Beauty of Penugonda: హరిహర రాయలు 1336-1350 ప్రాంతాల్లో విద్యానగరాన్ని పాలిస్తున్నప్పుడు వారి తమ్ముడు బుక్కరాయలు పెనుగొండలో రాజప్రతినిధిగా నివసించాడట! బుక్కరాయలు విజయనగర రాజైనప్పుడు అనంత సాగరుడు పెనుగొండ కోటను కట్టించాడు. కృష్ణదేవరాయలు వేసవి విడిదిగా పెనుగొండను తీర్చిదిద్దాడు. తళ్ళికోట యుద్ధానంతరం తిరుమలరాయడు పెనుగొండను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. నిజాం మూడుమార్లు దండెత్తిరాగా తిరుమలరాయడు మూడుమార్లూ అతడిని తరిమికొట్టాడు. విజయనగర సామ్రాజ్యంతో ఇంతటి గాఢానుబంధం కలిగిన ‘పెనుగొండ’లో 1929లో జరిగిన కృష్ణరాయలవారి జయంతి వేడుకలు; వెన్నెల విందులు పుట్టపర్తివారిని అమితంగా ఆకర్షించి ఉంటాయి. అప్పటికి వారి వయస్సు 15 ఏళ్లు. అప్పటికి మూడేళ్ల ముందే రాసిన “పెనుగొండలక్ష్మి” కావ్యంలో దర్శించిన వైభవాలన్నీ ఆ ఉత్సవాల్లో కళ్లముందు కదలాడి ఉంటాయి.
పెనుగొండ కోటను చూస్తూ…అక్కడ శత్రువుల హృదయాలను అల్లకల్లోలం చేసిన ఆంధ్ర వీర్యాగ్ని శౌర్యాన్ని చూస్తూ పెరిగిన పుట్టపర్తిలో పరవశమే “పెనుగొండలక్ష్మి” కావ్యమయ్యింది.
బంగారు పల్లకీల్లో కవులను కూర్చోబెట్టి పండితులు వారిని కీర్తిస్తుండగా సార్వభౌముడు వారిని తాను స్వయంగా మోసుకుని వచ్చిన ఒకనాటి దృశ్యం పుట్టపర్తివారికి కనిపించింది. మరుక్షణం- ఇప్పటి రాజవీధి నీరవంగా, నిస్తేజంగా, నిర్వీర్యంగా కనిపించింది. అలల ధాటికి తమ్మిరేకుల్లా బంధాలన్నీ చెల్లాచెదురైన వాస్తవాన్ని రామబురుజుల దగ్గర నెమరు వేసుకున్నారు.
ఈ కావ్యమంతా గత వైభవ ఘనకీర్తిని గానం చేస్తూ దాన్ని పునరుజ్జీవింపచేయగలిగే శక్తి యుక్తులను అలవర్చుకోవాలన్న సందేశం వినిపిస్తుంది. అందుకే “విచ్చు నలవాటు గల మల్ల విరులదెవడు – విరుగడను వెచ్చి గుణముదప్పిరారువాడు?” అని చదువరుల హృదయాలలో ప్రశ్నను ప్రతిధ్వనింపచేస్తారు.
పుట్టపర్తి వారి మనసులో గుబాలించిన మల్లెల సౌరభం పెనుగొండ ఉద్యానవనాల్లోనిదే. ఘనగిరిగా ప్రసిద్ధమైన పెనుగొండ రాయల కాలంలో దానిమ్మ తోటలకు. ద్రాక్ష తోటలకు, లవంగలతికలకూ ఆకరంగా ఉండేదట. పెనుగొండలో విహరించి అక్కడి మల్లెపూల గుబాళింపులకు పులకించి ద్రాక్ష తోటల సోయగాలకు సొగసి అల్లసాని పెద్దన హిమాలయసానునుసీమల ప్రకృతి సౌందర్యాన్ని అంత హృద్యంగా రూపుకట్టించాడని, భట్టుమూర్తి వసుచరిత్ర నేపథ్యమంతా ఘనగిరి ఘనతేనని పుట్టపర్తి వారి ప్రగాఢ విశ్వాసం.
పెనుగొండ లక్ష్మి పుట్టపర్తి వారి ఆదికావ్యం. వారి పన్నెండేళ్ళ వయసులో అవతరించిన కావ్యం. 1935లో దేశబంధు ముద్రాక్షరశాలలో ముద్రింపబడింది. అంటే పుట్టపర్తి వారికి 27సంవత్సరాలు. వారు విద్వాన్ పరీక్షకు కూర్చునే నాటికి ఈ పెనుగొండ లక్ష్మి వారికే పాఠ్య గ్రంథంగా ఉండడం ప్రపంచ సాహిత్య చరిత్రలో ఏ కవి జీవితంలోనూ జరిగి ఉండని అత్యంత అపురూప ఘటన.
పుట్టపర్తి వారి ఈ రచనలో ఒక్కో పద్యం ఒక అనర్ఘ రత్నం. ప్రత్యక్షరం అమృత గుళిక. అందుకే అది నాటికీ నేటికీ చారిత్రిక కావ్యంగా క్షేత్ర ప్రశస్తిని అత్యద్భుతంగా రూపుకట్టిన కావ్యంగా ప్రథమ శ్రేణిలో నిలిచి ఉంది.
పెనుగొండలోని దేవాలయ శిల్ప సంపద పుట్టపర్తివారి మనోయవనికపై ముద్ర వేసింది. విజయనగర రాజ వంశీకులకు శ్రీ వైష్ణవ సంప్రదాయ గురు పీఠాన్ని అధిరోహించిన తిరుమల తాతాచార్యుల వారి కుటుంబంవారమన్న స్వాభిమానం వారిలో మెండు. పెనుగొండలక్ష్మి కావ్యం తరువాత కూడా విజయనగర సామాజిక చరిత్ర, వసుచరిత్ర, సాహితీ సౌరభం మొదలైన రచనలు, విజయనగర సామ్రాజ్య వైభవం గురించిన విస్తృత ఉపన్యాసాలు, పరిశోధనలు, పీఠికల వెనుక మా నాన్నగారి వెంట అంటి ఉండి ప్రచోదకశక్తిగా, నవనవోన్మేష స్పూర్తిని అందించినది – తరతరాలుగా వారి వెన్నంటి వచ్చిన అనుబంధ మాధుర్యమే.
కృష్ణదేవరాయలవారి రాజ్యాభిషేక పంచశతాబ్ది ఉత్సవాలు దేశమంతా వైభవోపేతంగా జరుగుతున్న తరుణాన రాయలవారి వేసవి విడిదిగా వైభవప్రభావాలను చవిచూసిన పెనుగొండ రాజ్యరమను ఆవిష్కరించిన మా నాన్నగారి ఆదికావ్యం పెనుగొండలక్ష్మిని పునర్ముద్రించే భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రాయల పరిపాలనలోని సుగుణాలను, మతసామరస్య సౌమనస్యాన్ని, సాంస్కృతిక పరిరక్షణాతత్పరతను, సాంఘిక జీవన సమతుల్యతను. నేటి పరిపాలనా వ్యవస్థలోనూ అమలుపరిచిననాడు మళ్ళీ అప్పటిలా పురవీధుల్లో నవరత్నరాసుల అమ్మకాన్ని చూడగలమేమోనన్న ఆశాభావం మళ్ళీ మొలకెత్తేలా ఓసారి కృష్ణరాయల ఘనకీర్తికి జై కొట్టాలని ఉంది నాకు. మరి మీరు కూడా అలా జై కొడుతూ పెనుగొండలక్ష్మిని ఆస్వాదించండి.
రేపు- పెనుగొండలక్ష్మి-3
“మా పెనుకొండ”
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి వ్యాసం
– డా. పుట్టపర్తి నాగపద్మిని
78939 76644
రచయిత గురించి:- డా. నాగపద్మిని గారు పుట్టపర్తి నారాయణాచార్యులవారి కూతురు. హిందీ సాహిత్యంలో పి జి, పి హెచ్ డి చేశారు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయ్యారు. పుట్టపర్తివారి శివతాండవాన్ని హిందీలోకి అనువదించారు. తెలుగు సాహిత్యంలో కూడా లోతయిన అభినివేశం ఉన్నవారు. తన తండ్రి సాహిత్యాన్ని ప్రస్తుత ప్రపంచానికి పరిచయం చేయడానికి విస్తృతంగా కృషి చేస్తున్నారు. “పుట్టపర్తి సాహిత్యంలో భారతీయ సంస్కృతి” అన్న విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖ సీనియర్ ఫెలో షిప్ పథకం కింద రెండు సంవత్సరాల కాల పరిమితిలో ఇటీవల పరిశోధనా గ్రంథం సమర్పించారు.
(పెనుగొండలక్ష్మి కావ్యాన్ని 2010లో పునర్ముద్రించినప్పుడు నాగపద్మిని గారి ముందుమాట ఇది. ఈ వ్యాసాన్ని వాడుకోవడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు)