Sunday, April 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅక్షరం బలి కోరుతోంది

అక్షరం బలి కోరుతోంది

రోజూ ప్రపంచానికి వార్తలు చెప్పే విలేఖరుల పరిస్థితి ఏమీ బాగాలేదు. విశేషంగా రాసేవారు వి లేఖరులయినా టీ వీ, డిజిటల్ సమస్త మీడియా రిపోర్టర్లు అనే అన్వయించుకోవాలి. ప్రత్యేకించి గ్రామీణ రిపోర్టర్ల బాధ రాస్తే రామాయణమంత మహా కావ్యం. లోకానికి పట్టని విషాద కావ్యం. యాజమాన్యాలు పట్టించుకోవడం మానేసిన నిర్లక్ష్య కావ్యం.

సందర్భం
ఈ మధ్య ఒక హెడ్డింగ్, మూడు సబ్ హెడ్డింగులతో ఒక గ్రామీణ విలేఖరి రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. “అర్ధాంగికి అసలైన నిర్వచనం నా భార్య” అన్న శీర్షికతో తన జర్నలిజం పరిజ్ఞానాన్ని తన భార్య పడుతున్న కష్టాన్ని వివరించడానికి కడసారి వాడుకోవడం గుండెలు పిండేసే విషాదం.

సమస్య
స్టాఫర్ (జిల్లా స్థాయిలో ప్రధాన రిపోర్టర్ ను స్టాఫర్ అంటారు) పెట్టే హింసను భరించలేక వాడికి- “మనస్తాపానికి గురిచేసిన స్టాఫర్”
అని ఒక సబ్ హెడ్డింగ్ కేటాయించాడు. యాజమాన్యం మెప్పు పొందడానికి స్టాఫర్ ఎలా టార్గెట్ల చిత్ర హింసలు పెడ్తున్నాడో కడపటి వార్తలో కన్నీటితో లిఖించాడు.

కలిసిరాని కుల వృత్తి
“కలిసిరాని కల్లు మాన్లు” అన్నది సూసైడ్ నోట్ లో మరొక సబ్ హెడ్డింగ్. జీతాలివ్వని కొలువుల్లో ఏదో ఒక వృత్తిని ప్రవృత్తిగా అయినా చేసుకుని బతుకుదామని ప్రయత్నించాడు. కుల వృత్తి- కల్లుగీత. కానీ ఖర్మ కాలి కల్లుగీత మనవాడి గీతను మార్చలేదు. అక్కడా నమ్మినవారు మోసం చేశారు. గుండెకు గాయమయ్యింది.

నా భార్యకు ఉద్యోగం అయినా ఇవ్వండి
తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన భార్యకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చేలా సునితక్క, మదన్ రెడ్డి సార్లు సహకరించాలని కడపటి విజ్ఞప్తి చేసి…
చస్తే గానీ నా బాధలు తెలియని ఈ లోకం కోసం…గంగా మాతకు ఆత్మ సమర్పణ చేసుకుంటూ…
“అందరికీ సెలవిక”
మీ
ప్రవీణ్

అని వెళ్లిపోయాడు. ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో, ఇల్లు గడవడానికి ఎన్ని అప్పులు చేశాడో, ఇల్లాలి సముద్రమంత సహనానికి ఎంతగా పొంగిపోయాడో…కానీ…లోకంలో ఉండలేకపోయాడు.

కష్టాల సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీదపడ్డా చలించకుండా ప్రసన్నంగా ఉంటున్న ఇల్లాలు లక్ష్మీప్రసన్న ప్రసన్నత నుండి ప్రవీణ్ ఏమీ నేర్చుకున్నట్లు లేడు. బతుకంతా బరువే, ముళ్లబాటే అయిన మీడియా కొలువుకే కాదు…బతుకుకే సెలవిక అని వెళ్లిపోయాడు.

లక్ష్మి లేని లక్ష్మీప్రసన్న వెక్కి వెక్కి ఏడుస్తోంది.
కలిసి రాని కల్లుమాను చుక్క చుక్కగా ఏడుస్తోంది.
మనస్తాపానికి గురి చేసిన స్టాఫర్ నక్కి నక్కి దాక్కున్నాడు.
చైర్మన్ సార్ సూసైడ్ నోట్ చదువుకుంటున్నాడు.

ఇంతకూ…
ప్రవీణ్ ది
ఆత్మహత్యా?
హత్యా?
ఎవరు పరిశోధించి రాయాలి ఈ వార్తను?
ఎవరు ప్రచురిస్తారు ఈ వార్తను?

 

ఒక ప్రవీణ్-
ఎన్నో ప్రశ్నలు.

ఒక ప్రవీణ్-
ఎన్నో చీకటి కోణాలు.

మీడియా కొలువులు-
ఎందరో ప్రవీణ్ లు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

Also Read:

ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

Also Read:

ఏ మాయ చేశావే?

RELATED ARTICLES

Most Popular

న్యూస్