Saturday, January 18, 2025
HomeTrending Newsవయనాడ్ నుంచి ప్రియాంక గాంధి..?

వయనాడ్ నుంచి ప్రియాంక గాంధి..?

ఉత్తరాదిలో బలపడుతూ… దక్షిణాదిలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. వయనాడ్‌, రాయ్‌బరేలీ ఎంపి స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధి ఏ స్థానం వదులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం జరుగుతోందనే కోణంలో మేధో మధనం జరుపుతున్నారు.

ఇందులో భాగంగా రెండు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధి ఇప్పటికే పర్యటించారు. ఏ స్థానం ఉంచుకోవాలనే అంశంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాని రాహుల్ వయనాడ్ పర్యటనలో తన మనసులో మాట వెల్లడించారు. కేరళలో త్వరలో శాసనసభ ఎన్నికలు ఉన్న దృష్ట్యా పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం కోల్పోకుండా కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్ముల ప్రతిపాదిస్తోంది.

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రియాంకను వయనాడ్‌ నుంచి బరిలోకి దింపే దిశగా కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఏదో ఒక స్థానంలో మాత్రమే ఆయన కొనసాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన సోదరి కోసం వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేయనున్నారని, దీంతో అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రియాంక పోటీచేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక.. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అమెకు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ పేర్కొన్నారు కూడా. కానీ, తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె.. ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు.

తాజా లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ఇన్నాళ్లూ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలి నుంచి పోటీచేస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ రాహుల్‌ పోటీచేసి విజయం సాధించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌.. వయనాడ్‌ను అట్టిపెట్టుకుని రాయ్‌బరేలి స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పుడు వయనాడ్‌ వదిలిపెడతారని చర్చ జరుగుతున్నది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్