Punjab Congress New Rule :
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇస్తామని పార్టీ రాష్ట్ర శాఖ స్క్రీనింగ్ కమిటి ప్రకటించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన సుధీర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ చౌదరి వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటి చైర్మెన్ అజయ్ మాకెన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు, ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని, సునీల్ జాఖడ్ తదితరులు పాల్గొన్నారు.
మరో రెండు రోజుల్లో జరిగే రెండో సమావేశంలో పార్టీ టికెట్లపై స్పష్టత రానుంది. అయితే కుటుంబం నుంచి ఒకరికె పార్టీ టికెట్ పద్దతి కాంగ్రెస్ కు ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి. కుటుంబంలో ఒకరికే టికెట్ నిబంధన శాసనసభ వరకే కాకుండా లోకసభ, రాజ్యసభలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పంజాబ్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
117 శాసనసభ స్థానాలు ఉన్న పంజాబ్ లో ఈ దఫా ఎన్నికలు కాంగ్రెస్ , అమ్ ఆద్మీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 77 సీట్లు రాగా ఆప్ 20 స్థానాలు దక్కించుకుని ప్రతిపక్షంలో ఉంది. శిరోమణి అకాలిదల్ 15 సీట్లు సాధించగా బిజెపికి కేవలం మూడు సీట్లు మాత్రమె వచ్చాయి. మిగతావి స్వతంత్రులు గెలిచారు.
Also Read : కేరళ కాంగ్రెస్ చీఫ్ పిటి థామస్ కన్నుమూత