Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో రెండో రోజు గుజరాత్ జెయింట్స్ 34-27 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ పై విజయం సాధించింది. ఆట తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. మొదట్లో నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ ఆ తరువాత నెమ్మదిగా గుజరాత్ వైపు మళ్ళింది, ఈ దశలో పాంథర్స్ విజ్రుమ్భించి ఆడి స్కోరు 19-17కు తీసుకు రాగలిగారు. రెండో అర్థ భాగం చివర్లో జైపూర్ ను ఆలౌట్ చేసిన గుజరాత్ ఆటపై పూర్తి పట్టు సాధించి విజయం సాధించింది.
రెండో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ జట్టు పునేరి పఠాన్ ను 41-30 తో ఓడించింది. ఢిల్లీ ఆటగాడు నవీన్ కుమార్ సూపర్-౧౦ సాధించాడు, మొత్తం 14 రైడ్ పాయింట్లు, ఒక ట్యాకిల్, ఒక బోనస్ పాయిటు కూడా సాధించి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
మూడో మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ జట్టు హర్యానా స్టీలర్స్ పై 42-39 స్కోరుతో విజయం సాధించింది. పాట్నా ఆటగాడు గోయెత్ 15 పాయింట్లు సాధించి జట్టు విజయానికి తోడ్పడ్డాడు.
బెంగుళూరు, వైట్ ఫీల్డ్ లోని షేర్టాన్ గ్రాండ్ లో జరుగుతోన్న ఈ మెగా టోర్నీ బుధవారం ఆరంభమైంది. మొదటిరోజు జరిగిన ఆరంభ మ్యాచ్ లో యు ముంబా జట్టు బెంగుళూరు బుల్స్ పై 46-30 తేడాతో విజయం సాధించగా, లో తెలుగు టైటాన్స్ –తమిళ్ తైలావాస్ హోరాహోరీగా తలపడిన రెండో మ్యాచ్ 40-40తో డ్రా గా ముగిసింది. మూడో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ జట్టు 38-33 తేడాతో యూపీ యోధ పై విజయం సాధించింది.
రెండేళ్ళ విరామం తరువాత జరుగుతున్న ఈ కబడ్డీ లీగ్ లో ఈ సారి 12 జట్లు బరిలో నిలిచాయి. ఫిబ్రవరి 26 వరకూ ఆ క్రీడా వేడుక జరుగుతుంది. జనవరి 20 వరకు లీగ్ పోటీలు ఉంటాయి.
Also Read : ఛాంపియన్స్ టోర్నీ: ఇండియాకు మూడో స్థానం