Saturday, January 18, 2025
HomeTrending Newsప్రధాని మోడీ పర్యటనతో భారత్ - రష్యా బంధం బలోపేతం

ప్రధాని మోడీ పర్యటనతో భారత్ – రష్యా బంధం బలోపేతం

భారత -రష్యా మైత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనతో మరింత బలపడింది. ప్రధాని రెండో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. రష్యాలోని భారతీయులతో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్న మోడీ… రష్యా – భారత్ స్నేహాన్ని స్తుతించారు. భారత్ సుఖ, దుఖాల్లో అండగా నిలిచే ఆత్మీయ మిత్ర దేశం రష్యా అని కొనియాడారు.

రష్యా పట్ల సగటు భారతీయుడి హృదయాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రష్యాలో చలికాలం కఠినమైన వాతావరణం మైనస్ లోకి వెళ్తుందని… భారత్ రష్యా స్నేహం మాత్రం ఎల్లప్పుడూ ప్లస్ లో ఉంటుందని ప్రధాని చమత్కరించటంతో సభికులు హర్షం వ్యక్తం చేశారు. రష్యాలోని రెండు నగరాల్లో కొత్తగా కాన్సులేట్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని ప్రసంగం మధ్యలో స్నేహాన్ని రష్యా భాషలో ద్రుక్ అని ప్రస్తావించగా సభలో హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి.

అంతకు ముందు మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికారిక నివాసంలో మోడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ సాదరంగా ఆహ్వానించారు. పుతిన్‌ తన అధికారిక నివాసాన్ని  మోడికి దగ్గరుండి చూపించారు. గోల్ఫ్‌కార్ట్‌ (గోల్ఫ్‌కారు)లో షికారు చేస్తూ ఇంటి ప్రాంగణంలో కలియ తిరిగారు. మోడిని కూర్చోబెట్టుకుని గోల్ఫ్‌ కారును పుతిన్‌ స్వయంగా నడపడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు పుతిన్‌ సమ్మతించారు. వారిని ఆర్మీ విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోడీకి ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పుతిన్‌ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ప్రారంభం అయ్యాక ఆ దేశ పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్‌ ఆహ్వానం మేరకు రష్యా వెళ్లిన మోడీ… 22వ భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 10వ తేదీ ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

గడచిన పదేళ్ళలో మోడీ – పుతిన్ లు వివిధ సందర్భాల్లో 16 సార్లు భేటి అయ్యారు. ప్రధాని మోడీ – పుతిన్ ను ఆలింగనం చేసుకోవటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్ స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కిరాతక నేరస్తుడిని ఆలింగనం చేసుకున్నారని అక్కసు వెళ్లగక్కారు. ఉక్రెయిన్ వ్యాఖ్యల్ని రాజకీయ విశ్లేషకులు తేలిగ్గా కొట్టేస్తున్నారు. గతంలో కాశ్మీర్ అంశంలో భారత వ్యతిరేక విధానం అవలంభించిన ఉక్రెయిన్ ఇప్పుడు నీతులు వల్లిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాలంలో పురుడు పోసుకున్న మైత్రిని నిలబెట్టే విధంగా ప్రధాని మోడీ పర్యటన సాగిందని సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో రాజకీయాలతో సంబంధం లేకుండా భారత విదేశాంగ విధానానికి పట్టం కట్టిన మోడీ చతురతను రాజకీయ విమర్శకులు కూడా స్వాగతిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్