ సమయాన విడుదల చేస్తున్న పాటలకు సరిసమానంగా కూడా బతుకమ్మ పాట దృశ్యరూపాన్ని చిత్రీకరించినట్టుగా మాత్రం కనిపించడంలేదు. పట్నం నుంచి కారులో వస్తున్న తల్లికి తమ ఊరు దగ్గరకు రాగానే చిన్ననాటి బతుకమ్మ పాట గుర్తుకువచ్చి హమ్ చేయడం… ఆ తర్వాత బిడ్డ కూడా స్వరం కలపడం.. బతుకమ్మ ప్రత్యేకతను తల్లి బిడ్డకు చెబుతున్నట్టుగా ఓ స్టోరీతో లీడ్ తీసుకోవడం మినహా…అల్లీపూల వెన్నెల పాట పిక్చరైజేషన్ లో ఏమంత గొప్పదనముందో… చేసినవాళ్లకు, చేయించుకున్నవాళ్లకే తెలియాల్సిన ముచ్చట. ప్రయోగాలు చేయడం తప్పుకాదు. అవసరమైన చోట వీలైనంత స్వేచ్ఛ తీసుకునే అవకాశాలూ ఉంటాయి. కానీ అలాంటి అవకాశం లేని చోట… పరువు, బాధ్యత కల్గిన వ్యక్తులు భుజాన వేసుకున్న ప్రాజెక్టులో… మూలాలను మర్చేలా మార్చేస్తే… కోట్ల రూపాయలు వెచ్చించి భారీగా చేసిందానికి వచ్చే పేరుకంటే… ఉన్న పేరు కాస్తా హుళక్కైతే ఎంత నామార్దా…? ఎంత నామోషీ…? అందులోనూ చేసినవారెవ్వరో సాదాసీదా వ్యక్తులైతే పర్లేదుగానీ… కవితలాంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కూతురు, అందులోనూ బతుకమ్మను సొంతం చేసుకుని ప్రచారాన్ని భుజానికెత్తుకున్న వ్యక్తి అంటే… సామాన్యుల నుంచి మేధావుల వరకూ నిశిత పరిశీలన తప్పదనే సోయి మర్చినట్టుగా ఇప్పుడు ‘అల్లీపూల వెన్నెల’ పాట చర్చకు తెర లేపుతోంది.

గంగొడ్లపై ఆడపడుచుల ఆటపాటల సోల్ మిస్సైన పాట… చెరువుగట్లపై పిల్లాపాపలతో ఆకాశంలోని నక్షత్రాలే కిందకు దిగివచ్చాయా అని అనిపించేలా కనిపించే సుందర దృశ్యరూపాన్ని కోల్పోయిన పాట… మొత్తంగా తెలంగాణా జానపద సాంస్కృతిక వైవిధ్యమే కనిపించని పాట

అందుకే అదిప్పుడు బతుకమ్మ పాటగా కంటే… అల్లీపూల వెన్నెల పాటగానే వ్యూస్ ను సంపాదించుకోవడం.. ఆర్గనైజర్స్ కి నాలుక్కర్చుకున్నంత పనే మరి!

-రమణ కొంటికర్ల

Also Read:

ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

Also Read:

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

Also Read:

అక్షరం బలి కోరుతోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్