Dream Machine:
“కలనైనా నీ వలపే
కలవరమందైనా నీ తలపే..”
-సముద్రాల సీనియర్
“కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది…
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది…
కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు…
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు?”
-ఆత్రేయ
“పగటి కలలు కంటున్న మావయ్యా!
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా!
మావయ్యా! ఓ మావయ్యా!”
-కొసరాజు
“అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను?”
-వేటూరి
కలల చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజామున కల వచ్చింది…రాముడు వస్తున్నాడు…రావణుడు మట్టిలో కలవడం ఖాయం…నా కల నిజమవుతుందని అశోకవనంలో సీతమ్మను ఏడిపిస్తున్న రాక్షసులకు త్రిజట చెబితే…రాక్షస స్త్రీలు నిలువెల్లా వణికిపోయారు. సీతమ్మ కూడా త్రిజట కలతో కలతమాని కుదుటపడింది.
యుగయుగాలుగా కలలు కంటూనే ఉన్నాం. చివరికి కలలను నిర్వచించడానికి స్వప్నశాస్త్రమే పుట్టింది.
అది త్రేతాయుగం కాబట్టి…త్రిజట స్వప్నం నిజమయ్యింది...ఈ కలికాలంలో మన కలలు నిజమవుతాయా? అని నిట్టూర్చాల్సిన పనిలేదు. అమెరికాలో కిరీటంలా ఉండే ఒక పరికరాన్ని ఒక స్టార్టప్ కంపెనీ ఆవిష్కరించింది. మన కరెన్సీలో దీని ధర ఒకటిన్నర లక్షల రూపాయలదాకా ఉండవచ్చు. దీనికి ‘హలో’ అని పేరు పెట్టారు.
నిద్రపోవడానికి ముందు హలో కలల కిరీటాన్ని మనం పెట్టుకుని పడుకుంటే చాలు.
1 . మన కలలను హలో చదువుతుంది.
2 . మనకు పీడకలలు, పాడు కలలు రాకుండా నియంత్రిస్తుంది.
3 . కలలోనే మనకు కొత్త విషయాలను పరిచయం చేస్తుంది. టీచర్ లా నేర్పుతుంది.
4 . అల్ట్రా సౌండ్, మెషిన్ లర్నింగ్ ఆధారంగా ‘హలో’ మన కలను పసిగట్టి…దాని కొనసాగింపుగా ఏయే సమాచారమివ్వాలో ఆటోమేటిగ్గా ఇస్తూ ఉంటుంది.
ఇందులో నైతికత, శరీర మానసిక ఆరోగ్యంపై ‘హలో’ ప్రభావం లాంటి విషయాలమీద చాలా చర్చ జరగాల్సి ఉంది.
బహుశా భారత్ మార్కెట్లోకి ‘హలో’ వచ్చిన వెంటనే నారాయణ- చైతన్య హాస్టళ్లల్లో పిల్లల నెత్తిన ఈ కలల కిరీటం పెడతారేమో! అప్పుడు నిద్రలో కూడా ఒకటి ఒకటి ఒకటి; రెండు రెండు; మూడు మూడు ర్యాంకులు రాబట్టడానికి వీలుగా పాఠాలు చెబుతూనే ఉండవచ్చు. పిల్లల కలలో కూడా చదువు సింహస్వప్నం కావచ్చు.
కలనైనా…కలవరమందైనా నీ తలపే- అని సముద్రాల అన్నది ఈ ‘హలో ‘ గురించేనా?
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది- అని ఆత్రేయ ‘హలో’ గురించి తెలియక అన్నాడేమో!
పగటి కలలేమి ఖర్మ? రాత్రి కలలు కూడా ఏమి రావాలో ముందే ప్రోగ్రామింగ్ రాసి పెట్టిన ‘హలో’ కిరీటం ఒకటి పుడుతుందని తెలిస్తే– కొసరాజు గాలిమేడలు అని ఉండేవాడా?
కలలు చెదిరిపోనివ్వని ‘హలో’ యంత్రాభరణం తలకు పెట్టుకునే రోజులు వస్తాయని తెలిసి ఉంటే- వేటూరి కలలు కదిపి పాట రాసేవాడా?
అమెరికా స్టార్టప్ ఇప్పుడు కలల కిరీటాన్ని కనుక్కుని…గొప్పలు చెప్పుకుంటోంది కానీ…
“కళ్లముందు కనిపించే ఈ ప్రపంచమే ఒక కల- నిజం కాదు” అని మన వేదాంతం ఏనాడో తేల్చి పారేసింది. అసలు కథలో పిట్ట కథలా…పెద్ద కలలో హలోది పిట్ట కల!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018