Puneeth Rajkumar Is No More Died After Heart Attack :
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి17న జన్మించారు. ఆయనకు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు వందిత, ధృతి ఉన్నారు. బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన పునీత్ 1989 వరకూ 13 సినిమాల్లో నటించారు. అప్పు సినిమా ద్వారా 2002 లో కన్నడ నాట హీరోగా ఆరంగ్రేటం చేశారు. హీరోగా ఇప్పటివరకూ 32 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది అయన ‘యువరత్న’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. బుల్లి తెరపై కూడా అయన మెరిపించారు. 2012లో ‘కోట్యాధిపతి’ మొదటి సీజన్ కు అయన హోస్ట్ గా వ్యవహరించారు.
నేటి ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగుళూరు విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకొని పునీత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేల సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పునీత్ కొద్దిసేపటి క్రితం మరణించారు.
పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ లు కూడా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. పునీత్ కు ఇద్దరు సోదరీమణులు పూర్ణిమ, లక్ష్మి కూడా ఉన్నారు.
గతంలో రాజ్ కుమార్ మరణించిన సమయంలో అయన అభిమానులు బెంగుళూరులో విధ్వంసం సృష్టించారు. వారి ఆందోళనలతో మూడ్రోజులపాటు బెంగుళూరు అట్టుడికింది. నాటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇప్పటికే కన్నడ నాట సినిమా థియేటర్లు మూసివేశారు.
Must read :మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం