Tuesday, December 3, 2024
HomeTrending Newsఐదోసారి అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం

ఐదోసారి అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం

ర‌ష్యా దేశాధ్య‌క్షుడిగా ఇవాళ వ్లాదిమిర్‌ పుతిన్ ఐదోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది. ప్ర‌త్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజ్యాంగానికి చెందిన ఒక ప్ర‌త్యేక కాపీపై చేయి వేసి దేశానికి సేవ చేయ‌నున్న‌ట్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. 2020లో జ‌రిగిన స‌వ‌ర‌ణ‌ల‌తో కూడిన రాజ్యాంగ పుస్త‌కాన్ని ప్ర‌మాణ స్వీకారం వేళ వినియోగించారు.

జాతీయ పార్ల‌మెంట్‌కు చెందిన చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు, న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జ‌స్టిస్ వ‌లెరి జోర్కిన్ .. పుతిన్ అయిదోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని ద్రువీక‌రించారు. 2000, 2004, 2012, 2018 సంవ‌త్స‌రాల్లో పుతిన్ ప్ర‌మాణం చేశారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పుతిన్ 87.28 శాతం ఓట్ల‌తో గెలుపొందారు. దీంతో మ‌రో ఆరేళ్ల పాటు ర‌ష్యా అధ్య‌క్షుడిగా పుతిన్ కొన‌సాగ‌నున్నారు.

2030 వరకు అధికారంలో కొనసాగనున్న పుతిన్ విధానాలతో అమెరికాకు తిప్పలు తప్పవు. అమెరికా, నాటో దేశాల ఎత్తుగడలతో సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఉక్రెయిన్ దేశాన్ని దారిలోకి తీసుకొచ్చేందుకు రష్యా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రష్యా సైన్యంలో విధులు నిర్వహించిన పుతిన్ విధానాలు సహజంగానే అమెరికా, యూరోప్ దేశాలను వ్యతిరేకించే విధంగా ఉంటాయి. ఆసియ ఖండంలో అమెరికా కుయుక్తులను అడ్డుకోవాలంటే రష్యా అధ్యక్షుడుగా పుతిన్ ఉండటమే శ్రేయస్కరమని అంతర్జాతీయ సంబందాల వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్