శ్రీలంక ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో అత్యంత కఠిన పరిణామాలు లంకలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంధనం లేక కొట్టుమిట్టాడుతున్నది. మళ్లీ వర్షాలు పడే వరకు పరిస్థితులు మారేలా లేవని తెలుస్తున్నది. విదేశీ మారక నిల్వలు లేక విదేశాల నుంచి చమురు దిగుమతి చేయలేకపోతున్నది. తద్వార రోజుకు 13 గంటల పాటు విద్యుత్‌కు కోత పెట్టాల్సి వస్తున్నది. కేవలం మూడు గంటలు మాత్రమె విద్యుత్ సరఫరా జరుగుతోంది. రాత్రిపూట కూడా వీధి దీపాలు (స్ట్రీట్ లైట్స్) ను ఆర్పేస్తున్నారు.
విద్యుత్‌ను ఆదా చేయడానికి దేశవ్యాప్తంగా స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేశారు. నిత్యావసర సరుకులు లేక, ధరలు ఆకాశాలను తాకుతున్న తరుణంలో విద్యుత్ కోతలు సామాన్యుడికి అదనపు భారాన్ని మోపుతున్నాయి. మళ్లీ వర్షాలు పడే వరకు కొనసాగవచ్చు. వర్షాల కోసం ఎదురుచూడటం తప్ప లంక ప్రభుత్వానికి మరో దారి లేని దుస్టితి ఏర్పడింది. మే నెల వరకు విద్యుత్ పై కోతలు కొనసాగే అవకాశం ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు నీటిని అందించే రిజర్వాయర్లలు నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.
మరోవైపు దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్ష గేద్దె దిగిపోవాల్సిందేనని దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. కొలంబోలోని దేశాధ్యక్షుడి నివాసం ముందు విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువత నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. కొలంబో ఫోర్ట్ నుంచి భారీ ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. గల్లె పేస్ నుంచి వజిరమ రోడ్ వరకు చేరుకున్న నిరసనకారులు దేశాధ్యక్షుడి నివాసం ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజపక్స కుటుంబ పాలన వల్లే దేశం అధోగతి పాలైందని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. దీంతో కొలంబోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read : కుటుంబాన్ని కాపాడేందుకు రాజపక్స ఎత్తుగడలు