Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅన్నమయ్య పదబ్రహ్మోత్సవం-8

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-8

A thesis on Annamayya: పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-90) పద్నాలుగు భాషల్లో అభినివేశం ఉన్న కవి. విమర్శకుడు. పదమూడో ఏటనుండి చనిపోయేవరకు రాశారు. చివరి క్షణం వరకు విద్యార్థిగా నేర్చుకున్నారు. సాహిత్యంలో ఆయన అధిరోహించిన శిఖరాలు సమున్నతమైనవి. శివుడి తాండవానికి తెలుగు పదాల మువ్వలు కట్టిన వైష్ణవుడాయన. “సరస్వతీపుత్ర” బిరుదాంకితుడు. 1973లో హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్తు రజతోత్సవ సందర్భంగా అన్నమయ్య పదకవితలు అన్న అంశంపై పుట్టపర్తివారి ఉపన్యాసం 2012లో ప్రచురితమయిన “త్రిపుటి” సంకలనంలో ఉంది. ఒక పరిశోధన సిద్ధాంత గ్రంథం స్థాయి ఉపన్యాసమది. 26 పేజీల ఆ సుదీర్ఘ వ్యాసం నుండి కొన్ని విషయాలివి.

ఒకప్పుడు ఆంధ్ర, కర్ణాటకల్లో భక్తి- జ్ఞానం- కర్మ మొదలైనవి పండితుల భాష. సామాన్యుల చెవిలో ఇవి పడడానికి వీల్లేదన్నట్లు తమలో తాము పండితులు రాద్ధాంతాలు చేసుకునేవారు. ఇలాంటివేళ బసవేశ్వరుడు పుట్టాడు. అతడొక మహాజ్వాల. సామాన్య ప్రజలపైనే అతడి దృష్టి. అత్యంత సరళమయిన జనం భాషలో ఉండే అతడి వచనాలు కారుచిచ్చులా అన్నివైపులా వ్యాపించాయి. ఈ మార్గంలో కన్నడనాట వీరశైవుల వచన వాఙ్మయం హిమాలయమంత ఎత్తుకు ఎదిగింది. పాల్కురికి సోమనాథుడు ఈ ప్రభావంతోనే తెలుగులో ద్విపద రచన చేపట్టాడు. ప్రజల భాషలో వచనాలకు దక్కిన అనన్యసామాన్యమైన గౌరవాన్ని చూసి “దాసరకూటములు” ఏర్పాటు చేసినవాడు శ్రీపాదరాయలు. పురందరదాసు, కనకదాసు, వాదిరాజు, విజయరాయలు, జగన్నాథదాసు…ఇలా కుప్పలు తెప్పలుగా పదకర్తలు పుట్టుకొచ్చారు. జనం అక్కున చేర్చుకుని పదకవితలను నెత్తినపెట్టుకున్నా…పండితులు మాత్రం పదకవితలను పట్టించుకోలేదు. చిన్నచూపు. మడి, ఆచారం తక్కువ అని వెక్కిరించారు. సామాన్యులకు పండిత చర్చతో పనిలేదు. వారి భక్తికి, తన్మయ గానానికి, సామూహిక భజనలకు పదకవితలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి.

ఇలాంటివేళ పుట్టి పెరిగిన అన్నమయ్యను పదకవితలు పట్టుకున్నాయి. నిజానికి అన్నమయ్య చదువు, ఆయన కలానికి అందిన కవితా సామగ్రి అంతా కావ్యానికి పనికి వచ్చేది. ఆయన పద్యకవి అయి ఉంటే మరొక నాచన సోమన అయి ఉండేవాడు. కావ్యకర్త కావాల్సినవాడు పదకర్త అయ్యాడు. అదే మన భాగ్యమయ్యింది. తెలుగు సాహిత్యానికి ఒక కొత్త మార్గమయ్యింది.

అన్నమయ్య అంటే విష్ణువు పేరు అని ఆయన మనవడు వివరణ ఇచ్చుకున్నాడు కానీ.. విష్ణువుకు అన్నమయ్య అన్న పేరెక్కడ ఉందో? ఎలా వచ్చిందో? మనకు తెలియదు. అన్నమయ్య మొట్టమొదట- చిట్టచివర రాసిన కీర్తన ఏదో ఆయన కొడుకులు, మనవళ్లు కనుక్కోలేకపోయారు. రాగిరేకులను వెలికి తీసిన పండితులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు లేరు.

తాళ్లపాక పల్లెటూరు. అందరికీ వ్యవసాయమే ముఖ్యవృత్తి. అన్నమయ్య కూడా చదువుకుంటూ వ్యవసాయం పనులకు వెళ్లేవాడు. సామాన్యుల మాండలిక భాషలో ఉన్న అందం అన్నమయ్యను కట్టి పడేసింది.

ఎన్నోసార్లు తిరుమలకు కాలినడకన వెళ్లాడు. తిరుమలతో పాటు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు. తలపు తలపులో వెంకన్నే. మాట్లాడిన మాటలన్నీ పదకవితలు అయ్యాయి. పిల్లాడు భక్తిపిచ్చిలో ఉన్నాడని తిక్క కుదురుతుందని ఇద్దరినిచ్చి పెళ్లి చేశారు. దాంతో శృంగార పద రచన రెండింతలయ్యింది. పదకవితా పితామహుడన్న బిరుదు వచ్చింది. సంకీర్తనాచార్యుడు అని లోకం పొగుడుతోంది. లోకం బ్రహ్మరథం పడుతోంది. కొంత వయసు మీద పడింది. భగవంతుడి పదరచనలే చేస్తున్నా…భగవంతుడు తనకు దక్కలేదే అన్న తపన పెరిగింది. ఇక్కడి నుండే అన్నమయ్య జీవితంలో నిజమైన సాధన ప్రారంభమైనట్లుంది.

ఇన్నాళ్లు చదివిన చదువు; రాసిన రాతలు; పాడిన పాటలు అన్నమయ్యకు తృప్తినివ్వలేదు. దిక్కుతోచడం లేదు. తిరుపతి- తాళ్ళపాక మధ్య ఆసువలె తిరుగుతున్నాడు. ఇక్కడి నుండి అన్నమయ్య వెంకన్నను చూసే దృష్టి మారిపోయింది. తన మనసులో ఉన్నదంతా వెంకన్నకే చెప్పుకోవడం మొదలుపెట్టాడు. వెంకన్నను నిలదీశాడు. ప్రశ్నించాడు. మొహమాటపెట్టాడు. సవాలు చేశాడు. వెంకన్న కాక ఇంకేదీ కనిపించని, వినిపించని స్థితికి చేరుకున్నాడు. ముందు వెంకన్న చుట్టూ అన్నమయ్య తిరిగితే…తరువాత అన్నమయ్య చుట్టూ వెంకన్నే కోరి కోరి తిరిగాడు.

తెలుగు పదకవితకే కాదు…కొత్త తెలుగు పదాలను సృష్టించడంలో కూడా అన్నమయ్య మార్గదర్శి. తిక్కనను కూడా దాటిపోయిన కవితా శైలి. త్యాగయ్య కీర్తనలు నాద ప్రధానాలు. అన్నమయ్యకు సంగీతం చాలా అల్పమైన విషయం. ఒక్కోసారి ఒక్కో గంధర్వుడు భూలోకంలో అవతరిస్తాడు. అన్నమయ్య అలా అవతరించి…ముక్తి పొందినవాడు.

(డా. పుట్టపర్తి నాగపద్మినిగారి సౌజన్యంతో…
దీనితో అన్నమయ్య పదబ్రహ్మోత్సవం ధారావాహిక సమాప్తం)

అన్నమయ్య పద బ్రహ్మోత్సవం ధారావాహికకు ఉపయోగించుకున్న పుస్తకాలు:
1. తిరుమల-తిరుపతి దేవస్థానం – TTD అన్నమయ్య సంకీర్తనలహరి సంకలనాలు
2. శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వ్యాసాలు
3. శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ పరిష్కరించిన అన్నమయ్య కీర్తనలు
4. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వ్యాసాలు
5. ఆచార్య రవ్వా శ్రీహరి అన్నమయ్య పదకోశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్