అంగళ్లు, పుంగనూరు ఘటనలకు టిడిపి అధినేత చంద్రబాబే కారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్నారు. పుంగనూరు పట్టణంలోకి రావడం లేదని, బైపాస్ నుంచే వెళతారని టిడిపి శ్రేణులు పోలీసులకు, మీడియాకు సమాచారం ఇచ్చారని చెప్పారు.
తమ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు వచ్చారని, బాబు టూర్ ఆలస్యం కావాడంతో తమ పార్టీ వారు వెనక్కు వెళ్ళారని, బాబు కావాలనే అలా వచ్చి పుంగనూరు లోపలకు వెళ్తానని పట్టుబట్టి, పోలీసులను దూషించారని విమర్శించారు. బాబు ఓ శాంతి కాముకుడిలా మాట్లాడారని, హఠాత్తుగా టూర్ మార్చుకుంటే పోలీసులు అభ్యంతరం తెలిపారని, వారిపై కూడా టిడిపి వారు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాబు ఇలాగే ప్రవర్తిస్తే ఎక్కడా తిరగలేరని స్పష్టం చేశారు.
తాను ఇటీవలి కాలంలో కుప్పంలో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డూ తిరుగుతున్నానని, అక్కడ వైసీపీకి ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బాబు ఇలా చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్థాయికి తగ్గట్లు కాకుండా ఓ వీధి రౌడీలా మాట్లాడారని, మొదటి నుంచీ ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతి స్థిమితం కోల్పోయి, విజ్ఞత లేకుండా… ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారని బాబుపై పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.