Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణకు కొత్త డిజిపి..?

తెలంగాణకు కొత్త డిజిపి..?

తెలంగాణలో కొత్త డీజీపీ వస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ బాస్‌ ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం చేసిన బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవిగుప్తాకే కొత్త ప్రభుత్వం పూర్తి బాధ్యతలు ఇచ్చింది. రాష్ట్రంలో ఇటీవల చైన్‌స్నాచింగ్‌ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్‌చల్‌ చేస్తుండటం, నడిరోడ్లపైనే హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యంగానే కనిపిస్తున్నట్టు పోలీసువర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికిప్పుడు డీజీపీని మార్చితే… అనుకూలమైనవారిని కీలకపోస్టుల్లో నియమించేందుకు రంగం సిద్ధమైంది. రెడ్డి సామాజికవర్గం వారికే ఆ ఉన్నత పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. డీజీపీ రేసులో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా శివధర్‌రెడ్డి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

డీజీపీని మార్చాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అడిషనల్‌ డీజీ ర్యాంకులో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డికి డీజీపీగా ప్రమోషన్‌ ఇవ్వనున్నారని సమాచారం. డీజీ హోదా కలిగిన జితేందర్‌ కు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ ఏసీబీని ఓ గాడిలో పెట్టడంతో ఆయన్నే ఏసీబీ డీజీగా కొనసాగిస్తారని చెప్తున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌ ఇప్పటికే డీజీపీగా చేయడం, అదే బ్యాచ్‌కు చెందిన రవిగుప్తా డీజీపీగా కొనసాగుతుండటం, 1991వ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోవడంతో 1992వ బ్యాచ్‌కు చెందిన జితేందర్‌ డీజీపీగా నియమిస్తారనే చర్చ కొనసాగుతున్నది.

సీనియర్‌ అయిన జితేందర్‌, సీవీ ఆనంద్‌ లలో ఒకరికి డీజీపీ అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని డీజీపీగా నియమించినా. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది త్రైమాసికంలో డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారంలోపే సీనియర్‌ ఐపీఎస్‌లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్టు తెలిసింది.

డీజీ హోదాలో చోటుచేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్ ఐపీఎస్ లో ఇద్దరిలో ఒకరికి డీజీ ర్యాంక్ దక్కే అవకాశం కనిపిస్తోంది.1994 బ్యాచ్ కు చెందిన అదనపు డీజీలు శివధర్ రెడ్డి, శిఖ గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, వినాయక ప్రభాకర్ ఆప్టేలలో ఇద్దరికీ డిజి హోదా దక్కనుంది. వీరిలో ఆప్టే కేంద్ర సర్వీసులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డిలకు డిజి ర్యాంక్ ఛాన్స్ కనిపిస్తోంది.

మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లకు కొత్త బాస్ లు రానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ శివధర్ రెడ్డి డిజిపిగా వెళితే ఆయన స్థానం సిపి శ్రీనివాస్ రెడ్డి భర్తీ చేస్తారని పోలీసు వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్