కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రాజకీయ పరిణామాలు వరుస షాక్ లు ఇస్తున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. వ్యక్తి పతనం రాజీ పడడంతోనే మొదలవుతుందని, పంజాబ్ భవిష్యత్ విషయంలో ఎలాంటి రాజీ ప్రసక్తే లేదని అయన లేఖలో స్పష్టం చేశారు. జూలై 23 న సిద్ధూ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 72 రోజులకే అయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
సిద్దుతో తీవ్ర విభేదాల కారణంగా ఈనెల 18న అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయన స్థానంలో చరణ్ జిత్ సింగ్ చెన్ని ని నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. మొన్న ఆదివారం చెన్ని తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
పార్టీపరంగా పటిష్టంగా ఉన్న పంజాబ్ లో అంతర్గత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. సమష్టి పోరాటం ద్వారా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ పార్టీ నేతల మధ్య విభేదాలు శాపంగా పరిణమించింది. కాగా, సిద్ధూ రాజీనామా విషయం తనకు తెలియదని సిఎం చెన్ని వెల్లడించారు.
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేడు ఢిల్లీ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. అయన బిజెపి వైపు చూస్తున్నారని సమాచారం. తన షరతులకు బిజెపి అంగీకరిస్తే అతి త్వరలో అయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
సిద్ధూ రాజీనామాపై అమరీందర్ సంచలన ట్వీట్ చేశారు. “నేను ఎప్పుడో చెప్పినట్లు అతనికి నిలకడ లేదు, దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ రాజకీయాలకు అతడు తగిన వ్యక్తి కాదు” అంటూ సిద్ధూను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.